The Untold Story of Barbarik in Mahabharata

The Unknown Story of Barbarik in Mahabharata

మహాభారతం అంటేనే… ఎన్నో కథలు, మరెన్నో జీవిత సత్యాలని బోధించే ఒక పురాతన ఇతిహాసం. ఇందులో తవ్వేకొద్దీ ఎన్నో రహశ్యాలు, ఇంకెన్నో పాత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటాయి. అలాంటి వారిలో బార్బారికుడు ఒకడు. మహాభారత యుద్ధాన్ని కేవలం ఓకే ఒక్క నిముషంలో ముగించగల గ్రేట్ వారియర్ ఇతను. అంత క్యాపబులిటీ ఉండి కూడా తనని తాను సెల్ఫ్-శాక్రిఫైజ్ చేసుకున్న వన్ అండ్ ఓన్లీ లెజెండ్ బార్బారికుడు. అలాంటి బార్బారికుడికి  శ్రీకృష్ణుడు చేసిన ప్రామిస్ ఏంటి? ఇప్పటికీ అతను కృష్ణుడితో సమానంగా ఎందుకు పూజించ బడుతున్నాడో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

బార్బారికుడు ఎవరు?

బార్బారికుడు మరెవరో కాదు, పాండవులలో ఒకరైన భీముని మనుమడు, ఘటోత్కచుని కుమారుడు. మహాభారతంలో లక్క ఇంటిని తగలబెట్టిన తర్వాత తన తల్లిని, మరియు సోదరులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత భీమునిపై పెడతాడు కృష్ణుడు. ఆయన మాట మేరకు వారందరినీ ఓ సేఫ్టీ ప్లేస్ లో ఉంచుతాడు భీముడు. ఆ సమయంలో నరవాసన పసిగట్టి… వారిని చంపి తిందామని అక్కడికి వస్తుంది రాక్షస జాతికి చెందిన హిడింభి. 

కానీ, భీముడిని చూశాక, తన మనసు మార్చుకుంటుంది. ఎలాగైనా సరే అతనిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. వెంటనే మానవ రూపం ధరించి… కుంతీదేవి దగ్గరికి వెళ్లి వేడుకుంటుంది. తల్లి ఆజ్ఞ మేరకు హిడింభిని పెళ్ళాడతాడు భీముడు. వీరిద్దరికీ పుట్టిన కొడుకే ఘటోత్కచుడు.

ఘటోత్కచుడు ఇంద్రజాల విద్యలలో బాగా ఆరితేరినవాడు. మహాభారత యుద్ధంలో తన విద్యలతో కౌరవ సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడతాడు. తాంత్రిక విద్యలలో తనకు సాటి వేరొకరు లేరని శ్రీకృష్ణుని నుండీ వరం కూడా పొందుతాడు. 

ఇక మరోవైపు కృష్ణునికి మౌర్వి అనే గొప్ప భక్తురాలు ఉండేది.  నిజానికి ఆమె ఒక రాక్షస జాతికి చెందిన స్త్రీ. ఒకప్పుడు నరకాసురుడి స్నేహితుడు అయిన మురుడు అనే రాక్షసుడు ఈ భూలోకంలో అల్లకల్లోలం సృష్టిస్తుండేవాడు. అతని ఆగడాలు సహించలేక కృష్ణుడే అతడిని సంహరిస్తాడు. ఆ మురుడి చెల్లెలే ఈ మౌర్వి. 

