మహాభారత ఇతిహాసంలో మనకి తెలిసిన పాత్రలన్నీ చాలా వరకు యోధుల గురించి, కురుక్షేత్ర సంగ్రామంలో వారి ప్రాముఖ్యత గురించి, ఇంకా యుద్ధ సమయంలో వారు ఎవరెవరిని ఓడించారు, ఎవరు ఎలా మరణించారు అనే విషయాల గురించి మాత్రమే. అయితే, కొందరు ఈ కురుక్షేత్రంలో పాల్గొనకపోయినప్పటికీ ఈ ఇతిహాసంలో వారికి ఎంతో ప్రముఖమయిన స్థానం ఉంది. అలాంటి వారిలో సంజయుడు ముఖ్యుడు. ఇతను ఎన్నో ధర్మాలు తెలిసిన రాజనీతి పరుడు. ఇప్పుడు మనం ఈ సంజయుడి గురించి, మహాభారతంలో ఇతని ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాము.
సంజయుడు ఎవరు?
సంజయ అంటే సంస్కృత భాషలో విజయం అని అర్ధం. సంజయుడు సూత కుమారుడు. ఇతని తండ్రి అయిన గవల్గణ ఒక రథసారధి. సంజయుడు వ్యాస మహాముని దగ్గర విద్యాభ్యాసం చేసాడు. కొన్ని కథలలో సంజయుడు, ఇంకా దృతరాష్ట్రుడు ఇద్దరూ వ్యాస మహాముని దగ్గర కలిసి శిష్యరికం చేసారని చెబుతారు. పెద్దయిన తరువాత సంజయుడు కురు సామ్రాజ్యానికి రాజయిన, అంధుడైన ధృతరాష్ట్రుడికి రథసారథిగా ఇంకా సలహాదారుడిగా కూడా ఉన్నాడు. సంజయుడి జననం గురించి, వ్యాస మహాముని దగ్గర అతని విద్యాభ్యాసం గురించి, ఇంకా ధృతరాష్ట్రుడికి అతను రథసారథిగా, నమ్మకమయిన సలహాదారుడిగా ఉన్న విషయాల గురించి మహాభారత ఇతిహాసంలోని ఆది పర్వంలో వివరించారు.
కురుసభలో సంజయుడి ప్రాముఖ్యత
దృతరాష్ట్రుడు రాజ్యపాలన చెయ్యటంలో సంజయుడి పాత్ర చాలా ముఖ్యమయినది. ఎల్లప్పుడూ దృతరాష్ట్రుడితో ఉంటూ, అతనికి అంధత్వం ఉన్నదనే లోపం తెలియకుండా ధృతరాష్ట్రుడికి రెండు కళ్ళ లాగా నడుచుకున్నాడు. ఎంతో నమ్మకంగా దృతరాష్ట్రుడిని అంటి పెట్టుకొని ఉండి, అతనికి నమ్మకమైన సలహాదారుడిగా కూడా గుర్తింపు పొందాడు. సభలోని అందరూ కురు పెద్దలలో ఒకరిగా సంజయుడిని కూడా గౌరవించేవారు.
సంజయుడికి వ్యాస మహాముని ఇచ్చిన గొప్ప వరం
అంధుడయిన ధృతరాష్ట్రుడికి సలహాదారుడిగా ఉండటం మినహా సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం కూడా చెయ్యలేదు. మరి మహాభారతంలో ఇతని ప్రాముఖ్యత ఏమిటి అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
రథసారథికి జన్మించినప్పటికీ సంజయుడు కృష్ణ ద్వైపాయన మహాముని దగ్గర శిష్యరికం చేసాడు. కృష్ణ ద్వైపాయన అంటే మరెవరో కాదు…మహాభారత ఇతిహాసాన్ని రచించిన, మనందరికీ తెలిసిన వేదవ్యాసుడు.
రాయబారం ముగిసి ఇంక యుద్ధం అనివార్యం అని తెలిసినప్పుడు దృతరాష్ట్రుడు ఎంతగానో కుమిలిపోతాడు. దృతరాష్ట్రుడి ఈ పరిస్థితి దివ్య దృష్టితో తెలుసుకున్న వ్యాస మహాముని వెంటనే అక్కడకు వచ్చి యుద్దానికి సంబంధించిన అన్ని సంఘటనలు కనిపించే విధంగా ధృతరాష్ట్రుడికి చూపు ప్రసాదిస్తానని చెప్తాడు.
