త్రిమూర్తులయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ సకల చరాచర సృష్టిని నిర్మించి, పాలించి, నిర్మూలించే కార్యాలను నిర్విఘ్నంగా నడిపిస్తూ తమ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. సృష్టి నడుస్తున్నప్పుడు ఆ నిర్దేశించిన క్రమాన్ని కొనసాగించడంలో ఆటంకాలు ఏర్పడినప్పుడు ఆ సృష్టిని కాపాడే బాధ్యత మహావిష్ణువు తీసుకున్నాడు అని, రకరకాల సందర్భాలలో సృష్టిని కాపాడటానికి అవతారపురుషుడిగా వచ్చి ధర్మాన్ని పునరుద్ధరించాడు అని తెలుసుకున్నాము. మహావిష్ణువు ఈ విధంగా ఎత్తిన ప్రతీ అవతారం ఈ విశ్వాన్ని ఒకొక్క భయంకరమయిన ఆపద నుండి గట్టెక్కించడానికి ఉన్నప్పటికీ, వీటి అన్నిటి ముఖ్య ఉద్దేశ్యం, లక్ష్యం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ.
మనందరం మహావిష్ణువు ఎత్తిన మూడవ అవతారం ఒక రాక్షసుడిని అంతమొందించడానికి ఎత్తినదే అని ఊహించగలం. అయితే ఈ రాక్షసుడు ఆ మహావిష్ణువుకు పరమ భక్తుడు, సేవకుడు అవటం చాలా ఆశ్చర్యకరమయిన విషయం. మరింకెందుకు ఆలస్యం… పదండి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
జయ విజయులు ఎవరు?
హిందూ పురాణాల ప్రకారం, జయ మరియు విజయ ఇద్దరూ మహావిష్ణువు యొక్క నివాసం అయిన వైకుంఠం దగ్గర ద్వారపాలకులు.
బ్రహ్మాండ పురాణం ప్రకారం, వరుణుడికి అతని భార్య స్తుతకు కలిగిన ఇద్దరు కుమారులే ఈ జయ మరియు విజయ. వీరు ఇద్దరూ నాలుగు చేతులు కలిగి ఉన్నారని చెబుతారు. అంతేకాదు, శ్రీమహావిష్ణువు ధరించిన శంఖం, చక్రం, గద ఆయుధాలను వీళ్ళు కూడా ధరించేవారు. నాలుగవ చేతిలో మహావిష్ణువు పద్మం పట్టుకొని కనిపిస్తే, వీళ్ళు మాత్రం కత్తి ధరించి కనిపిస్తారు. వీరు ఇద్దరూ మహావిష్ణువు చెంత ఉండి, ఆయన నివాసానికి ద్వారపాలకులుగా ఉంటూ, ఆయనను సేవిస్తూ ఉండేవారు.
ఒకసారి, బ్రహ్మదేవుని మానస పుత్రులయిన సనక, సనాతన, సనందన, మరియు సనత్కుమారులు మహావిష్ణువు దర్శనం చేసుకోవాలని వైకుంఠాన్ని సందర్శిస్తారు. తమ తపశ్శక్తి వలన ఎన్నో సంవత్సరాల వయస్సు ఉన్నా కూడా వీరు చిన్నవారి లాగా కనిపించేవారు. అక్కడ లోపలికి పోయేటప్పుడు, ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు వీరిని అడ్డగిస్తారు. మహావిష్ణువు సేద తీరుతున్నారని, ఈ సమయంలో దర్శనానికి పంపించటం కుదరదని అంటారు. దీనికి కోపగించిన ఆ నలుగురు ఋషులు వీరిద్దరినీ భూలోకంలో రాక్షసులుగా జన్మించి అక్కడ కామము, క్రోధం మరియు దురాశ దోషాలను అధిగమించి, శుద్ధి అవ్వమని శపిస్తారు.
ఈ భయంకరమయిన శాపానికి జయవిజయులు భయపడిపోతారు. ఇంతలో అక్కడ ప్రత్యక్షమయిన మహావిష్ణువును ప్రార్ధించి, తమను శాప విముక్తులను చెయ్యమని వేడుకుంటారు. అయితే మహాఋషులు ఇచ్చిన శాపం నుండి విముక్తి ఇవ్వడం అసాధ్యమని మహావిష్ణువు చెబుతాడు.