తన అన్న చావుకు కారణం అయిన కృష్ణుడిని చంపడానికి కృష్ణుడితో యుద్ధం చేస్తుంది. ఆ యుద్ధం చాలా రోజులు కొనసాగుతుంది. దాంతో కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సంధించడానికి సిద్ధపడతాడు. అప్పుడు కామాఖ్యదేవి ప్రత్యక్ష్యం అయ్యి… “ఈమె నా భక్తురాలు. ఈమెకు అన్ని విద్యలను నేనే వరంగా ఇచ్చాను. కాబట్టి ఈమెను వదిలెయ్యి” అని కృష్ణుడిని కోరుతుంది. వెంటనే కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అలాగే కామాఖ్యదేవి మౌర్వితో “ఈ కృష్ణుడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు అవతారం” అని చెప్తుంది. దీంతో మౌర్వి కృష్ణుడి పాదాల మీద పడి క్షమాపణ కోరుతుంది. అప్పటి నుంచి ఆమె కృష్ణుడి భక్తురాలిగా మారింది.

ఆ తర్వాత కొంతకాలానికి కొన్ని అనుకోని కారణాల వల్ల యోధుడైన ఘటోత్కచునికీ,  గొప్ప భక్తురాలైన మౌర్వికీ వివాహం జరుగుతుంది. వీరిద్దరికీ పుట్టిన కుమారుడే ఈ బర్బారికుడు. 

పుట్టుకతోనే బర్బారికుడు గొప్ప సామర్ధ్యం కలవాడు. చిన్నతనంలోనే తన తల్లి దగ్గర అన్ని శస్త్ర విద్యలు నేర్చుకుని  గొప్ప వీరుడిగా పేరు పొందాడు. ఇక తల్లి  ఆశీర్వాదంతో పరమ శివుని మెప్పు పొంది… అద్భుత శక్తులు గల మూడు బాణాలు పొందుతాడు. అప్పటినుండీ బార్బారికుడు “త్రిబాణధారి” అని పిలవబడేవాడు. అలాగే, అగ్ని దేవుడు నుండి ఒక ప్రత్యేక విల్లును కూడా పొందాడు. ఈ కారణంగా ఇతను “ముల్లోకాల్లో అజేయుడు”గా నిలిచాడు.

పుట్టినప్పటినుండీ బార్బారికుడికి మహాభారత యుద్ధాన్ని చూడాలనే కోరిక ఎక్కువగా ఉండేది. ఆ విషయాన్ని తన తల్లితో చెప్తాడు. అతని తల్లి కూడా అందుకు అంగీకరిస్తుంది. అయితే, ఆ యుద్ధంలో  నీవు ఎవరి పక్షాన నిలిచి పోరాడతావు? అని ఆమె అడగగా… బలహీనుల వైపు నిలిచి పోరాడతానని తన తల్లికి వాగ్దానం చేస్తాడు బార్బారికుడు.

ఇది కూడా చదవండి: The Untold Story of Vrishasena

బార్బారికుడు యుద్ధానికి సాక్షిగా ఎలా మారాడు?

బార్బారికుడి 3 బాణాలు ఎంత శక్తివంతమైనవంటే – మొదటి బాణం టార్గెట్ ని గుర్తు పెట్టుకుంటుంది. రెండవ బాణం ఆ టార్గెట్ ని మార్క్ చేసి వస్తుంది. మూడవ బాణం టార్గెట్ ఫినిష్ చేస్తుంది. ఇలా ఈ 3 బాణాలు కూడా తమ టార్గెట్ రీచ్ అవగానే తిరిగి అమ్ములపొదిలోకి వచ్చి చేరతాయి. 

అయితే, మొదటినుంచీ బార్బారికునికి మహాభారత యుద్దాన్ని చూడాలనే కోరిక ఎక్కువగా ఉండేది. ఆ క్యూరియాసిటీతోనే మాటి మాటికి యుద్ధమెప్పుడు జరుగుతుందని కృష్ణుని అడుగుతుండేవాడు. 