అయితే దృతరాష్ట్రుడు వ్యాసుడి ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. తాను ఆ భయంకరమయిన, భీతి గొలిపే హింసను, యుద్ధంలో జరిగే హత్యలు చూడలేనని, యుద్ధనికి సంబంధించిన వార్తలను వినగలిగితే చాలని వ్యాస మహామునిని వేడుకుంటాడు. అప్పుడు వ్యాస మహాముని దృతరాష్ట్రుడి పరిస్థితిని అర్ధం చేసుకొని సంజయుడికి యుద్ధభూమిలో అక్కడ జరుగుతున్న సంఘటనలు అన్నీ చూసేలాగా శక్తి ప్రసాదించి, సంజయుడి ద్వారా అన్నీ తెలుసుకోమని ధృతరాష్ట్రుడికి చెప్తాడు.
దీని వలన సంజయుడు తనకు ఎదురుగా ఎంతో దూరంలో ఉన్న సంఘటనలను కూడా అక్కడే ఉన్నట్లుగా చూడగలడు. కేవలం చూడటమే కాకుండా అక్కడ జరుగుతున్న సంభాషణలు, ఇంకా ఇతర శబ్దాలు కూడా స్పష్టంగా వినగలిగే శక్తి సంపాదిస్తాడు. దీని గురించి మహాభారతంలోని భీష్మ పర్వంలో వివరంగా చెప్పారు.
చాలా మంది ఋషులకు, దేవతలకు సూక్షదృష్టి ఉంటుంది. ఈ శక్తి వలన, వీళ్ళు తమ జ్ఞానంతో భూత, భవిష్యత్ కాలాలలో జరిగిన విషయాలను తెలుసుకునేవారు. అయితే సంజయుడికి ఉన్నది దివ్యదృష్టి. దీని వలన జరుగుతున్న సంఘటనలను ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ సంఘటన జరుగుతున్న ప్రదేశంలోనే ఉన్నట్లుగా అన్నీ వివరంగా తెలుస్తాయి. ఒక సాధారణ వ్యక్తి విని భయపడేటటువంటి శబ్దాలను కూడా సంజయుడు చాలా స్పష్టంగా వినగలడు.
ఇది కూడా చదవండి: Shalya in Mahabharata: Uncovering His Role and Significance
సంజయుడి కళ్ళతో కురుక్షేత్ర సంగ్రామాన్ని చూసిన దృతరాష్ట్రుడు
వ్యాస మహాముని ఇచ్చిన శక్తితో అంధుడయిన ధృతరాష్ట్రుడికి సంజయుడే యుద్ధ సమయంలో రెండు కళ్ళు అయ్యాడు. హస్తినాపురంలో రాజమందిరంలో దృతరాష్ట్రుడి పక్కనే కూర్చొని ఉంటూ, ధృతరాష్ట్రుడికి అన్ని విషయాలూ పక్షపాతం లేకుండా జరిగింది జరిగినట్లుగా వివరించి చెప్పేవాడు.
అయితే మరి కొన్ని గ్రంథాలలో, సంజయుడు దృతరాష్ట్రుడి పక్కన కూర్చొని యుద్ధభూమిలో జరిగే సంఘటనలు చూడలేదు అని చెప్పారు. అతనికి యుద్ధభూమిలో ఉన్నా కూడా ఎవరి కంటికీ కనపడకుండా, ఇంకా ఎటువంటి గాయాలు అవ్వకుండా వ్యాస మహాముని శక్తి ప్రసాదించాడని… ఆ శక్తి వల్లనే సంజయుడు ప్రతి పది రోజులకు ఒకసారి దృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి యుద్ధభూమిలో జరిగిన విషయాలు వివరించాడని అంటారు.
