Secrets of Shakuni's Life

Hidden Secrets of Shakuni’s Life in the Mahabharata | మహాభారతంలో శకుని జీవిత రహస్యం

మహాభారతం ఎప్పటికీ చెక్కుచెదరని ఒక అద్భుత కావ్యం. దీనిలోని ప్రతి పాత్రా ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఇతిహాసంలో మనకు ఎన్నో రకాల పాత్రలను పరిచయం చేస్తుంది. అందులో శకుని పాత్ర చాలా కీలక మయినది. కౌరవ పక్షాన ఉండి… రాజకీయ ఎత్తుగడలతో పాండవులను రెచ్చగొట్టేవాడు. చివరికి వీరి మద్య పోరు చిలికి చిలికి గాలి వానై… కురుక్షేత్ర సంగ్రామానికి దారితీసేలా చేశాడు. చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాడు. అలాంటి ఈ శకుని మామ గురించి ఈ రోజు ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాము.

శకుని పుట్టుక, మరియు అతని తల్లిదండ్రులు

శకుని అంటే సంస్కృతంలో ‘పెద్ద పక్షి’ అని అర్ధం. శకుని తల్లి పేరు సుధర్మ, తండ్రి పేరు సుబల. వీళ్ళు గాంధార రాజ్యానికి చెందినవారు. గాంధార రాజ్యానికి రాజయిన సుబల రాజుకి మొత్తం నూరుగురు సంతానం. 99 మంది కుమారులు కలిగిన తరువాత పుట్టిన 100వ కుమారుడే ఈ శకుని. అందుకే ఇతనికి ‘సౌబల’ అనే పేరు కూడా వచ్చింది. ఇంకా ఇతనికి గాంధారపతి, పర్వతీయ, కితవ అనే పేర్లు కూడా ఉన్నాయి. 

ధృతరాష్ట్రుడి భార్య అయిన గాంధారికి శకుని స్వయానా సోదరుడు. అపారమైన తెలివితేటలు కలవాడు. అంతేకాదు ఎత్తులు పై ఎత్తులు కూడా తెలిసినవాడు. 

కురు వంశాన్ని ద్వేషించిన శకుని

గాంధారి జన్మించినప్పుడు జ్యోతిష్కులు ఆమె జాతకం చూసి, ఆమెను పెళ్ళిచేసుకునే భర్తకు ఆయుష్షు తక్కువగా ఉంటుందని, పెళ్లి జరిగిన వెంటనే అతను మరణిస్తాడని చెప్తారు. అయితే ఈ దోషం పోవటం కోసం ముందుగా ఆమెకి  ఒక మేకతో వివాహం జరిపించి, వెంటనే ఆ మేకను బలి ఇచ్చి చంపేస్తారు. ఈ విధంగా గాంధారి విధవరాలు అవుతుంది. 

ఆ తరువాత ఆమెకు మళ్ళీ పెళ్లి చెయ్యాలని తగిన వరుడిని వెదుకుతున్న సమయంలో భీష్ముడు సుబలుడి వద్ద  ధృతరాష్ట్రుడి ప్రస్తావన తెస్తాడు. పుట్టుకతోనే గుడ్డివాడైన ద్రుతరాష్ట్రుడికి గాంధారే తగిన భార్య అని తలచి… వివాహం జరిపించాలని  అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ద్రుతరాష్ట్రుడి లోపాన్ని మాత్రం బీష్ముడు తెలియనీయకుండా చాలా జాగ్రత్త పడతాడు. ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ ఒప్పుకోదని తెలిసి  భీష్ముడు అసలు నిజాన్ని దాచిపెడతాడు.

ఇదిలా ఉంటే…   గాంధారి విధవరాలు అన్న విషయం ఆలస్యంగా తెలుసుకుంటాడు ధృతరాష్ట్రుడు. తీవ్ర ఆగ్రహంతో ఆ కుటుంబాన్ని చెరసాలలో బంధించి మరణించేవరకు చిత్రహింసలకు గురిచేయండి! అంటూ ఆదేశిస్తాడు. ఈ సంఘటన జరిగేనాటికి శకుని చాలా చిన్నవాడు. 