ఇక యుద్ధం ప్రారంభం కావటానికి కొద్దిరోజుల ముందు ప్రతి యోధుడినీ పిలిచి కృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. ‘నీకే బాధ్యతలు ఇస్తే యుద్దాన్ని ఎన్ని రోజులలో ముగించగలవు?’ అని. అప్పుడు భీష్ముడు 20 రోజులు చాలని చెపితే, ద్రోణుడు 25 రోజులు కావాలని, కర్ణుడు, 24 రోజులు సరిపోతాయని, అర్జునుడు 28 రోజులు పడుతుందని ఇలా వారి వారి సామర్ధ్యాలని బట్టి చెపుతూ వస్తారు. ఇలా తలా ఓరకంగా చెబుతారు. కానీ, బార్బారికుడు మాత్రం నేను బరిలోకి దిగితే కేవలం ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు. ఆ మాటకి శ్రీకృష్ణుడు షాక్ అయి… అదెలా సాధ్యం? అని అడుగుతాడు. అప్పుడు బార్బారికుడు తనకి తల్లి ఇచ్చిన వరం గురించి, అలాగే తన వద్ద గల మూడు బాణాల గురించి వివరిస్తాడు.

దీంతో బార్బారికుని శక్తిని ప్రత్యక్షంగా పరీక్షించాలని అనుకొంటాడు శ్రీకృష్ణుడు. పక్కనే వున్న రావిచెట్టుని చూపించి… ఆ చెట్టుకి ఉన్న ఎండుటాకులను తన బాణాలతో రంధ్రము చేయ వలసినదిగా కోరుతాడు. అప్పుడు బార్బారికుడు తన మొదటి బాణాన్ని ప్రయోగిస్తాడు. అది వెళ్లి… ఎండుటాకులను గుర్తించి వచ్చి… కృష్ణుని కాలివద్దకు వెళ్లి… తిరిగి వెనుకకి వెళ్లి తన అమ్ముల పొదిలోకి చేరిపోతుంది. తర్వాత రెండవ బాణాన్ని ప్రయోగిస్తాడు. అది వెళ్లి… ఆ ఆకులపై గుర్తులు పెట్టుకుంటూ పోయి…  కృష్ణుని కాలిపైన కూడా మార్క్ చేసుకొని… అమ్ములపొదిలోకి వెళ్ళిపోతుంది. 

చివరిగా మూడవ బాణాన్ని ప్రయోగిస్తాడు. అది వెళ్లి… మార్క్ చేసి ఉంచిన అన్ని ఆకులను కాల్చి బూడిద చేసి… చివరికి శ్రీకృష్ణుడి పాదం చుట్టూ తిరగుతూ ఉంటుంది. ఎందుకలా తన కాలిచుట్టూ తిరుగుతుందని శ్రీ కృష్ణుడు అడగగా… బార్బారికుడు మీ కాలి క్రింద ఒక ఆకు దాగి ఉంది, దానిని బయటకు తీయండి అని బదులిస్తాడు. వెంటనే కృష్ణుడు  తన కాలిని ప్రక్కకు జరపగా… అక్కడగల ఎండుటాకును కుడా బూడిద చేసి వచ్చి… తిరిగి అమ్ములపొదిలో చేరిపోతుంది. 

దీనివల్ల బార్బారికుని వద్దనుండి శత్రువులు ఎవరూ తప్పించుకోలేరని అర్ధమయింది. అంతేకాదు,  బార్బారికుడు ఎంత శక్తిమంతుడో కూడా అర్ధమయింది. ఈ  ప్రకారం చూస్తే, మహాభారత యుద్ధం కేవలం ఒక్క నిమిషంలో ముగిసిపోతుందని కూడా అర్ధమయింది. ఇక బార్బారికుడు తన తల్లి వద్ద నుండీ పొందిన వరం గురించి అడుగుతాడు శ్రీకృష్ణుడు. దానికతను ఓడిపోయే వారివైపు నిలిచి… వారిని  గెలిపించాలనేదే తన తల్లి నుండీ పొందిన వరమని చెప్తాడు.  మహాభారత యుధ్ధంలో పాండవుల సైనిక బలం తక్కువ కాబట్టి… వారికి సహాయపడి వారిని గెలిపించాలనేది తన అభిమతమని చెప్తాడు.

