Mahabharata hero, Hindu mythology

The Untold Story of Karna’s Life and Struggles

ఒక్కోసారి జీవితంలో మనం ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలను కేవలం మన స్నేహితులతో మాత్రమే చెప్పుకోగలం. అందుకే జీవితంలో ఎంతమంది ఉన్నా… ఒక మంచి స్నేహితుడికి సాటి రారని అంటారు. అయితే, స్నేహితుడు అనే వాడు ఎలా ఉండాలి అని చెప్పటానికి బెస్ట్ ఎగ్జాంపుల్  కర్ణుడు. పాండవులలో అగ్రజుడిగా పుట్టినప్పటికీ, కౌరవుల వైపు ఉండి పోరాడిన మహాయోధుడు కర్ణుడు. జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా… ఇచ్చిన మాట కోసం, నమ్మిన స్నేహానికి కట్టుబడి, జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప ఔన్నత్యం ఉన్న వ్యక్తి కర్ణుడు. అలాంటి కర్ణుడి గురించి, మహాభారత యుద్ధంలో అతని పాత్ర గురించి వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం. 

కారణ జన్ముడు

ముందుగా కర్ణుడు ఎలా పుట్టాడో తెలుసుకుందాము. యాదవ వంశంలో కుంతిభోజుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆ రాజుకి పృథ అనే ఒక అందమయిన కూతురు ఉండేది. ఆమే మనందరికీ తెలిసిన పాండవుల తల్లి అయిన కుంతి. 

ఒకసారి దూర్వాస మహాముని ఈ కుంతిభోజుని రాజ్యానికి అతిథిగా వస్తాడు. ఆయనని భక్తిశ్రద్ధలతో సేవించమని కుంతిభోజుడు తన కూతురిని ఆజ్ఞాపిస్తాడు. ఆమె సేవలకు ఎంతగానో మెచ్చుకొన్న దూర్వాస మహాముని ఆమెను ఆశీర్వదించి, ఒక సిద్ధ మంత్రాన్ని నేర్పిస్తాడు. దాని ప్రకారం, మనసులో ఎవరినయినా దేవతలను స్మరించుకొని… ఆ మంత్రం చదివిన వారికి వెంటనే ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి ఒక బిడ్డను ప్రసాదిస్తాడని చెప్పి, వెళ్ళిపోతాడు.

ఆ మంత్రం నిజంగా పని చేస్తుందా! లేదా! అని పరీక్షించడానికి ఆమె ఒక రోజు సూర్యోదయం వేళ, సూర్యభగవానుడిని స్మరించి…  ఆ మంత్రం చదువుతుంది. వెంటనే సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యి ఆమెకు సహజ కవచ కుండలాలు కలిగి, ధవళ కాంతితో  మెరిసిపోతున్న ఒక బాలుడిని ప్రసాదిస్తాడు. 

పెళ్లి కాకుండానే తాను ఇలా ఒక బిడ్డకు జన్మనిచ్చినట్లు ఎవరికైనా తెలిస్తే ఇంకేమైనా ఉందా..! అందుకే ఏం చేయాలో తోచక వెంటనే ఆ  శిశువుని  ఒక మెత్తని బట్టలో చుట్టి… ఓ బుట్టలో పెట్టి రాజభవనం పక్కగా వెళ్తున్న అశ్వనదిలో వదిలేస్తుంది. 

ఆ తరువాత, ఆమెకు పాండురాజుతో వివాహం అవ్వడం, అతనికి ముని శాపం ఉండటం వల్ల అదే మంత్రాన్ని ఉపయోగించి వివిధ దేవుళ్ళ ద్వారా ధర్మరాజుని, అర్జునుడిని, భీముడిని సంతానంగా పొందటం; మరో భార్య మాద్రి నకుల సహదేవులను సంతానంగా పొందటం మనందరికీ తెలిసిందే. 

దత్త పుత్రుడు

ఆలా కుంతీదేవి వదిలిన బుట్ట నీటిలో అంచెలంచెలుగా తేలుతూ, గంగానదిలో కలిసి అంగరాజ్యం వైపు వెళ్తుంది. అక్కడ, నదిలో స్నానం చేస్తున్న ఒక రథసారధి భార్య అయిన రాధ ఆ బుట్టని గమనిస్తుంది. దానిని తెరిచి చూసి, అందులోని బాలుడిని చూసి ఆశ్చర్యపోతుంది. వెంటనే తన భర్త అయిన అధిరథ నందనుడి దగ్గరకు తీసుకువెళుతుంది. వారికి బిడ్డలు లేకపోవటంతో దేవుడిచ్చిన బిడ్డగా భావిస్తారు. అతనికి ‘వసుసేన’ అని పేరు పెట్టి ఎంతో ప్రేమతో పెంచుకుంటారు. 

కర్ణుడికి వసుసేన అనే పేరు మాత్రమే కాక ఇంకా, సూర్యపుత్ర, రాథేయ, సూతపుత్ర, వైకర్తన, విజయధారి, వ్రిష, దానవీర, అంగరాజు అనే పేర్లు కూడా ఉన్నాయి.