కానీ, కురుక్షేత్ర యుద్ధం మొత్తం జరిగినది 18 రోజులు మాత్రమే కదా! ఈ ప్రకారంగా చూసుకుంటే, సంజయుడు కేవలం ఒక్కసారి మాత్రమే యుద్ధం మధ్యలో దృతరాష్ట్రుడిని కలవడానికి హస్తినాపురానికి వచ్చాడని అనుకోవాలి. అయితే ఈ తార్కికం అంత సమంజసంగా అనిపించటం లేదు.
యుద్ధానికి సంబంధించిన వివరాలు చెప్పటానికి ముందు, దృతరాష్ట్రుడు ప్రపంచం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తాడు. సంజయుడు భరత వర్షం గురించి అంధుడయిన ధృతరాష్ట్రుడికి ఎంతో వివరంగా చెప్తాడు. భూమి గురించి, ఇతర గ్రహాల గురించి, భరత ఖండంలో ఉన్న వందల రాజ్యాలు వాటిలోని రకరకాల తెగల గురించి, పట్టణాల గురించి, గ్రామాల గురించి, ఇంకా నదులు, పర్వతాలు, అడవులు గురించి కూడా వివరంగా విపులంగా చెప్తాడు.
యుద్ధ సమయంలో రణభూమిలో పాండవుల వైపు, కౌరవుల వైపు గుమిగూడిన అశేష సేనలను, ఆ మహాసేనలను నడపడానికి సిద్దమయిన అతిరథులను, దుర్యోధనుడి ప్రగల్భాలను, కురు పితామహుడయిన భీష్మాచార్యుడి భీకర పరాక్రమాన్ని, శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం నుండి వచ్చిన భీకర ధ్వనిని, శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణలను ధృతరాష్ట్రుడికి ఎంతో వివరంగా చెప్తాడు.
యుద్ధరంగలో అర్జునుడు గాండీవం, బాణాలు విడిచి నిస్సహాయుడిగా రథంలో కూర్చుండిపోయిన సందర్భంలో బయటకు కనిపిస్తున్న అర్జునుడినే కాకుండా అతని మనసులో ఉన్న ఆందోళనను, బాధను కూడా చూడగలిగిన విజ్ఞత, పాండిత్యం, నైపుణ్యం సంజయుడి సొంతం.
కురుక్షేత్ర సంగ్రామ సమయంలో సోదరులతో, బంధువులతో, కురువృద్ధులతో యుద్ధం చెయ్యలేక నిరాశపడినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యం ఉపదేశించిన భగవద్గీత సారాంశం అంతా సంజయుడి ద్వారా ధృతరాష్ట్రుడికి, ఆ తరువాత ఎన్నో తరాలకు, మనకు కూడా తెలిసింది. మీరు గమనించే ఉంటారు….భగవద్గీత వినేటప్పుడు మనం ముందుగా “సంజయ ఉవాచ… ” అని వింటాము. సంజయుడి ద్వారానే భగవద్గీత అందరికీ తెలియటం వల్లనే ఈ విధంగా చెప్తారు.
ఇదే కాకుండా, యుద్ధం జరుగుతున్న అన్ని రోజులూ, సంజయుడు ధృతరాష్ట్రుడికి పక్కనే ఉండి, యుద్ధంలో కౌరవుల వైపు, పాండవుల వైపు యోధులు రచించిన రకరకాల యుద్ధ వ్యూహాలను, తంత్రాలను, వివరించి చెప్పాడు. ఇంకా, యుద్ధంలో ఏయే సందర్భాలలో ఎవరెవరు పైచేయి సాధించారు, ఎవరు ఎలా మరణించారు అనే విషయాలను ధృతరాష్ట్రుడికి కళ్ళకు కట్టినట్లు వివరంగా, విపులంగా చెప్పాడు.
కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనకపోయినప్పటికీ అంతకన్నా క్లిష్టమయిన కార్యాన్ని సంజయుడు నిర్వర్తించాడు. యుద్ధంలో ఎవరెవరో ఎలా మరణించారో చెప్పటం కన్నా ఘోరమయిన, బాధాకరమయిన పని ఇంకొకటి ఉండదు. అతిరథ మహారథులు అయినటువంటి భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, శల్యుడు, ఇంకా ఇతర గొప్ప యోథులు ఎలా పాండవుల చేతిలో మరణించారో సంజయుడు ధృతరాష్ట్రుడికి వివరంగా చెప్తాడు.
