Koorma avatharam, Lord Vishnu, Hindu mythology

Spiritual Significance of Koorma Avatharam in Hinduism

జీవాన్ని సృష్టించేది బ్రహ్మ అయితే, సృష్టించిన ఆ జీవాన్ని రక్షించేది విష్ణువు, ఇక ఆ జీవాన్ని శిక్షించేది శివుడు. ఇలా త్రిమూర్తులైన ఈ ముగ్గురూ సృష్టిని ఆది నుండి అంతం వరకూ నడిపిస్తుంటారు. సృష్టిని నడుస్తున్నప్పుడు ఆ నిర్దేశించిన క్రమాన్ని కొనసాగించడంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు సృష్టిని కాపాడే బాధ్యత కూడా ఆ మహావిష్ణువు తీసుకున్నాడు. ఈ క్రమంలో సృష్టిని కాపాడటానికి ఒక్కోసారి అవతారపురుషుడిగా వచ్చి ధర్మాన్ని పరిరక్షించాల్సి వస్తుంది. అందులో భాగంగానే శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తవలసి వచ్చింది. అందులో రెండవది కూర్మావతారం. ఈ అవతారం గురించి ఈ రోజు  వివరంగా తెలుసుకుందాము.

ఇది కూడా చదవండి: Spiritual Significance of Varaha Avatar in Hinduism

కూర్మావతారం వెనుక ఉన్న కథ

మహావిష్ణువు యొక్క కూర్మావతారం, దానికి  సంబందించి జరిగిన కథను సత్యయుగానికి చెందినదని చెబుతారు. ఈ అవతారం గురించి భాగవత పురాణంలో, అగ్ని పురాణంలో, కూర్మ పురాణం, ఇంకా రామాయణంలో కూడా చెప్పారు. దేవతలు ఇంకా రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు, అమృతం దేవతలకు అందేలా చెయ్యటం కోసం శ్రీమహావిష్ణువు ఈ అవతారం ఎత్తాడని చెబుతారు.  

కూర్మ పురాణం ప్రకారం, స్వర్గాధిపతి ఆయిన ఇంద్రుడి నిర్లక్ష్యం కారణంగా శ్రీమహావిష్ణువు ఈ అవతారం ఎత్తాడని కథ. ఒకసారి, దుర్వాస మహాముని ఇంద్రుడికి ఒక పవిత్రమయిన పూలదండను  ఇస్తాడు. ఇంద్రుడు ఆ మాలను తన ఐరావతం శిరస్సు మీద ఉంచుతాడు. ఆ ఐరావతం ఆ దండను కింద పడేసి కాలితో తొక్కి నాశనం చేస్తుంది. 

ఇది తెలుసుకున్న దుర్వాస మహాముని ఆగ్రహించి దేవతలు అందరూ తమ శక్తిని కోల్పోతారని శపిస్తాడు. ఆ శాపం వలన దేవతలు తమ శక్తి కోల్పోయి క్షీణిస్తారు. ఆ సమయంలో రాక్షసులు దేవతలను సులువుగా ఓడించి పారిపోయేలాగా చేస్తారు. దేవతలకు ఏమి చేయాలో తెలియక వెంటనే శ్రీమహావిష్ణువుని వేడుకుంటారు. 

అప్పుడు మహావిష్ణువు దేవతలను సమాధానపరిచి, పాలకడలిలో పవిత్ర మూలికలను వేసి పూజించి, ఆ తరువాత మందర పర్వతాన్ని కవ్వం లాగా, వాసుకి పాముని తాడులాగా ఉపయోగించి పాల సముద్రాన్ని అమృతం కోసం చిలకమని సలహా ఇస్తాడు. అయితే శక్తి కోల్పోయి క్షీణించిన దేవతల బలం సముద్రాన్ని చిలకడానికి సరిపోదు. ఏమి చెయ్యాలో తెలియక మళ్ళీ మహావిష్ణువును సలహా కోరగా రాక్షసుల సహాయం తీసుకొమ్మని సలహా ఇస్తాడు.

ఆ విధంగా ఒక వైపు దేవతలు, మరొక వైపు రాక్షసులు వచ్చి మందర పర్వతంతో పాలసముద్రాన్ని చిలకబోతారు. అయితే ఆ మందర పర్వతం సముద్రం అడుగున కూరుకుపోయి చిలకడం సాధ్యపడదు. అప్పుడు శ్రీమహావిష్ణువు అందరికీ అభయమిచ్చి కూర్మావతారంలో సముద్రం అడుగు భాగాన ఉండి మందర పర్వతాన్ని తన మీద ఉంచుకొని చిలకడానికి అనువుగా నిలబెడతాడు.