రాజాజ్ఞ మేరకు తన తండ్రిని, సోదరులను బందించి కారాగారంలో వేస్తారు. అయితే, రాజధర్మం ప్రకారం కారాగారంలో వేసిన వాళ్ళందరికీ ఆహరం తప్పకుండా ఇవ్వాలి. కానీ  ఒక్కొక్కరికీ ఒక్కో అన్నం మెతుకు మాత్రమే ఇచ్చేవారు. తమ కుటుంబానికి ఇన్ని కష్టాలు కలగడానికి కారణం బీష్ముడు కాబట్టి అతనిపై పగ పెంచుకుంటాడు  సుబలుడు. 

భీష్ముడిని, ఇంకా కురువంశం మొత్తాన్ని నాశనం చెయ్యాలని నిశ్చయించుకుంటాడు. అందుకోసం అందరిలోకీ తెలివయిన శకునిని ఎలాగయినా బతికించాలని అనుకొంటాడు. ఈ క్రమంలో వారందరి అన్నం మెతుకులను కలిపి ఒక ముద్దగా చేసి శకునికి పెట్టి… అతనిని బతికిస్తారు. శకుని తండ్రి, మరియు మిగతా సోదరులు మాత్రం ఆకలితో అలమటించి జైల్లోనే మరణిస్తారు. 

మరణించే ముందు సబలుడు శకునితో ఇలా అంటాడు. మేమెన్ని నరకయాతనలు అనుభవించి చనిపోతున్నామో నువ్వు కళ్లారా చూశావు కదా! మేమంతా కలిసి నిన్ను బతికించింది మన పగ తీరుస్తాతావని. భవిష్యత్తులో  నీకు రాజభోగాలు కలిగి మన పగను మరిచిపోతే మా ఈ ప్రాణ త్యాగాలకు అర్ధం ఉండదు అని చెబుతాడు. అంతేకాదు,   కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరం గుర్తుచేయడానికి శకుని తొడ ఎముకను విరిచి అవిటివాడిగా కూడా మారుస్తాడు. 

ఆ క్షణం నుంచి శకుని నరనరాల్లోనూ పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటాడు.  ఒకపక్క కురువంశాన్ని రక్షిస్తున్నట్లు నటిస్తూ… మరోపక్క మనసులో ప్రతీకారాన్ని ఎవ్వరికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడతాడు.

గాంధారికి తోడుగా శకుని

గాంధార రాజ్యానికి యువరాజుగా ఉన్న శకుని, తన తండ్రి సుబల మరణించిన తరువాత రాజు అవుతాడు. మొదటినుండీ తన సోదరి గాంధారి అంటే శకునికి చాలా అభిమానం. ఆ అభిమానంతోనే గాంధారి వివాహం గుడ్డివాడయిన దృతరాష్ట్రుడితో జరిగిన తరువాత, తన ప్రియమయిన సోదరికి తోడుగా ఉండటం కోసం శకుని కూడా గాంధారితో పాటుగా హస్తినాపురానికి వచ్చేస్తాడు. అక్కడే తన సోదరితో ఉండిపోతాడు. 

కానీ శకుని గాంధారితో పాటు హస్తినాపురంలో ఉండటం వెనుక రెండు బలమైన కారణాలు ఉన్నాయి. అవి: తన ప్రియమయిన చెల్లికి ఒక గుడ్డివాడితో పెళ్లి చేసి ఆమె జీవితం నాశనం చేశారనే కోపం ఒక పక్క; తన కుటుంబాన్ని చెరసాలలో బంధించి ఆకలితో అలమటించి మరణించేలా చేశారని మరోపక్క. ఈ రెండు బలమైన కారణాలతో  కురువంశాన్ని అంతమొందించటమే లక్షంగా పెట్టుకొంటాడు. అందుకోసం హస్తినలో తిష్టవేస్తాడు.

