సముద్రపు ఒడ్డున ఇసుకతో చేసే అందమైన కళాకృతులని ‘సైకత శిల్పాలు’ అంటారు. ఈ కళాకృతుల కోసం కళాకారులు వ్యయ ప్రయాసలకోర్చి ఎంతో అందంగా తీర్చి దిద్దుతారు. అయితే, వీరి కష్టం ఎంతో కాలం నిలవదు. కొద్ది రోజుల్లోనే అవి నీటిలో కలిసి కనుమరుగైపోతాయి. అయినప్పటికీ ఆర్టిస్టులు తమ అభిరుచిని వదులుకోలేక తమ ప్రతిభనంతా చూపించి… ఆ శిల్పాలు చెక్కుతారు.
ఇక తాజాగా రామాయణంలోని ఘట్టాలను వివరిస్తూ… సైకత శిల్పాలు చెక్కాడు ఓ వ్యక్తి. అయోధ్యకు చెందిన రూపేష్ సింగ్ అనే కళాకారుడు రామాయణంలోని ప్రసిద్ధ ఘట్టమైన ‘భరత్ మిలాప్’ ని, దానితోపాటు రాముడు, సీత, లక్ష్మణుడికి సంబంధించిన సైకత శిల్పాలని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.
నిజానికి రామాయణంలోని సన్నివేశాలను వర్ణించేలా ఇసుకలో బొమ్మలు గీయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పనే! కానీ, రూపేశ్ సింగ్ కి మాత్రం ఆ పని చాలా ఈజీ. భారతీయ ఇతిహాసాల్లో రామాయణానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఈ మహాకావ్యాన్ని ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా అభివర్ణించారు.
ఒకవైపు అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుంది. ఇంకోవైపు దీపావళి ముందు నిర్వహించే దీపోత్సవానికి అయోధ్య ముస్తాబవుతుంది. మరోవైపు ఈ సైకత శిల్పాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
నిరుపేద కుటుంబానికి చెందినా రూపేష్ సింగ్… పెయింటింగ్ నేర్చుకోవడానికి అయ్యే ఖర్చును భరించలేక… ఈ సైకత కళని ఎంచుకున్నాడు. తనలో ఉన్న ఆర్ట్ ని ఉపయోగించి… సులువుగా ఇసుక ద్వారా కళాఖండాలను సృష్టిస్తున్నాడు. ఈ నేపద్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద సైకత శిల్పాన్ని రూపొందించాలనేది అతని కల. అందుకే రామాయణ మహాకావ్యాన్ని ఎంచుకొని… దానిని ఇసుకలో చెక్కి… రికార్డు క్రియేట్ చేశాడు.
ఇక యూపీ ప్రభుత్వం ప్రతి ఏటా దీపావళికి ముందు అయోధ్యలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. ఈ ‘దీపోత్సవ్’ సందర్భంగా ‘రామ్ కీ పైడి’లో ఉన్న 28 ఘాట్ల వద్ద సుమారు తొమ్మిది లక్షల దీపాలని వెలిగిస్తారు. ఆ ప్రదేశంలో ఈ సైకత శిల్పాలు అయోధ్యకే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.