కొత్తగా కట్టిన ఓ ఇంట్లో సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే వెలిశాడు. దీంతో ఆ ఇంట్లో ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాక, స్థానికులంతా అక్కడికి వచ్చి పూజలు చేయటంతో ఇప్పుడు వారిల్లు ఓ దేవాలయంలా మారిపోయింది. ఇదంతా జరిగింది వేరెక్కడో కాదు, కర్నూలు జిల్లాలోనే!
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో ఉన్న నందవరం అనే మండల కేంద్రంలో గత మూడేళ్ల క్రితం నాగలక్ష్మి కుటుంబం కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి ఫ్లోరింగ్ కోసం నల్లటి నాపరాయిని ఉపయోగించారు. ఇంతవరకూ బానే ఉంది. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది.
గత కొన్ని రోజుల క్రితం ఓ బండపై బయటి భాగాన ఓ చిన్న పాటి రంధ్రంలా కనపడింది. మొదట్లో వారంతా అదేదో బండపై బరువైన వస్తువు పడి అలా కుంగిందేమో అనుకుని పట్టించుకోలేదు. కానీ, గత వారం రోజుల నుండి ఆ రంధ్రం కాస్తా అంతకంతకీ పెరుగుతూ వస్తుంది. అలా పెరుగుతూ పోయి చివరికి శివలింగం ఆకారాన్ని సంతరించుకుంది.
దీన్ని గమనించిన నాగలక్ష్మి తన ఇంట్లో సాక్షాత్తూ ఆ పరమ శివుడే వెలిశాడంటూ పూజలు చేయటం ప్రారంభించింది. అయితే, ఆ శివలింగం పరిమాణం గత మూడు రోజుల నుండీ అంతకంతకీ పెరుగుతూ వస్తుంది.
ఈ వార్త ఆ నోటా… ఈ నోటా… పడి చివరికి ఆ ఊరంతా పాకింది. దీంతో ఆ అద్భుతాన్ని చూడటానికి జనాలు క్యూ కట్టారు. ఆ తర్వాత ఆ గ్రామంతో పాటు ఈ విషయం చుట్టుపక్కల గ్రామాలకి కూడా వ్యాపించింది. దీంతో ప్రజలంతా అక్కడికి తండోపతండాలుగా తరలివస్తున్నారు.