హస్తినాపురంలో కౌరవులకు అండగా శకుని

అంధుడయిన దృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకున్న గాంధారికి తోడుగా శకుని హస్తినాపురంలోనే ఉండిపోతాడు. అక్కడ, గాంధారికి పుట్టిన పిల్లలను ప్రేమగా చూసుకుంటాడు. అందరికన్నా దుర్యోధనుడి మీద శకునికి ఎంతో ప్రేమ. తన మేనల్లుడు అన్ని విషయాలలో ముందుండాలని, అందరి మీద విజయం సాధించాలని, కురువంశానికి అతనే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు. ఎల్లప్పుడూ కౌరవులకు సహాయం చేస్తూ వారి నమ్మకం సంపాదిస్తాడు. 

మహాభారతంలో శకునిని ఒక జిత్తులమారిగా, మోసగాడిగా చెప్పుకొంటారు. ఎందుకంటే, ఇతను కౌరవుల వైపు ఉండి, ఎన్నో రకాలుగా పాండవులను కష్టాలపాలు చేశాడు. దుర్యోధనుడు కురువంశానికి చక్రవర్తి అవ్వడానికి అడ్డుగా ఉన్న పాండవులను అన్ని రకాలుగా రాజ్యానికి దూరం చెయ్యాలని ఎన్నో కుట్రలు పన్నుతాడు. 

శకుని పాచికల ప్రత్యేకత

మహాభారతంలో శకుని పాచికలకి ఓ ప్రత్యేకత ఉంది. ఇవి తన తండ్రి ఎముకలతో తయారుచేయబడినవి. సబలుడు చనిపోతూ, తన బొమికలతో పాచికలు తయారు చేసి ఇచ్చి,  జూదంలో వాడమని కోరతాడు. ఈ పాచికలు ఎల్లప్పుడూ నీ ఆధీనంలోనే ఉంటాయి, నీవు ఎలా చెప్తే అలా చేస్తాయి. వీటితో జూదం ఆడితే కోరుకున్న సంఖ్య వస్తుంది. ఈ పాచికలతో మాయ చేస్తూ… అవతలివారిపై చాలా ఈజీగా గెలిచేయవచ్చు. ఇవి నీ దగ్గర ఉన్నంతవరకూ నిన్ను ఎవరూ ఓడించలేరు అని చెప్తాడు. అంతేకాదు, వీటితో కౌరవులపై ప్రతీకారం తీర్చుకోమని కూడా ఆదేశిస్తాడు.

అతని కోరిక ప్రకారం శకుని తన పాచికలతో ఎన్నో మాయలు చేసేవాడు. నిజానికి హిందూ ధర్మం ప్రకారం జూదమాడటం నేరం. కానీ, దుర్యోధనుడితో కలిసి అనేక జిమ్మిక్కులు చేసి, పాండవులను మోసం చేసి జూదమాడేలా చేస్తాడు. 

శకుని ఆడిన మాయ జూదం

మహాభారతంలో పాచికల ఆట మోసపూరితంగా ఆడటంలో శకుని పాత్ర చాలా ముఖ్యమయినది. మరణించిన తన తండ్రి ఎముకలతో తయారయిన పాచికలను ఉపయోగించి జూదంలో ఎప్పుడూ గెలిచేలాగా శక్తి సంపాదిస్తాడు. జూదం ఆడే సమయంలో శకుని తండ్రి ఆత్మ వచ్చి ఆ పాచికలలో దూరి శకుని మనసులో కోరుకున్న సంఖ్య వచ్చే విధంగా చేసేవాడని చెప్తారు. 

శకుని ఈ మాయా పాచికలను ఉపయోగించి పాండవుల మీద దుర్యోధనుడు గెలిచేలా చేస్తాడు. ఇతని కుట్ర వల్లనే పాండవులు ఆటలో ఓడిపోయి రాజ్యం వదిలి వెళ్ళిపోతారు. ద్రౌపదికి నిండు సభలో పరాభవం జరిగిన సంఘటన కూడా ఈ మాయాజూదం వల్లనే.