అప్పుడు దేవతలు వాసుకి తోకను, రాక్షసులు వాసుకి తలను పట్టుకుని చిలకడం ప్రారంభిస్తారు. అలా చిలుకుతుండగా సముద్రపు లోతుల నుండి కల్కుట అనే ఒక భయంకరమైన విషం ఉద్భవిస్తుంది. అందరూ భయపడిపోయి శివుడిని ప్రార్థిస్తే శివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో దాచుకుంటాడు. ఈ విషం గొంతులో ఉండటం వల్లనే శివుని కంఠం నీలిరంగులోకి మారి అతను నీలకంఠుడిగా పేరు పొందాడు. 

ఆ తరువాత వరుణి దేవత, సుర దేవత. అందమైన పారిజాత చెట్టు, కౌస్తుభ రత్నం, కపిల ఆవు, ఉచ్చైశ్రవ గుర్రం, ఎందరో అప్సరసలు ఉద్భవిస్తారు. చివరగా, ధన్వంతరి తన చేతుల్లో అమృత భాండాన్ని తీసుకొని ఉద్భవిస్తాడు. రాక్షసులు ఆనందంతో ఆ భాండాన్ని తీసుకొని తమ లోకానికి బయలుదేరతారు. 

అప్పుడు శ్రీమహావిష్ణువు వెంటనే ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి రాక్షసులకు కనిపిస్తాడు. రాక్షసులు ఆ మోహిని స్త్రీ అందానికి ముగ్ధులయ్యి అమృతాన్ని అందరికి పంచమని అడుగుతారు. అయితే మహావిష్ణువు రాక్షసులను ఏమార్చి దేవతలకు మాత్రమే అమృతం ఇస్తాడు. దీనిని రాక్షసులు తెలుసుకోలేకపోతారు. 

అయితే రాహువు అనే ఒక రాక్షసుడు తెలివిగా ఈ మోసాన్ని గ్రహించి చంద్రుని రూపంలో దేవతల మధ్యలోకి వచ్చి అమృతం కొంత తాగుతాడు. అయితే అక్కడే ఉన్న సూర్యుడు ఇంకా చంద్రుడు ఈ విషయాన్ని మహావిష్ణువుకు తెలియపరుస్తారు. వెంటనే శ్రీమహావిష్ణువు కత్తితో రాహువు తల నరికేస్తాడు. అయితే కొంత అమృతం తీసుకోవటం వలన అతను చనిపోడు. అతను వెంటనే విష్ణువును ప్రార్థిస్తాడు. అప్పుడు విష్ణువు అతనికి అప్పుడప్పుడు సూర్యుడిని, చంద్రుడిని మింగటానికి అనుమతి ఇస్తాడు. ఇదే మనకు తెలిసిన సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం. 

ఈ విధంగా దేవతలకు అమృతం పంచి వారి శక్తి పెరిగే లాగా చేస్తాడు. పూర్తిగా శక్తిమంతులయిన దేవతలు వెంటనే రాక్షసులతో యుద్ధం చేసి వారిని  ఓడించి తిరిగి స్వర్గం మీద ఆధిపత్యం సంపాదిస్తారు.

ఈ విధంగా మహావిష్ణువు కూర్మావతారంలో వచ్చి దేవతలకు సహాయం చేసి వారి చేతులలో రాక్షసులు ఓడిపోయేలాగా చేసి లోక కల్యాణం జరిపిస్తాడు. 

అయితే ఇక్కడ మీకు అందరికీ ఒక అనుమానం వచ్చి ఉండాలి. మహావిష్ణువు పది అవతారాలలో మోహిని అవతారం ఎందుకు లేదు అనే కదా? దీని గురించి కూడా కొందరు పెద్దలు వివరించారు. 

మహావిష్ణువు ఎన్నో అవతారాలు ఎత్తాడనీ, వాటిలో పది మాత్రమే ప్రముఖంగా అందరికీ తెలిశాయని చెప్తారు. మరికొందరి అభిప్రాయం ప్రకారం, మహావిష్ణువు ఎత్తిన పది అవతారాలు మాత్రమే భూమి మీద భౌతికంగా జరిగాయని, అందుకే వీటిని మాత్రమే దశావతారాలుగా గుర్తించారని, మిగతా వాటిని దశావతారాలలో కలపలేదని చెబుతారు. ఈ రెండవ కారణం సమంజసంగానే నాకు అనిపిస్తున్నది.