అయితే, కొంత ఉపశమనం ఉండే విధంగా వారికి రెండు మార్గాలు చూపిస్తాడు. అందులో మొదటిది విష్ణుభక్తులుగా భూమి మీద ఏడు జన్మలు తీసుకోవడం. ఇక రెండవది విష్ణుద్వేషులుగా మూడు జన్మలు తీసుకోవడం. వీటిలో దేనినైనా ఎంచుకొని అనుభవించిన తర్వాత, వారు తిరిగి వైకుంఠం చేరుకొని తమ స్థానాలలో శాశ్వతంగా ఉండగలరు అని చెప్తాడు. అయితే, మహావిష్ణువుకు దూరంగా ఏడు జన్మలు ఉండటం కన్నా అతనికి శత్రువుగా మూడు జన్మలు త్వరగా పూర్తి చేసి ఆయన సన్నిధికి చేరుకోవాలని తలుస్తారు. వెంటనే విష్ణువుకు శత్రువులుగా మూడు జన్మలు ఉండేలా అనుగ్రహించమని వేడుకుంటారు. ఈ కోరిక ప్రకారం, వీరు ఇద్దరూ భూలోకంలో మూడు జన్మల పాటు మహావిష్ణువుకు బద్ధ శత్రువులుగా జన్మించినప్పుడు, వీరిని సంహరించడానికి మహావిష్ణువు కూడా మూడు అవతారాలు ఎత్తవలసి వస్తుంది.
వీరు ఇద్దరూ సత్యయుగంలో హిరాణ్యాక్షుడిగా, హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణులుగా, చివరకు ద్వాపరయుగంలో శిశుపాలుడు మరియు దంతవక్రునిగా జన్మిస్తారు. అలా జన్మించిన హిరాణ్యాక్షుడిని చంపడానికి శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారమే దశావతారాలలో మూడవదయిన వరాహ అవతారం.
ఇక్కడ గమనించాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఒకొక్క జన్మ ఎత్తిన తరువాత వీరి శక్తి కూడా తగ్గిపోతుంది. మొదటి జన్మలో హిరాణ్యాక్షుడిగా, హిరణ్యకశిపుడిగా జన్మించినప్పుడు వీరు ఇద్దరూ భూలోకం మొత్తాన్నీ పాలించే శక్తి కలిగి ఉంటారు. వీరిని చంపటానికి శ్రీమహావిష్ణువు రెండు అవతారాలు ఎత్తవలసి వస్తుంది.
ఇక త్రేతాయుగంలో రావణుడు మరియు కుంభకర్ణులుగా పుట్టినప్పుడు వీరి శక్తి తగ్గి భూమి మీద కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే పాలించే రాక్షసులుగా పుట్టి శ్రీరాముడి అవతారం చేతిలో ఇద్దరూ మరణిస్తారు. ఈ రెండు జన్మలలో కేవలం వీరిని చంపటం కోసమే శ్రీమహావిష్ణువు అవతారాలు ఎత్తవలసి వచ్చింది.
ఇక చివరకు ద్వాపరయుగంలో శిశుపాలుడు మరియు దంతవక్రునిగా జన్మించినప్పుడు వీరు శ్రీకృష్ణుడు చేపట్టిన లోకకళ్యాణ కార్యక్రమంలో మరణించిన ఎందరో దుష్టులలో వీరు కూడా చేరారు. కొన్ని పురాణ కథలలో దంతవక్రుడి పేరు కాకుండా కంసుడి పేరు చెప్పారు. అంతే కానీ కేవలం వీరిని చంపటం కోసమే అన్నట్లుగా శ్రీకృష్ణుడు జన్మించలేదు.
మనందరికీ తెలిసిన తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో, పూరీలోని శ్రీజగన్నాథుని ఆలయంలో, ఇంకా శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఆలయంలో కూడా ఈ జయ-విజయ విగ్రహాలు మనకు ప్రముఖంగా కనిపిస్తాయి.
శ్రీమహావిష్ణువు వరాహ అవతారం ఎత్తడానికి వెనుక ఉన్న అసలు కథ గురించి వివరంగా తెలుసుకున్నాము కదా… ఇంకా ఇప్పుడు హిరణ్యాక్షుడు గురించి, అతనిని శ్రీమహావిష్ణువు వరాహ అవతారంలో ఎలా అంతం చేశాడో తెలుసుకుందాము.