మహాభారతంలోని సభా పర్వంలో ఈ మాయాజూదం గురించి, ద్రౌపది పరాభవం గురించి వివరంగా చెప్పారు. ధర్మరాజుకి, దుర్యోధనుడికి మధ్య రాజ్యాన్ని ధృతరాష్ట్రుడు సమ భాగాలుగా ఇస్తాడు. ధర్మరాజు ఇంద్రప్రస్థ నగరాన్ని సంపాదించి, రాజ్యాన్ని విస్తరించడానికి రాజసూయ యాగం చేయాలని సంకల్పిస్తాడు. దానికి అన్నీ రాజ కుటుంబాలను ఆహ్వానిస్తారు. దుర్యోధనుడు కూడా శకునితో కలిసి ఇంద్రప్రస్థానికి వస్తాడు. అక్కడ పాండవుల సంపదను, వారి భోగాన్ని చూసి అసూయ పడతాడు. ఎలాగయినా వారి సంపదను, రాజ్యాన్ని ఆక్రమించి, వాళ్ళని వెళ్ళగొట్టాలని భావిస్తాడు. 

దుర్యోధనుడి కోరిక తెలుసుకున్న శకుని ఎలాగయినా తన మేనల్లుడు కోరిక తీర్చాలని నిర్ణయించుకుంటాడు. ధర్మరాజుకి జూదం అంటే ఇష్టమని, జూదం ఆడటానికి అతనిని పిలవమని దుర్యోధనుడికి చెబుతాడు. జూదంలో ధర్మరాజుని ఓడించి, వాళ్ళ రాజ్యాన్ని, సంపదని లాక్కోవాలని శకుని పన్నాగం. 

పెద్దలందరి సమక్షంలో జూదం ఆడటానికి పాండవులను హస్తినాపురానికి ఆహ్వానిస్తాడు. అక్కడ కౌరవుల తరఫున శకుని ప్రాతినిధ్యం వహిస్తాడని దుర్యోధనుడు ప్రకటిస్తాడు. ప్రతి ఆటలో పందెం పెంచుకుంటూ రాజ్యాలను, సంపదను కూడా పందెం పెడతారు. ఆ విధంగా శకుని ధర్మరాజుకి చెందిన ఇంద్రప్రస్థాన్ని, మిగిలిన అన్ని రకాలయిన సంపదలను దోచుకుంటాడు. పెద్దలు వద్దని వారిస్తున్నా ఇంకా ఆట కొనసాగిస్తారు. 

ధర్మరాజు తన సోదరులను, ఇంకా భార్య అయిన ద్రౌపదిని కూడా పందెం పెట్టి ఓడిపోతాడు. దుర్యోధనుడి ఆజ్ఞ ప్రకారం దుశ్శాసనుడు ద్రౌపదిని సభలోకి లాక్కుంటూ వచ్చి వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆమెను శ్రీకృష్ణుడు కాపాడతాడు. చివరకు ఈ జూదం వలన అన్నీ కోల్పోయి ధర్మరాజు తన సోదరులతో, భార్యతో కట్టుబట్టలతో పన్నెండు సంవత్సరాలు వనవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యడానికి వెళ్ళిపోతారు. ఇక దుర్యోధనుడికి ఎవ్వరూ అడ్డు లేరని, అతనే చక్రవర్తి అని శకుని ఎంతో సంతోషిస్తాడు.

పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో కూడా దుర్యోధనుడికి ఏ రకంగా కూడా వాళ్ళు అడ్డు ఉండకూడదని ఎన్నో పన్నాగాలతో వాళ్ళను మట్టుబెట్టాలని ప్రయత్నిస్తాడు. పాండవులు అజ్ఞాతవాసం చేసే సమయంలో కూడా ఇలానే ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. 

అయితే, పాండవులు శ్రీకృష్ణుడి సహకారంతో ఈ కష్టాలను అన్నీ దాటుకొని వనవాసం, అజ్ఞాతవాసం కూడా పూర్తి చేస్తారు. మళ్ళీ తిరిగి వచ్చిన పాండవులకు వాళ్ళ రాజ్యం ఇవ్వటం కుదరదని, సంధి కాదనుకొని యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేయాలని దుర్యోధనుడు ఆలోచిస్తాడు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో కూడా శకుని తన మేనల్లుడి వైపు ఉండి ఎన్నో పన్నాగాలు చేస్తాడు. 