అలాగే, భీమసేనుడి చేతిలో దృతరాష్ట్రుడి కుమారులయిన నూరు మంది కౌరవులు మరణించటం గురించి కూడా ధృతరాష్ట్రుడికి వివరించి చెప్తాడు. అదే విధంగా, తన కర్తవ్యాన్ని మరువకుండా… వివిధ సందర్భాలలో కురు సామ్రాజ్యంలోని ముఖ్యులు మరణించినప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఓదార్పు కలిగే మాటలను చెప్పి అతనిని ఎంతగానో సమాధానపరిచాడు.
దృతరాష్ట్రుడి మీద సంజయుడికి ఎంతో గౌరవం, భక్తి ఉన్నప్పటికీ కూడా యుద్ధంలో జరుగుతున్న క్రూరమయిన, ఇంకా భయంకరమయిన సంఘటనలను, హింసను ఏమాత్రం దాచకుండా స్పష్టంగా వివరించి చెప్పాడు. కౌరవుల వినాశనం గురించి, పాండవుల చేతిలో వారి అంతం గురించి కొంచెం కూడా మొహమాట పడకుండా ఉన్నది ఉన్నట్లుగా ధృతరాష్ట్రుడికి చెప్తాడు.
సంజయుడు వివరించిన ఈ సంఘటనలు అన్నీ మనకు మహాభారత ఇతిహాసంలోని భీష్మ పర్వం, ద్రోణ పర్వం, కర్ణ పర్వం, ఇంకా శల్య పర్వంలో వివరంగా కనిపిస్తుంది. కురుక్షేత్ర యుద్ధం చివరలో భీమసేనుడి చేతిలో దుర్యోధనుడు చంపబడినప్పుడు, అశ్వత్థామ భీకరంగా రోదిస్తాడు. ఆ అరుపులు, కేకలు విన్నటువంటి సంజయుడు గుండెలు పగిలేలా ఏడుస్తూ యుద్ధరంగానికి పరిగెత్తుకుని వెళ్తాడు. అక్కడ సాత్యకి సంజయుడిని బందీగా పట్టుకుంటాడు. అయితే, వెంటనే అక్కడకు వచ్చిన వ్యాస మహాముని సాత్యకిని వారించి సంజయుడిని విడిపిస్తాడు. దుర్యోధనుడి మరణం సంభవించగానే వ్యాసమహాముని సంజయుడికి ఇచ్చినటువంటి ఈ అద్భుత శక్తి పోతుంది. దీని గురించి మహాభారత ఇతిహాసంలోని సౌప్తిక పర్వంలో చెప్పారు.
మహాభారతంలో సంజయుడి పాత్ర గురించి తెలిపే ముఖ్య సంఘటనలు
ఒక్క కురుక్షేత్ర సంగ్రాంలోనే కాకుండా మహాభారత ఇతిహాసం అంతా చదివితే చాలా సందర్భాలలో సంజయుడు పోషించిన పాత్ర గురించి మనకు తెలుస్తుంది. వాటిలో కొన్ని ముఖ్యమయినవి తెలుసుకుందాము.
సభా పర్వం ప్రకారం, ధర్మరాజు రాజసూయ యాగం చేసిన సమయంలో కురువంశం తరఫున సంజయుడు అతిథులకు అందరికీ స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశాడు. ఇంకా, మాయాజూదంలో ఓడిపోయిన పాండవులను అరణ్యవాసానికి పంపినప్పుడు సంజయుడు ఏమాత్రం సంకోచించకుండా, ఇంత ఘోరం జరగనిచ్చిన దృతరాష్ట్రుడిని తీవ్రంగా మందలిస్తాడు.
ఇదే విషయంలో, విదురుడికి దృతరాష్ట్రుడితో చాలా పెద్ద వాదన జరుగుతుంది. ఆ కోపంలో విదురుడిని రాజ్యంలో నుండి వెళ్లిపొమ్మని దృతరాష్ట్రుడు అంటాడు. కానీ తన తప్పు తెలుసుకొని విదురుడిని క్షమాపణలు కోరి మళ్ళీ రాజ్యానికి తీసుకురమ్మని సంజయుడిని కోరతాడు. సంజయుడు విదురుడిని సముదాయించి మళ్ళీ రాజ్యానికి తీసుకువస్తాడు. దీని గురించి మనం వన పర్వంలో చూడవచ్చు.