విజయదారి

పెరిగి పెద్దవాడవుతున్న కర్ణుడు హస్తినాపురంలో మిగతా పిల్లలతో పాటుగా విద్యాభ్యాసం చేస్తాడు. ఇతని విలువిద్యా నైపుణ్యానికి ఎంతో సంతోషించిన పరశురాముడు ఇతనికి ‘విజయ’ అనే ఒక అద్భుతమయిన విల్లును బహుమతిగా ఇస్తాడు. దీని వల్లనే కర్ణుడికి ‘విజయధారి’ అనే పేరు కూడా వచ్చింది. 

రథసారథి కుటుంబానికి చెందటంవల్ల విద్యాభ్యాసం చేసే సమయంలో మిగతా వాళ్ళు కర్ణుడిని తక్కువగా చూసి, ఎగతాళి చేసేవాళ్ళు. దీని వలన కర్ణుడు ఎంతో బాధపడేవాడు. కానీ, మంచి ధర్మ గుణాన్ని, సూర్యభగవానుడి మీద భక్తిని పెంచుకున్నాడు. అడిగినవారికి కాదనకుండా సహాయం చెయ్యటం కూడా నేర్చుకున్నాడు.

గొప్ప స్నేహితుడు

కౌరవులకు, పాండవులకు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత వాళ్ళ నైపుణ్యాలను ప్రదర్శించడానికి దృతరాష్ట్రుడి అనుమతితో వేదిక సిద్ధం చేస్తారు. ద్రోణాచార్యుడి సమక్షంలో 

అక్కడ ముందుగా దుర్యోధనుడు, మరియు భీముడు గదాయుద్ధం చేసి తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. ఒక సందర్భంలో ఈ విద్యా ప్రదర్శన ఒక యుద్థాన్ని తలపిస్తుంది. వెంటనే అశ్వత్థామ ఇద్దరినీ విడదీస్తాడు. 

తరువాత, అర్జునుడు తన విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాడు. అతని అద్భుతమైన విలువిద్యా నైపుణ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యంతో ముగ్ధులవుతారు. తన ప్రియ శిష్యుడిని భూమి మొత్తం మీద గొప్ప విలుకాడు అని ద్రోణాచార్యుడు ప్రకటిస్తాడు. అప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా కర్ణుడు అక్కడకు వచ్చి తన విలువిద్య ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. అంతేకాక, అర్జునుడిని ద్వంద్వ యుద్ధానికి రమ్మని సవాలు కూడా విసురుతాడు. 

ఈ ఊహించని పరిణామానికి ద్రోణుడు ఆశ్చర్యపోతాడు. ఏమి చెయ్యాలో తెలియక కర్ణుడిని అతని వంశం గురించి, తల్లిదండ్రుల గురించి అడిగి తెలుసుకుంటాడు. అతను రాజు కాదని, తెలిసి ఈ పోటీలో పాల్గొనడానికి అనర్హుడు అని చెప్తాడు. ఈ విధంగా కర్ణుడు అర్జునుడితో పోటీ పడకుండా ఆపుతాడు. 

కానీ, దుర్యోధనుడు మాత్రం పాండవులను, ముఖ్యంగా అర్జునుడిని దీటుగా ఎదుర్కోవడానికి కర్ణుడు తన వైపు ఉండటం చాలా అవసరం అని గ్రహించి అతనిని తన స్నేహితుడిగా, తనతోపాటుగా ఉండమని కోరతాడు. ఆ విధంగా కర్ణుడికి దుర్యోధనుడితో మంచి స్నేహం ఏర్పడుతుంది.

అంగరాజు

అయితే, కర్ణుడి విలువిద్యా నైపుణ్యాన్ని మొదటిసారిగా చూసిన దుర్యోధనుడు అర్జునుడిని ఎదుర్కొనటానికి కర్ణుడే సరయిన పోటీ అని గుర్తిస్తాడు. వెంటనే కర్ణుడిని అంగ రాజ్యానికి అధిపతిగా ప్రకటించి… అక్కడే అతనిని రాజుని చేస్తాడు. అయితే అప్పటికే సూర్యాస్తమయం అయ్యిందని, ఇంక పోటీ నిర్వహించకూడదని చెప్పి ద్రోణాచార్యుడు అర్జునుడితో కర్ణుడి పోటీ జరగకుండా ఆపేస్తాడు.

అందరూ తనని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, దుర్యోధనుడు తనని మెచ్చుకోవటం… అందరిముందే తనని అంగరాజ్యానికి రాజుగా ప్రకటించటం… ఇదంతా  చూసిన కర్ణుడు దుర్యోధనుడి మీద ఎంతో ప్రేమ, భక్తి పెంచుకుంటాడు. తనకు ఒక గొప్ప స్నేహితుడు దొరికాడని ఎంతో సంతోషిస్తాడు. అతని కోసం ఏమయినా చేస్తానని మాట కూడా ఇస్తాడు. 

