ఇటీవలికాలంలో ఆకతాయిల ఆగడాలకి అడ్డూ… ఆపూ… లేకుండా పోతుంది. నిర్దిష్ట ప్రదేశాలని ఎంచుకొని అక్కడ బైక్ రేస్ లు చేస్తూ… అటుగా వచ్చే పోయే జనాలకి ఆటంకం కల్గిస్తున్నారు. అడిగే నాధుడు లేక… అడ్డుకొనే ధైర్యం చాలక… ప్రజలు నానావస్థలు పడుతున్నారు.
మొన్నామధ్య హైదరాబాద్ లో కాస్ట్లీ బైక్ లతో ట్యాంక్ బండ్ పై ఓవర్ స్పీడ్ తో వెళుతూ హంగామా సృష్టించారు రేసర్లు. ఈ క్రమంలో క్రింద పడడంతో ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి.
అలాగే ఇటీవల విజయవాడలో దుర్గగుడి ఫ్లై ఓవర్ పై ఐదుగురు స్టూడెంట్స్ బైక్ స్టంట్స్ చేస్తూ పట్టుబడ్డారు. వారికి, వారి తల్లిదండ్రులకి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఇక రీసెంట్ గా మళ్ళీ దుర్గగుడి ఫ్లై ఓవర్ పైన ఇద్దరు ఆకతాయి కుర్రాళ్ళు తమ ఇష్టానుసారంగా రేసింగ్ విన్యాసాలు చేస్తున్నారు. దీనికితోడు, బైక్ హ్యాండిల్ వదిలేసి… బైక్ పై నిలబడి… గన్ తో గాలిలోకి కాల్చుతూ… హల్చల్ చేస్తున్నారు.
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో, మరియు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు వీరిని గుర్తించారు. ఫోటో షూట్ పేరుతో వీరు ఈ విన్యాసాలు చేసినట్లు గుర్తించారు. యువకులు బొమ్మ తుపాకీతో విన్యాసాలు చేసినట్లు తేలింది. ఏదేమైనా ప్రజలని భయభ్రాంతులకి గురిచేస్తున్న కారణంగా వీరిని తమ కస్టడీలోకి తీసుకొన్నారు.
పదేపదే ఇలాంటి విషయాలు పోలిసుల దృష్టికి రావటంతో ఈసారి ఇలాంటి వారిపై గట్టి చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు, ఇకపై ఎవరైనా ఈ విధంగా బైక్ రేస్ లకు పాల్పడితే, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు. వీటన్నిటికంటే ముందు అసలు పేరెంట్స్ తమ పిల్లలు ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని తెలిపారు. అల్లారు ముద్దుగా పెంచుకోవడం, ఖరీదైన బైక్స్ కొనివ్వటమే కాదు తమ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా గమనించాలని అంటున్నారు. వరుసపెట్టి ప్రమాదాలు జరుగుతున్నా యువతలో ఏ మాత్రం మార్పు రావట్లేదు. రోడ్లపై, పబ్లిక్ ప్లేసెస్ లో రేసింగ్ చేస్తే ఏ క్షణమైనా ప్రాణాలు గాల్లో కలిసిపోవచ్చు. ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా పోతుంది. ఏమన్నా జరిగితే తర్వాత ఇబ్బంది పడేది వారి కుటుంబమే! అని హితవు పలికారు.