కురుక్షేత్ర సంగ్రామం మొదలవడానికి ముందు, కౌరవుల తరపున పాండవులతో చర్చలు జరపడానికి ధర్మరాజు దగ్గరకు కౌరవుల రాయబారిగా సంజయుడు వెళ్తాడు. పాండవుల దగ్గరకు వెళ్లి ఇంద్రప్రస్థాన్ని తిరిగి ఇవ్వకూడదనే కౌరవుల నిర్ణయాన్ని మర్యాదపూర్వకంగా చెప్పగలిగిన శక్తి సంజయుడికి మాత్రమే ఉన్నదని దృతరాష్ట్రుడు, ఇంకా ఇతర కురువృద్దులు అందరూ విశ్వసించారు. ఇక్కడ మనకు సంజయుడి బుద్ధి కుశలత, నైపుణ్యం తెలుస్తాయి. అతనికి ఉన్న పెద్దరికం, అతని మీద కురువృద్దులకు ఉన్న నమ్మకం ఏ పాటిదో కూడా మనకు తెలుస్తుంది. సంజయుడు చేసిన ఈ రాయబారం గురించి మహాభారతంలోని ఉద్యోగ పర్వంలో వివరంగా చెప్పారు.
అంతే కాకుండా, పాండవులతో యుద్ధం మంచిది కాదని కౌరవులను, ముఖ్యంగా దుర్యోధనుడిని ఎంతగానో వారిస్తాడు. దుర్యోధనుడిని అదుపులో పెట్టమని ధృతరాష్ట్రుడికి చెప్తాడు. ఇంకా రాయబారానికి వెళ్లి వచ్చిన సంజయుడు, అక్కడ పాండవుల వైపు ఉన్న అశ్వదళాల గురించి, రథబలం గురించి కూడా చెప్తాడు. ఇంకా శ్రీకృష్ణుడి గొప్పతనం గురించి వివరిస్తూ, పాండవుల వైపు శ్రీకృష్ణుడు ఒక్కడు చాలని, ఈ ఒక్క కారణంతోనే యుద్ధంలో కౌరవుల ఓటమి తథ్యమని ధృతరాష్ట్రుడికి చాలా వివరించి చెప్తాడు. ఈ సంఘటనలు మనకు మహాభారత ఇతిహాసంలోని ఉద్యోగ పర్వంలో కనిపిస్తాయి.
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత, రాజ్యాన్ని పునర్నిర్మించే బాధ్యతను ధర్మరాజు సంజయుడికి అప్పగిస్తాడు. సంజయుడి బుద్ధి కుశలత, ఇంకా అతని రాజకీయ పరిజ్ఞానం మీద ధర్మరాజుకి, ఇంకా కురువంశానికి ఉన్న నమ్మకం ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది. దీని గురించి మహాభారతంలోని శాంతి పర్వంలో మనం వివరాలు తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: What Are the Timeless Lessons from Vidura’s Teachings?
సంజయుడి ముగింపు
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత కూడా సంజయుడు దృతరాష్ట్రుడిని విడువలేదు. దృతరాష్ట్రుడు తన భార్య గాంధారి, ఇంకా పాండవుల తల్లి అయిన కుంతీదేవి కలిసి అడవులకు వెళ్ళినప్పుడు సంజయుడు కూడా వాళ్ళతో పాటుగా వెళ్ళాడు. అడవికి చేరుకున్న తరువాత సంజయుడు రెండు రోజులు పూర్తిగా ఉపవాసం ఉంటాడు. అక్కడ, సంజయుడే ధృతరాష్ట్రుడికి అన్ని రకాలుగా సహాయం చేస్తాడు. దృతరాష్ట్రుడు శయనించడానికి కావలసిన విధంగా ఏర్పాట్లు చేస్తాడు. దృతరాష్ట్రుడితో పాటుగా ఉంటూ, అడవిలో నడవలేని సందర్భాలలో, అతని చేయి పట్టుకొని జాగ్రత్తగా నడిపిస్తాడు.