ఇందులో ఉన్న లాజిక్ ఏంటనేది కృష్ణునికి తెలిసింది.  అదేమిటంటే, కౌరవులది 11అక్షౌణుల సైన్యం , పాండవులది 7 అక్షౌణుల సైన్యం కాబట్టి, బార్బారికుడు తల్లి వర ప్రభావముతో పాండవ పక్షంలో యుధ్ధం చేసి… 11అక్షౌణుల సైన్యాన్ని నాశనం చేస్తాడు. తరువాత పాండవులకి  7 అక్షౌణుల సైన్యం వుంటుంది కాబట్టి వెంటనే అతను కౌరవుల తరఫున యుద్ధం చేసి… పాండవుల సైన్యాన్ని సంహరిస్తాడు. ఈవిధంగా రెండు వైపులనుంచి కుడా అతను యుద్ధం చేస్తాడు. ఆ యుధ్ధంలో చివరికి ఎవరూ మిగలరనేది కృష్ణునికి అవగతం అవుతుంది. మొత్తం యుధ్ధమంతా బార్బారికునితోనే ముగుస్తుంది. అలా జరిగితే ఈ యుధ్ధంతో ముడిపడి వున్న ఎందఱో వీరుల ప్రతిజ్ఞలు నెరవేరవు. అలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలంటే, బార్బారికుడు జీవించి వుండకూడదు అని నిర్ణయించుకుంటాడు శ్రీకృష్ణుడు. 

వెంటనే వృద్ద భ్రాహ్మణ రూపం ధరించి… సూర్యోదయం వేళ సూర్య భగావానునికి అర్ఘ్యం సమర్పిస్తున్న బార్బారికుని వద్దకు వెళ్లి… దానం కోరతాడు కృష్ణుడు.  తాను అడిగింది ఎలాంటి దానమైనా సరే కాదనకుండా ఇస్తానని మాట ఇస్తాడు బార్బారికుడు. వెంటనే నీ శిరస్సుని దానంగా ప్రసాదించమని కోరతాడు.  భ్రాహ్మణ రూపంలో వచ్చింది సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తేనని గ్రహించి, తన శిరస్సు మాత్రమే ఎందుకు కావాలని అడుగుతాడు. యుద్దాన్ని ప్రారంభించే ముందు ఒక గొప్ప యోధుడిని బలివ్వటం అవసరమని చెప్తాడు శ్రీకృష్ణుడు. 

తనని ఆ కాలపు గొప్ప వీరుడిగా భావించినందుకు  సంతోషిస్తూ, బార్బారికుడు తన శిరస్సును ఖండించి యివ్వటానికి అంగీకరిస్తాడు. కానీ, తన తలని ఇచ్చే ముందు, రాబోయే యుద్ధాన్ని చూడాలనే తన కోరిక ఎలా తీరుతుందని అడుగుతాడు. దానికి కృష్ణుడు యుద్ధభూమి మొత్తం 360 డిగ్రీస్ యాంగిల్ లో కనపడేలా… అతని తలని అక్కడకి దగ్గరగా ఉన్న ఒక కొండపైన వుంచి… మహా భారతయుధ్ధం మొత్తం చూసేలా చేస్తాడు. 

యుద్ధం ముగిసే సమయానికి, పాండవులు తామీ విజయం సాధించటంలో గొప్ప సహకారం ఎవరిది? అని తమలో తాము వాదించుకున్నారు. దీనికి శ్రీకృష్ణుడు యుద్ధం మొత్తాన్ని చూసింది కేవలం బార్బారికుడే కాబట్టి అతని తల ఏమని జడ్జిమెంట్ ఇస్తుందో… తెలుసుకోమని చెప్తాడు. ఈ విషయాన్నే పాండవులు వెళ్లి బార్బారికుని తలని అడుగుతారు. 