ముల్లోకాలను గడగడలాడించిన సోదరులు
జయ విజయులలో విజయుడు హిరాణ్యాక్షుడిగా, జయ హిరణ్యకశిపుడిగా, సోదరులుగా జన్మిస్తారు. సప్తఋషులలో ఒకడయిన కశ్యప మహామునికి, దక్షుడి కుమార్తె అయిన దితికి జన్మించిన కుమారులే వీరు. దితి వీరిని ఇద్దరినీ వంద సంవత్సరాలు తన గర్భంలో పెంచింది. వీరు ఇద్దరూ పుట్టిన సమయంలో చెడుకు సంకేతంగా ఎన్నో ఉపద్రవాలు సంభవించాయి. భూకంపాలు, అగ్నిప్రమాదాలు, భీకర తుఫానులు, పిడుగులు పడటం, అగ్నిపర్వత విస్ఫోటనాలు మొదలైన అనేక సహజ అవాంతరాలు జరిగాయి.
ఈ సోదరులు ఇద్దరూ ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తారు. భూలోకంలో, దేవలోకంలో ఇంకా పాతాళలోకంలో కూడా వీరు ఎన్నో రకాలుగా విధ్వంసం సృష్టించారు. పవిత్రమయిన యజ్ఞాలను నాశనం చేయటం, విష్ణు భక్తులను ఘోరంగా హింసించటం, ఋషులను చెరసాలలో బంధించి కొరడాలతో కొట్టి శిక్షించటం, అందరూ తమనే దేవుడిగా గుర్తించాలని భయపెట్టటం, దేవతల మీద అవకాశం వచ్చినప్పుడల్లా యుద్ధం చేయటం, ఇలాంటి ఎన్నో ఘోరాలు వీరి నిత్యకృత్యాలు. ముల్లోకాలలోనూ వీరి ఆగడాలు భరించలేక దేవతలు, ప్రజలు, మునులు, ఎంతో అల్లాడిపోయేవారు.
ఇది కూడా చదవండి: Spiritual Significance of Narasimha Avatar in Hinduism
మరణం లేకుండా వరం పొందిన హిరణ్యాక్షుడు
ఎంతో అత్యాశతో, దేవతల కంటే తామే శక్తివంతులమని బలంగా నమ్మి ముల్లోకాల మీద ఆధిపత్యం సంపాదించాలని ఈ సోదరులు ఇద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తారు.
ఎప్పటికయినా దేవతల వలన ఎటువంటి ఆపద అయినా రావచ్చని ఊహించి, దేవతల ఇంకా భక్తుల పక్షపాతి అయిన విష్ణుమూర్తి నుండి కూడా ఆపద రాకూడదని తలచి మరణం లేకుండా సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి నుండి వరం పొందాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే బ్రహ్మదేవుడిని మెప్పించటం కోసం హిరణ్యాక్షుడు తపస్సు ప్రారంభిస్తాడు.
ఎన్నో వేల సంవత్సరాలు నిద్రాహారాలు మాని బ్రహ్మదేవుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. ఇతని తపస్సుకు దేవతలు భయపడిపోతారు. ఎన్నో రకాలుగా హిరాణ్యాక్షుడికి తపోభంగం కలిగించాలని తీవ్రంగా ప్రయత్నిస్తారు. అయితే వీరి ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతాయి. ఇక ఇతని తపస్సు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయితే తమకు అస్తిత్వం ఉండదని ఎంతగానో భయపడతారు.
దేవతలు అందరూ భయపడినట్లే ఇతని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. తనకు మరణం లేకుండా వరం ప్రసాదించమని బ్రహ్మదేవుడిని అడుగుతాడు. అందుకు బ్రహ్మ పుట్టినవారికి మరణం తప్పదని వేరే కోరిక ఏదయినా అడగమని అంటాడు. అప్పుడు హిరణ్యాక్షుడు తెలివిగా తనను ఏ దేవుడు, ఏ మానవుడు, ఇంకా ఏ మృగం కూడా చంపకుండా వరం ఇవ్వమని కోరతాడు. అతని తపస్సుకు ఎంతో మెచ్చిన బ్రహ్మదేవుడు కాదనలేక ఈ వరం ప్రసాదిస్తాడు.