అందుకే, కుట్రలు పన్నే వారిని శకునితో పోల్చుతూ ఉంటారు. ఈయన పాండవులకు, మరియు కౌరవులకు మధ్య యుద్ధం వచ్చేలా చేసి, వారు తన్నుకు చస్తుంటే చూసి సంతోషించాడు.                         

కురుక్షేత్ర యుద్ధంలో శకుని పాత్ర

కురుక్షేత్ర యుద్ధంలో శకుని ముఖ్య పాత్ర పోషించాడు. యుద్ధ సమయంలో పాండవులను ఎదుర్కోవడానికి శకుని ఎన్నో రకాలయిన వ్యూహాలను చేస్తాడు. యుద్ధంలో నేరుగా పాల్గొని ఎందరో వీరులను ఓడించాడు. 

యుద్ధం మొదలయిన రోజు శకుని తన మేనల్లుడయిన దుర్యోధనుడితో కలిసి ధర్మరాజుని ఓడించి చంపటానికి ఎంతో ప్రయత్నించి విఫలమవుతారు. ఈ యుద్ధంలో నకులుడి కుమారుడయిన శ్రుతసేనుడిని ఓడిస్తాడు  శకుని. అదే విధంగా పాండవుల తరఫున యుద్ధం చెయ్యడానికి వచ్చిన మగథ రాజైన సహదేవుడిని కూడా ఓడించి చంపుతాడు. ఇంకా జయదేవుడిని కూడా యుద్ధంలో ఓడించి చంపేస్తాడు శకుని. 

యుద్ధం 10వ రోజున, శకుని అర్జునుడిని ఎదుర్కొంటాడు. అర్జునుడు శిఖండిని తీసుకొని భీష్ముడి దగ్గరకు వెళ్ళేటప్పుడు అతను భీష్ముడిని చేరుకోకుండా ఆపుతాడు. కత్తి యుద్ధం చేసి శిఖండిని గాయపరుస్తాడు. అయితే, విరాట రాజు దీనికి అడ్డుపడి శకునిని ఎదుర్కొంటాడు. 

ఇక అర్జునుడి కుమారుడయిన అభిమన్యుడిని అన్యాయంగా చంపటంలో శకుని కూడా ముఖ్య పాత్ర పోషిస్తాడు. కౌరవ మహారథులతో కలిసి ఒక్కసారిగా అభిమన్యుడి మీద దాడి చేసి చంపేస్తారు. యుద్ధం 14వ రోజున, నకులుడితో తలపడి ఓడిపోతాడు. యుద్ధం 18వ రోజున, కౌరవ సైన్యాన్ని నడిపించమని దుర్యోధనుడు శకునిని కోరతాడు. అయితే ఆ బాధ్యతను నిరాకరించి, శల్యుడికి సారధ్యం ఇవ్వమని చెబుతాడు. 

శకునికి భ్రమలు కల్పించటంలో చాలా నైపుణ్యం ఉంది. దీని గురించి ద్రోణ పర్వంలో ఒక సంఘటన గురించి చెప్పారు. ఒకసారి శకుని తన నైపుణ్యంతో అర్జునుడి మీద 100 రకాల భ్రమలు కల్పించాడు. ఎన్నో రకాల క్రూర జంతువులు, అడవి మృగాలు, ఆయుధాలు ఒక్కసారిగా అర్జునుడి మీదకు వస్తున్నట్లుగా కల్పిస్తాడు. అయితే ఆదిత్యం అనే ఆయుధాన్ని ప్రయోగించి అర్జునుడు ఈ భ్రమలను తొలగిపోయేలాగా చేస్తాడు.

శకుని మరణం

మాయాజూదం జరిగినప్పుడు, పాండవుల ఓటమికి కారణం శకుని అని తెలుసుకున్న సహదేవుడు, అతనిపై కక్ష పెంచుకుంటాడు. ఈ కుట్రకు కారణమయిన శకునిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. 