అప్పుడు బార్బారికుడు ఒక దివ్య చక్రం ఈ యుద్ధభూమి చుట్టూ తిరుగుతూ, ధర్మం వైపు లేని వారందరినీ చంపింది. అదే నేను చూడగలిగాను అన్నాడు. ఇది విన్న పాండవులు ఈ భూమిపై అధర్మాన్ని నిర్మూలించిన వారంటే వేరెవరో కాదు, సాక్షాత్తూ ఆ నారాయణుడేనని, తాము కేవలం ఆయనకి సాధనాలుగా మాత్రమే ఉపయోగపడ్డామని  గ్రహించారు. ఈ విధంగా మహాభారత యుద్ధానికి విట్నెస్ గా మారాడు బార్బారికుడు. ఇక యుద్ధం తరువాత, బార్బారికుని తల అతని శరీరంతో జతచేయబడింది. శాంతిని కాపాడటం కోసం అతను ఆ స్థలాన్ని మరియు మొత్తం ప్రపంచాన్నే  విడిచిపెట్టవలసి వచ్చింది.

బార్బారికుని గత జన్మ రహశ్యం 

బార్బారికుడు ద్వాపర యుగంలో పుట్టిన యోధులందరిలోనూ అత్యంత గొప్ప యోధుడు. ఆ యుగంలో మానవునిగా జన్మించిన బార్బరికుడు  అతని పూర్వ జన్మలో ఓ యక్షుడు. 

ఒకసారి బ్రహ్మదేవుడు, మరియు ఇతర దేవతలందరూ కలిసి భూమిపై పెరుగుతున్న అధర్మానికి వ్యతిరేకంగా విష్ణుమూర్తి సహాయం కోరడానికి వైకుంఠాన్ని సందర్శించారు. విష్ణువు ప్రపంచాన్ని సంరక్షించేవాడు కాబట్టి భూమిపై ఉన్న అన్ని దుష్ట శక్తులను నిర్మూలించాలని వారు కోరుకున్నారు. అందుకు త్వరలోనే భూమిపై మానవునిగా అవతరిస్తానని, అన్ని దుష్టశక్తులను నిర్మూలిస్తానని విష్ణువు వారికి మాట ఇస్తాడు.

ఇంతలో ఒక యక్షుడు దేవతలతో ఇలా అంటాడు. భూలోకంలో ఉన్న చెడునంతా పారద్రోలటానికి విష్ణువు భూలోకానికి దిగవలసిన అవసరం ఎందుకు? కేవలం నా  సామర్థ్యం చాలు అంటాడు. ఆ మాట బ్రహ్మదేవుడిని చాలా బాధిస్తుంది. వెంటనే ఆవేశంతో భూమి నుండి అన్ని దుష్ట శక్తులను నిర్మూలించే సమయం వచ్చినప్పుడు, విష్ణువు మొదట అతన్ని చంపేస్తాడు అని శపిస్తాడు.

తర్వాత కొంతకాలానికి ఆ యక్షుడు బార్బరికునిగా జన్మిస్తాడు. కృష్ణుడి రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు శాప ఫలితంగా దానధర్మం చేయమని కోరతాడు. తర్వాత అతని చేతనే చంపబడతాడు. 

మరో వెర్షన్ ప్రకారం చూస్తే, కృష్ణుడు తన బాణాలని ఉపయోగించి రావిచెట్టు ఆకులని కొట్టమని బార్బారికునికి ఛాలెంజ్ విసిరినప్పుడు ఒక బాణం అతని పాదం మీద వచ్చి ఆగుతుంది. కానీ అది గుచ్చుకోదు. అయితే, కృష్ణుడు తన పాదాల క్రింద ఆకును దాచిన కారణంగా ఆ బాణం అతని పాదాన్ని గుచ్చుతుంది. దీంతో శ్రీకృష్ణుని పాదం మీద ఆ ప్రాంతమంతా బలహీనంగా మారుతుంది. 