కూర్మావతారంలో మహావిష్ణువుకు ఉన్న ఆలయాలు

మహావిష్ణువుకు మన భారతదేశంలో ఈ కూర్మావతారానికి సంబంధించి మూడు ప్రముఖమయిన దేవాలయాలు కూడా ఉన్నాయి. 

  • మొదటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీ కూర్మం దేవాలయం
  • రెండవది కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గలో ఉన్న శ్రీ గవి రంగనాథ స్వామి దేవాలయం 
  • ఇక మూడవది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ కూర్మ వరదరాజ స్వామి దేవాలయం

వీటి గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాము.

ఇది కూడా చదవండి: Spiritual Significance of Narasimha Avatar in Hinduism

మొదటిది శ్రీ కూర్మం దేవాలయం 

ఈ దేవాలయానికి శ్రీకూర్మం లేదా కూర్మనాధస్వామి ఆలయం అనే పేర్లు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. బంగాళాఖాతం సముద్రం ఒడ్డున ఉన్న శ్రీకాకుళం ప్రాంతంలో ఈ గుడి ఉన్నది. మహావిష్ణువుకు తాబేలు రూపంలో ఉన్న ఆలయాలలో ఏకైక స్వయంభూవు ఆలయంగా దీనికి పేరు వచ్చింది.  

ఇక్కడి స్థల పురాణం ప్రకారం, శ్వేత చక్రవర్తి ఇక్కడ చాలా సంవత్సరాలు మహావిష్ణువు కోసం ఘోర తపస్సు చేశాడని చెబుతారు. అతని తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు కూర్మావతారం రూపంలో అతనికి దర్శనం ఇచ్చాడని చెబుతారు. సృష్టికర్త అయిన బ్రహ్మ ఇక్కడ స్వయంగా గోపాల యంత్రంతో ఈ క్షేత్రాన్ని పవిత్రం చేశాడని కూడా చెబుతారు. 

ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న “శ్వేత పుష్కరిణి” అనే సరస్సును మహావిష్ణువు ఆయుధమయిన సుదర్శన చక్రంతో ఏర్పడిందని చెబుతారు. ఈ దేవాలయంలో శ్రీమహాలక్ష్మి వరద ముద్ర రూపంలో గరుడ వాహనం మీద ఆసీనురాలయి దర్శనమిస్తుంది. ఆమెను ఇక్కడ శ్రీ కూర్మయి నాయకి అని కూడా పిలుస్తారు.

ఈ దేవాలయంలో కూర్మం యొక్క ప్రధాన విగ్రహం ఒక పెద్ద సాలిగ్రామంగా కనిపిస్తుంది. దీనిని “సంప్రదాయం” అని కూడా పిలుస్తారు. ఇది మానవుడు రూపొందించిన శిల్పం కాదు అని, ఒక పెద్ద తాబేలు యొక్క శిలాజం అని చెబుతారు. కూర్మనాథస్వామి విగ్రహం నల్లరాతితో నిర్మితమైనది, అయితే గంధపు చెక్కలను తరచుగా పూయడం వల్ల పసుపు రంగులో కనిపిస్తుంది. 

శ్రీకూర్మం దేవాలయం అక్కడ మనకు కనిపించే నిర్మాణ శైలికి చాలా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం గోపురం రూపకల్పన ఇతర వైష్ణవ దేవాలయాలలో కనిపించే శైలికి చాలా భిన్నంగా ఉంటుంది. ఎక్కడయినా మనకు మామూలుగా ఒక్కటే ధ్వజ స్తంభం కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకు రెండు ధ్వజ స్తంభాలు కనిపిస్తాయి. ఒకటి పశ్చిమాన ఉంటే మరొకటి తూర్పున కనిపిస్తుంది. వైష్ణవ దేవాలయంలో ఇది చాలా అసాధారణంగా కనిపించే విషయం. 

ఈ గుడిలో మూలవిరాట్టు పశ్చిమం వైపు ఉండటం కారణంగానే ఈ విధంగా రెండు ధ్వజ స్తంభాలు ఉన్నాయని చెబుతారు. గర్భగుడి పైన భాగంలో అష్టదళ పద్మం రూపంలో నిర్మించబడినది. ఈ దేవాలయంలో ప్రార్థనలు చేయడానికి భక్తులు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశించవచ్చు. ఈ సంప్రదాయం కూడా సహజంగా ఉండే అన్ని వైష్ణవుల సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటుంది. ఈ దేవాలయం అద్భుతమైన శిల్పకళకు కూడా ప్రసిద్ధి చెందినది. 