బ్రహ్మదేవుడి వరంతో రెచ్చిపోయిన హిరణ్యాక్షుడు
బ్రహ్మదేవుడు ప్రసాదించిన ఈ అభేద్యమైన వరంతో ఇక తనకు మరణం లేదని, ఎవరూ తనను చంపలేరని హిరణ్యాక్షుడు ఎంతో సంతోషిస్తాడు. ముల్లోకాలలో తనకు ఎదురు లేదని గర్వంతో విర్రవీగుతాడు. విజయగర్వంతో తిరిగి వచ్చిన హిరణ్యాక్షుడు వెంటనే దేవతల మీద యుద్ధం ప్రకటిస్తాడు. దేవలోకమయిన స్వర్గం నుండి దేవతలను అందరినీ యుద్ధంలో ఓడించి స్వర్గం నుండి తరిమివేస్తాడు. అతని పరాక్రమం ముందు నిలువలేక దేవతలు పారిపోతారు. అక్కడి నుండి వచ్చి సముద్రాలకు అధిపతి అయిన వరుణుడిని యుద్ధనికి రమ్మని పిలుస్తాడు. అయితే వరుణుడు భయపడి పారిపోతాడు. సముద్రంలోకి దూకి ఒక్కసారిగా అలలను తన గదతో కొడతాడు. ఆ దెబ్బకు మహాసముద్రాలు అన్నీ అల్లకల్లోలం అవుతాయి. అల్లకల్లోలమయిన సముద్రాలు భూమిని ముంచేస్తాయి. తనకు ఎదురు లేదనే గర్వంతో హిరణ్యాక్షుడు భూమండలం మొత్తాన్నీ సముద్రం అడుగుకు లాక్కువెళ్తాడు.
వరాహావతారంలో హిరాణ్యాక్షుడిని అంతమొందించిన విష్ణుమూర్తి
ముల్లోకాలలో అందరూ భయంతో వణికిపోతారు. హిరణ్యాక్షుడు ఈ విధంగా భూమండలాన్ని సముద్రంలో ముంచి వేసిన సమయంలో మనువు మరియు అతని భార్య అయిన శతరూప భూమికి పాలకులుగా ఉన్నారు. జరిగిన ఈ విపరీతాన్ని చూసిన మనువు, అతని భార్య వెంటనే బ్రహ్మదేవుని దగ్గరకు వద్దకు వచ్చి నమస్కరించి, తమ పరిస్థితిని వివరించి, తమకు నివసించడానికి కూడా స్థలం లేదని, కాపాడమని వేడుకుంటారు. భూదేవి కూడా నిస్సహాయంగా కాపాడమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది.
బ్రహ్మదేవుడు ఎంతో కంగారుపడి ఏమి చెయ్యాలో తెలియక విష్ణుమూర్తిని ధ్యానిస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుని ముక్కు రంధ్రాల నుండి ఒక చిన్న పంది ఆకారంలో జీవి బయటకు వస్తుంది. ఆ జీవి ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగా ఆ జీవి ఒక మహా పర్వతం లాగా పెరుగుతుంది. శ్రీమహావిష్ణువే ఆ అవతారంలో అలా వచ్చాడని గ్రహించిన అందరూ అతనిని పూజిస్తారు. అప్పుడు శ్రీమహావిష్ణువు అందరికీ అభయం ఇచ్చి తాను సముద్రం అడుగుకు వెళ్లి భూమిని పైకి తీసుకువస్తానని చెప్పి ఒక్కసారిగా సముద్రంలోకి దూకుతాడు.
బ్రహ్మదేవుడి వరం ప్రకారం ఏ దేవుడు, ఏ మానవుడు, ఇంకా ఏ మృగం కూడా హిరాణ్యాక్షుడిని చంపలేరు. అందుకనే శ్రీమహావిష్ణువు పంది తలతో మనిషి శరీరంతో కలిసి ఉండేలాగా భయంకరమయిన అవతారం ఎత్తుతాడు. ఎంతో భారీ ఆకారంతో ఒక్కసారిగా మహాసముద్రం అడుగునకు వెళ్లి తన కొమ్ముల మీద భూమండలాన్ని నిలిపి బయటకు తీసుకువస్తాడు. భూగ్రహాన్ని మళ్ళీ తన యథాస్థానంలో నిలిపి భూభ్రమణం ఆగకుండా కాపాడతాడు. ఇక చివరికి హిరాణ్యాక్షుడితో భీకరంగా యుద్ధం చేసి అతనిని తన ఆయుధాలతో, కొమ్ములతో ఘోరంగా చంపేస్తాడు.