దీనికి కారణం గతంలో తన పాదం మినహా మిగతా శరీరం మొత్తం రోగనిరోధక శక్తిని కలిగి ఉండేలా… ఆన్ని రకాల ఆయుదాల నుండీ కాపాడేలా… దుర్వాస మహర్షి నుండి వరం పొందాడు. అందువల్లనే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నం అయినప్పుడు, ఒక బాణం ఆయన బలహీనమైన కాలికి గుచ్చుకోవడం వల్లే అది సాధ్యమైంది. ఈ విధంగా బార్బరికుని బాణం శ్రీకృష్ణుని మరణంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఇది కూడా చదవండి: The Untold Story of Karna’s Life and Struggles

బార్బారికుడు ఎలా ఆరాధించబడ్డాడు?

బార్బారికుడు తన పూర్వజన్మలో ఓ శాపగ్రస్తుడైన యక్షుడనీ, అతనికి శాపవిమోచనం కలిగించేందుకే తాను అతని తలను కోరాననీ కృష్ణుడు చెప్తాడు. అంతేకాదు, కలియుగంలో బార్బారీకుడు తన పేరుతోనే పూజలందుకుంటాడనీ, అతణ్ని తల్చుకుంటే చాలు భక్తుల కష్టాలన్నీ చిటికెలో తీరిపోతాయనీ వరమిస్తాడు కూడా.

ఈ క్రమంలోనే మనదేశంలోని అనేక ప్రాంతాలలో బార్బారీకుడు శ్రీకృష్ణునితో సమానంగా పూజింప బడుతున్నాడు. ఇక ఆయనకి దేవాలయాలు కూడా ఎక్కువే! 

  • రాజస్థాన్‌లో బార్బారికుడిని ‘ఖాటు శ్యాం జీ’గా పూజిస్తారు. ఆయన దేవాలయం రాజస్థాన్‌లోని సికర్ జిల్లాలో ఉన్న ఖాటు గ్రామంలో ఉంది. కలియుగంలో కృష్ణుడి స్వంత పేరైన శ్యామ్ అని పిలవబడుతున్నాడు. యుద్ధం ముగిసిన తరువాత, శ్రీకృష్ణుడు బార్బారికుని తలను  రూపవతి అనే పేరున్న నదిలో  ముంచుతాడు.  అనంతరనం అతని తలని      “శ్యామ్ కుండ్” అనే ప్రదేశంలో  ఖననం చేస్తాడు. ఆ యుగం ముగిసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు ఒక ఆవు ఆ ప్రదేశానికి చేరుకున్నప్పుడు దాని పొదుగు నుండి పాలు సహజంగా ప్రవహించడం ప్రారంభమయింది.  ఈ ఘటనతో ఖాటు గ్రామస్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి, వాళ్ళు ఆ ప్లేస్ ని తవ్వటం ప్రారంభించారు. కొద్దిసేపటి తర్వాత ఆ స్థలంలో పాతిపెట్టిన తలని గుర్తించారు. వెంటనే అప్పటి ఖాటు రాజైన రూప్ సింగ్ చౌహాన్ బార్బరికుని తల కోసం ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు.
  • గుజరాత్‌లో బార్బరిక్‌ను ‘బలియదేవ్‌’గా పూజిస్తారు. గుజరాత్‌లో బలియదేవ్ అంటే ‘అద్భుత శక్తితో ఉన్న వాడు అని అర్ధం. ఆయన దేవాలయం గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లాలోని లంభా గ్రామంలో ఉంది.
  • హిమాచల్ ప్రదేశ్‌లో బార్బరికుడిని ‘కమ్రునాగ్‌’గా పూజిస్తారు. అతని ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో సుందర్‌నగర్‌లోని కమ్రు కొండలో ఉంది. అక్కడ అతన్ని ‘రతన్ యక్ష’ అని పిలుస్తారు.  మహాభారత యుద్దాన్ని చూడటానికి బార్బారికుని తలని శ్రీకృష్ణుడు ఒక కొండపైన ఉంచుతాడు. దాన్నే మనం ఇప్పుడు ‘కమ్రు కొండ’ అని పిలుచుకుంటున్నాం. బార్బారికుని ఆలయం కూడా ఆ కొండపైనే ఉంది.
  • ఉత్తర భారతదేశం, దక్షిణ భారత దేశాన్ని పక్కన పెడితే, భారతదేశాన్ని దాటి నేపాల్‌లోనూ బార్బరికుడిని పూజిస్తారు. నేపాల్‌ రాజైన ‘యలంబెర్’ నే బార్బారికునిగా చెప్పుకుంటారు. అతని ఆలయం నేపాల్‌లోని ఖాట్మండులోని ఇంద్ర చౌక్‌లో ఉంది.