వీళ్ళు అందరూ అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా అడవిలో రేగిన కార్చిచ్చు వీరిని చుట్టుముడుతుంది. వెంటనే అక్కడి నుండి పారిపోయి తప్పించుకోమని దృతరాష్ట్రుడు సంజయుడికి చెప్తాడు. తాము అందరం దేశాన్ని, ఇంకా ఇంటిని విడిచి పెట్టామని, ధర్మం ప్రకారం తాము ఆ మంటల్లో పడి చనిపోవటంతో తప్పు లేదని, అందుకే అతని ప్రాణాలు కాపాడుకోమని దృతరాష్ట్రుడు అంటాడు. దృతరాష్ట్రుడు బలవంతం చేయటం వలన సంజయుడు ఆ మంటల నుండి తప్పించుకుంటాడు. ఇక దృతరాష్ట్రుడు, గాంధారి, ఇంకా కుంతీదేవి ఆ మంటలలో మరణిస్తారు. ఎంతో బాధ నిండిన హృదయంతో సంజయుడు గంగానదీ పరీవాహక ప్రాంతానికి చేరుకొని, అక్కడ ఉన్న సాధువులకు ఈ సంఘటన గురించి చెప్పి, అక్కడి నుండి హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అయితే మహాభారతానికి సంబంధించిన కొన్ని కథలలో, సంజయుడు హిమాలయాలకు వెళ్లలేదని, మిగతావారితో పాటుగా ఆ మంటల్లోనే చనిపోయాడని చెబుతారు. అంతటితో మహాభారత ఇతిహాసంలో సంజయుడి పాత్ర ముగిసిపోతుంది. దీని గురించి మనం మహాభారత ఇతిహాసంలోని ఆశ్రమవాసిక పర్వంలో చూడవచ్చు.
ధృతరాష్ట్రుడు రాముడంతటి గొప్పవాడు కాకపోయినా, తన యజమాని పట్ల సంజయుడు చూపిన భక్తి, అంకితభావం వలన సంజయుడు హనుమంతుడికి ఏమాత్రం తక్కువ కాదు అనిపిస్తుంది.
సంజయుడి జీవితం నుండి మనం తెలుసుకోవాల్సిన నీతి
మిగతా వారిలాగా యుద్ధాలు చేసిన యోధుడు అవ్వకపోయినా తన పాండిత్యంతో, విజ్ఞతతో సంజయుడు గొప్పవాడిగా కీర్తించబడ్డాడు. సంజయుడు అంటే అంతరంగాన్ని సంపూర్తిగా జయించిన వాడు అని అర్థం. దీని వల్లనే సంజయుడు తన ఆలోచనలకు, అభిప్రాయాలకు స్థానం లేకుండా, యుద్ధంలో జరిగిన సంఘటనలను స్పష్టంగా, పక్షపాతం లేకుండా చెప్పగలిగాడు.
సంజయుడి జీవితం మనందరికీ జీవితంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం గురించి, దాని వలన కలిగే శక్తి యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది. ఇటువంటి శక్తి ఒక మనిషినే కాకుండా, ఆ మనిషి చుట్టూ ఉంటున్న వాళ్ళని కూడా ఎంతో గొప్పగా ప్రభావితం చేస్తుంది.
జీవితంలో పక్షపాతం లేకుండా పరిస్థితులను, సంఘటనలను విశ్లేషణ చేయగల శక్తి, సామర్థ్యం కలిగి ఉండే ఉత్తమ లక్షణం మనుషులకు ఉండటం ఎంత అవసరమో చెప్పడానికి ఈ సంజయుడి జీవితాన్ని చక్కని ఉదాహరణగా చూపిస్తారు. సంజయుడిని సహజంగా అలవడిన జ్ఞానానికి కూడా ప్రతీకగా చెబుతారు. ఈ లక్షణాలు కలిగి ఉండటం వలన మనుషులు ఎల్లప్పుడూ ధర్మమార్గంలో పయనిస్తారని, జీవితానికి సార్థకత చేకూరుతుందని పెద్దలు చెబుతారు.