రెండవది శ్రీ గవి రంగనాథ స్వామి దేవాలయం

ఈ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో హోసదుర్గ పట్టణానికి దాదాపు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవి రంగపుర అనే ప్రాంతంలో ఉంది. ఈ ఆలయం ఒక గుహలో ఉంటుంది. గుహని కన్నడ భాషలో గవి అని సంబోధిస్తారు. అందుకే ఈ దేవాలయానికి “గవి రంగనాథస్వామి” అని పేరు వచ్చింది. 

ప్రధాన గర్భగుడిలో, శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. ఈ గుడి కొండపైన ఉంటుంది. మూలవిరాట్టు కొండ మీద ఉన్న ఒక గుహలో ఉంటుంది. ఒక పెద్ద తాబేలు రూపంలో ఉన్న మహావిష్ణువు విగ్రహం గుహ మధ్యలో నేల మీద కనిపిస్తుంది. ఆ తాబేలు విగ్రహం కనుల మీద పెద్ద వెండి కళ్ళు మనకు కనిపిస్తాయి. అంతే కాకుండా మహావిష్ణువు యొక్క తిరునామం కూడా ఆ విగ్రహం నుదుటిపై చూడవచ్చు. ఈ విగ్రహానికి రెండు వైపులా మనం మహావిష్ణువు చేతులలో చూసే శంఖం మరియు చక్రం చూడవచ్చు.

మూడవది శ్రీ కూర్మ వరదరాజ స్వామి దేవాలయం

ఈ గుడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు మార్గంలో ఉంది. ఇక్కడ దేవాలయంలో శ్రీమహావిష్ణువు తన భార్య అయిన భూదేవి సహితముగా తాబేలు రూపంలో భక్తులను అనుగ్రహిస్తాడు. ఈ ఆలయం కౌడిన్య నది ఒడ్డున ఉన్నది.

పురాణాల ప్రకారం 1790 లలో ఈ గుడి ఉన్న రాయలసీమ ప్రాంతం మహమ్మదుల పాలనలో ఉండేది. వారి పాలనలో ప్రజల మధ్య మతపరమైన విభేదాల కారణంగా ఎన్నో ప్రముఖమయిన దేవాలయాలు కూల్చివేయబడ్డాయి. జరుగుతున్న ఘోరాలను చూసిన కుర్మయి గ్రామస్తులు ఈ ఆలయం ప్రహరీ గోడను పడగొట్టి దాదాపు దాదాపు 250 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఇసుకతో కప్పేశారు. ఈ విధంగా ప్రధాన గుడి ఎవరికీ కనపడకుండా చేసారని కథ ప్రాచుర్యంలో ఉన్నది. అప్పుడు శ్రీ వరదరాజ స్వామి ఈ ఆలయాన్ని విడిచి కాంచీపురం వెళ్లారని, ఆ సమయంలోనే కోధేవరబండ అనే రాతిపై ఆయన పాదముద్రలు ఏర్పడినట్లు కూడా ప్రజలు విశ్వసిస్తారు. 

దాదాపు 150 సంవత్సరాల క్రితం, ఒక రోజు కుర్మయి గ్రామానికి చెందిన ఒక కన్నడ వ్యక్తి ఈ ప్రదేశాన్ని సందర్శించి అక్కడ ఉన్న ఇసుక కొండలను తవ్వి పరిశీలిస్తుండగా అనుకోకుండా అతనికి కూర్మ వరదరాజ స్వామి గుడి గోపురం కనిపిస్తుంది. వెంటనే కుర్మయి గ్రామస్తుల సహాయంతో అక్కడ ఇసుక మొత్తాన్ని తీసి ఆలయాన్ని పూర్తిగా వెలికితీసి పునర్నిర్మించారని చెబుతారు. 

ఇక్కడ జరిగే ప్రధాన ఉత్సవం రథోత్సవం సమయంలో వరదరాజ స్వామిని అతని భార్య అయిన భూదేవి సహితముగా రథంలో గ్రామ వీధుల్లో ఊరేగిస్తారు. ఈ గుడి ఉన్న కుర్మయి గ్రామం చిత్తూరు జిల్లా పలమనేరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

చివరిమాట 

ఈ కథ నుండి కూడా మనం ఒక మంచి సందేశం గ్రహించవచ్చు. దుష్టులను నాశనం చేసేటప్పుడు కొన్ని సందర్భాలలో ముందు కొంచెం తగ్గినా కూడా చివరికి మంచికే గెలుపు లభిస్తుంది. దుష్టులను ఎదుర్కొనేటప్పుడు ధైర్యం, శక్తి ఎంత ముఖ్యమో, ఓర్పు సహనం కూడా అంతే ముఖ్యమని మనం ఇక్కడ గ్రహించవచ్చు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top