ఇలా  శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన బార్బారికునికి తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది భక్తుల నమ్మకం. మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించగల బార్బారికునికి తమ కష్టాలను కడతేర్చడం అనేది చిటికెలో పని, ఇది ఆయనను నమ్ముకున్నవారి విశ్వాసం.

ముగింపు

భీముని మనవడు బార్బారికుడు మహాభారతంలో అంతగా తెలియని పాత్ర. అతని కథ అతని ధైర్యం, విధేయత మరియు అతని సూత్రాల పట్ల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. చిన్న పాత్ర అయినప్పటికీ, బార్బారికుని కథ మహాభారత కథనంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. తన తలను శ్రీకృష్ణునికి దానం చేసిన అతని నిస్వార్థ చర్య భక్తి మరియు త్యాగానికి శక్తివంతమైన ఉదాహరణ.

కీ టేకావేలు 

  1. బార్బారికుడు భీముని మనవడు మరియు అహిలావతి కుమారుడు. 
  2. అతను పాండవుల పక్షాన పోరాడిన ధైర్యవంతుడు మరియు నైపుణ్యం కలిగిన యోధుడు. 
  3. బార్బారికుని కథ అతని విధేయత మరియు నిబద్ధతకు నిదర్శనం.
  4. శ్రీకృష్ణునికి తన తలను దానం చేసిన అతని నిస్వార్థ చర్య భక్తి మరియు త్యాగానికి శక్తివంతమైన ఉదాహరణ.

చివరి మాట 

బార్బారికుని కథ, ధైర్యం మరియు విధేయతకి చిహ్నం. ఈ అంశాలు ప్రపంచంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని గుర్తు చేస్తుంది. అతని వారసత్వం నేటికీ ప్రజలను ప్రేరేపిస్తుంది. బార్బారికుని కథను అన్వేషించడం ద్వారా, మనం కర్తవ్యం, విధేయత మరియు త్యాగం యొక్క ఇతివృత్తాలని తెలియచేసే మహాభారతం గురించి లోతైన అవగాహన పొందవచ్చు.

ఈ కథలోని నీతి

నేచర్ ఎప్పుడూ దాని పని అది చేసుకుంటూ పోతుంది. నేచర్ ని గౌరవిస్తూ… మనం మన పని చేసుకుంటూ పోవాలి.  అంతేకానీ, దాని పనికి మనం అడ్డు తగలకూడదు. 

ఈ స్టోరీలో నేచర్ అంటే సృష్టిని నడిపించే శ్రీ మహా విష్ణువు. ఆయన చేసే పని ధర్మా ధర్మాలను కాపాడటం. అలాంటి ధర్మాన్ని ఎప్పుడూ మన చేతిలోకి తీసుకోవాలని ట్రై చేయకూడదు. బలం ఉంది కదా అని దేవునితో సంబంధం లేకుండా ఎవరైనా అలా ధర్మస్థాపన చేయాలనుకొంటే… భగవంతుడు ముందుగా వారిని అంతం చేసేస్తాడు. లేకుంటే వాళ్ళు దేవుడినే మించిపోతారు కాబట్టి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top