ఈ విధంగా ముల్లోకాలకూ పట్టిన హిరాణ్యాక్షుడి పీడ వదులుతుంది. ముల్లోకాలలో దేవతలు, మునులు, సామాన్య ప్రజలు అందరూ ఆ భయంకరమయిన రాక్షసుడిని అంతమొందించి లోకకల్యాణం చేసిన ఆ దేవదేవుడిని భక్తితో స్మరించుకొని సంబరాలు చేసుకుంటారు.
వరాహావతారం విశిష్టత
శ్రీమహావిష్ణువు ఎత్తిన ఈ వరాహ అవతారం యొక్క ఉద్దేశ్యం కూడా భూగోళాన్ని రాక్షసులు చేతుల నుండి రక్షించి ధర్మ సంస్థాపన చేయటం.
వరాహ జయంతి మన దేశంలో చాలా గొప్పగా భక్తితో జరుపుకుంటారు. మాఘ మాసంలోని శుక్ల పక్షంలో మూడవ రోజు లేదా తృతీయ తిథిలో ఈ వరాహ జయంతి వస్తుంది. వరాహస్వామిని భక్తితో పూజిస్తే జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి, ఆ స్వామి మంచి ఆరోగ్యాన్ని, జీవితంలో సంతోషాన్ని, అన్ని పనులలో విజయాన్ని ప్రసాదిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఇది కూడా చదవండి: Forgotten Vishnu Avatars in Hindu Mythology
మన దేశంలో వరాహావతారంతో ఉన్న దేవాలయాలు
మన భారతదేశంలో శ్రీమహావిష్ణువు ఎత్తిన వరాహావతారానికి సంబందించిన ప్రముఖ ఆలయాలు కూడా కొన్ని ఉన్నాయి.
తమిళనాడులోని కడలూరు జిల్లాలోని శ్రీముష్ణం అనే ప్రాంతంలో ఉన్న భూవరాహస్వామి దేవాలయం చాలా ప్రముఖమయినది. ఈ దేవాలయం ఎంతో పురాతనమయిన మధ్యయుగ దేవాలయం. ఈ ఆలయం ఎనిమిది స్వయంబు క్షేత్రాలలో ఒకటి అని కూడా చెబుతారు.
ఇక మనందరికీ తెలిసిన తిరుమలలో కూడా వరాహస్వామికి ఒక ఆలయం ఉన్నది. ఇది కూడా ఎంతో పెద్ద దర్శనీయ స్థలం.
ఇవే కాకుండా, మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్ జిల్లాలో ఉన్న ఖజురహోలోని వరాహ దేవాలయం కూడా చాలా పేరు గాంచింది. శ్రీమహావిష్ణువు యొక్క వరాహ అవతారాన్ని ప్రతిబింబించేలాగా ఇక్కడ ఒక భారీ ఏకశిల ఉన్నది. ఈ ఆలయంలో వరాహాన్ని పూర్తిగా జంతు రూపంగా చూపించారు. ఇక్కడ ఉన్న వరాహ విగ్రహం 2.6 మీటర్ల పొడవు మరియు 1.7 మీటర్ల ఎత్తు ఉంటుంది.
ఈ శిల్పం ఎంతో భారీగా కనిపిస్తూ ఇసుకరాయితో తయారు చేయబడింది అని చెప్తారు. ఈ విగ్రహం పైన అనేక బొమ్మలతో చెక్కబడి కనిపిస్తాయి. ఈ విగ్రహం ముక్కు ఇంకా నోటి మధ్య వీణను చేతుల్లో మోస్తున్న సరస్వతీ దేవిని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయం 1986లో ఖజురహోలో UNESCO చేత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
చివరిమాట
విష్ణువు యొక్క వరాహ అవతారం చెడుపై మంచి సాధించిన విజయం. ఈ అవతారం విష్ణువు యొక్క రక్షిత స్వభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే వరాహ అవతార కథ మంచి మరియు చెడుల మధ్య శాశ్వతమైన పోరాటాన్ని గుర్తు చేస్తుంది. భక్తి, విశ్వాసం మరియు ధర్మం యొక్క అంతిమ విజయం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. వరాహ యొక్క దివ్య త్యాగం విశ్వాన్ని పోషించే విష్ణువు పాత్రను బలపరుస్తుంది.