శకుని కుమారుడయిన ఉలుక కూడా కురుక్షేత్ర యుద్ధంలో పాలుపంచుకున్నాడు. మహాభారతంలోని కర్ణ పర్వం ప్రకారం యుద్ధంలో ఉలుక యుయుత్సుడిని ఓడిస్తాడు. యుద్ధం 18వ రోజున, పాండవులు శకునిని, అతని కొడుకయిన ఉలుకని ఎదుర్కొంటారు. వెంటనే దుర్యోధనుడు, అతని సోదరులు శకునిని రక్షించడానికి వస్తారు. భీముడు కౌరవులను దీటుగా ఎదుర్కొంటాడు. సహదేవుడు శకునితో, అతని కొడుకయిన ఉలుకతో భీకరంగా యుద్ధం చేస్తాడు. నకులుడు శకునికి, ఉలుకకి రక్షణగా ఉన్న యోధులను చంపేస్తాడు. ఆ తరువాత, సహదేవుడు ఉలుకతో పోరాడి అతనిని చంపేస్తాడు. 

కోపంతో శకుని సహదేవుడితో భీకరంగా యుద్ధం చేస్తాడు. తన విలువిద్యా నైపుణ్యంతో సహదేవుడి విల్లును, రథాన్ని విరిచేస్తాడు. అప్పుడు సహదేవుడు వేరొక రథం ఎక్కి శకునిని ఎదుర్కొంటాడు. ఇలా చాలాసేపు పోరాడిన తరువాత, ఇద్దరూ రథాలు దిగి ద్వంద యుద్ధం చేస్తారు. చివరికి, సహదేవుడు తన గొడ్డలితో శకుని ఛాతీలో పొడిచి చంపేస్తాడు. అలా శకునిని చంపి సహదేవుడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాడు. ఈ విధంగా కురుక్షేత్ర యుద్ధంలో శకుని పాత్ర ముగుస్తుంది. 

నీతి

శకుని పేరు చెబితే విలన్ లానే అనిపిస్తుంది. కానీ, మనం మహాభారతాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే… శకుని కేవలం ప్రతీకారం తీర్చుకునే యువరాజు మాత్రమే. 

కురుజాతిని నాశనం చేయడమే అతని జీవిత లక్ష్యం. అందుకే శకుని తన తెలివితేటలతో దుర్యోధనుడ్ని పూర్తిగా తప్పుదారి పట్టించాడు. అలా కురు వంశాన్ని నాశనం చేసేలా ప్రేరేపించాడు. 

తన పగను నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో అవమానాలు పడతాడు. అన్నిటినీ ఓపికగా భరించి తాను అనుకున్నది సాధిస్తాడు.  జీవిత లక్ష్యాన్ని ఛేదిస్తాడు. 

ఇక శకుని మంచివాడా, చెడ్డవాడా అనే విషయం పక్కన పెడితే, అతను అధర్మం వైపు నిలబడ్డాడు అనేది ఇక్కడ ముఖ్యం. తన మేనల్లుడు అందరికన్నా గొప్పగా ఉండాలని అనుకోవటం, అతనే కురు సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలని కోరుకోవడం తప్పు కాదు కానీ, అది జరగడానికి అతను ఎంచుకున్న మార్గం మాత్రం తప్పు. అతను చేసిన పనులు ఎంతో కుట్రపూరితమయినవి. తన మేనల్లుడి సంతోషం కోసం ఇతరుల ప్రాణాలకు హాని తలపెట్టడానికి కూడా వెనుకాడలేదు. అందుకే చివరికి దుష్టులతో కలిసి అంతమయ్యాడు. దుష్టులతో ఉంటూ, దుష్ట ఆలోచనలతో గెలుపొందాలని కుట్రలు, పన్నాగాలు చేస్తే చివరికి ఏమవుతుందో చెప్పడానికి శకుని జీవితం ఒక మంచి ఉదాహరణ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top