ఇది కూడా చదవండి: Unrevealed Facts about Upapandavas

కౌరవ పక్షపాతి

కర్ణుడి పట్టాభిషేక కార్యక్రమానికి అతని తండ్రి అతిరధుడు కూడా వస్తాడు. అప్పుడు భీముడు అతనిని ఎగతాళి చేసి, నీచంగా మాట్లాడతాడు. తన తండ్రిని అలా బహిరంగంగా అందరిముందూ అవమానించడంతో కర్ణుడు భీముడిని, పాండవులను ద్వేషిస్తాడు. 

దుర్యోధనుడితో కలిసి ఉంటూ అతని ఆలోచనలను తగ్గట్టుగా ఆలోచిస్తూ కర్ణుడు పూర్తిగా పాండవులు చెడ్డవారు అనే అభిప్రాయం ఏర్పరుచుకుంటాడు. దుర్యోధనుడికి కావలసింది కూడా అదే. తన ఆలోచనలను పాటించి తాను చెప్పినట్లు చేసేలాగా కర్ణుడిని ప్రభావితం చేస్తాడు. స్నేహం ముసుగులో తాను చేసే పనులు చెడ్డవి అని తెలిసినా కూడా స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం కర్ణుడు దుర్యోధనుడు చెప్పిందల్లా చేసాడు.

ద్రౌపది స్వయంవరం సమయంలో కూడా అర్జునుడు ఆమెను గెలుపొంది వివాహం చేసుకోవడం కర్ణుడికి నచ్చదు. ఒకరకంగా ఇది కూడా పాండవులపై వైరం పెరగటానికి ఒక కారణం అవుతుంది. 

పాండవులు అజ్ఞాతవాసం ముగించి వచ్చి తమ భాగం రాజ్యాన్ని ఇవ్వాలని కోరినప్పుడు కురు పెద్దలు వెంటనే అందుకు ఒప్పుకుంటారు. అయితే, దుర్యోధనుడు మాత్రం అందుకు ఒప్పుకోకుండా యుద్ధానికి సిద్ధపడాలని వారిని రెచ్చగొట్టేలాగా మాట్లాడతాడు. దీనికి కర్ణుడు కూడా కౌరవుల పక్షపాతిగా మాట్లాడతాడు. 

గొప్ప భర్త

మహాభారత పురాణం ప్రకారం కర్ణుడికి వృశాలి, మరియు సుప్రియ అని ఇద్దరు భార్యలు. కర్ణుడిలాగే, వృశాలి కూడా సూత వర్గానికి చెందినది. అంతే కాకుండా వృశాలి చిన్ననాటి నుండి కర్ణుడికి మంచి స్నేహితురాలు కూడా. పురాణాల ప్రకారం వృశాలి చాలా తెలివైనది, ఇంకా ఆమెను గొప్ప పతివ్రతగా కూడా చెప్తారు. 

దుర్యోధనుడు కర్ణుడిని అంగ రాజ్యానికి రాజుని చేస్తానని ప్రకటించినప్పుడు వృశాలి చాలా బాధపడింది. వృశాలికి కర్ణుడు రాజు అవడం ఇష్టం లేదు. కర్ణుడు ఎప్పుడూ ఎవరి కిందా పని చేయకుండా, ఎవరికీ రుణపడి ఉండకుండా ఉండాలని వృశాలి కోరుకుంది. కానీ చివరికి కర్ణుడు దుర్యోధనుడికి జీవితాంతం రుణపడి ఉండటం తనకి ఎంతో అసంతృప్తి కలిగిస్తుంది. 

కురుక్షేత్ర యుద్ధంలో తన భర్తను, కుమారులను కోల్పోయిన తరువాత, వృశాలి తన భర్త చితిపైనే సతీ సహగమనం చేసి జీవితం ముగించుకుంది అని చెబుతారు. ఇక కర్ణుడి రెండవ భార్య పేరు సుప్రియ. ఈమె దుర్యోధనుని భార్య అయిన భానుమతికి మంచి స్నేహితురాలు.

గొప్ప తండ్రి

ఒక పురాణగ్రంథంలో కర్ణుడికి వృషసేనుడికి ఉన్న అనుబంధం విషయంలో జరిగిన ఒక గొప్ప సంఘఠన గురించి చెప్పారు. అలాగే వీరిని అర్జునుడికి అభిమన్యుడికి ఉన్న అనుబంధంతో పోల్చి చెప్పారు. ఎవరినీ ఎప్పుడూ పట్టించుకోకుండా, తన జీవితమంతా దాదాపుగా శ్రీకృష్ణుడికి నీడగా ఉండిపోయిన అర్జునుడు అభిమన్యుడి విషయంలో మాత్రం చాలా సున్నితంగా ఉండటం చూసి కర్ణుడు ఆశ్చర్యపోతాడు. 

అలాగే అభిమన్యుడు కూడా తన తండ్రితోనే మంచి అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. తండ్రితో సమయం గడపాలని అభిమన్యుడు ఎంతగా ఎదురుచూస్తాడో స్వయంగా చూసి తెలుసుకుంటాడు. అప్పుడు వెంటనే అతనికి తన పెద్ద కుమారుడు అయిన వృషసేనుడు గుర్తుకు వస్తాడు. తన కొడుకు తనకు దగ్గరగా లేకపోవటం వలన తన మనసులో ఏదో తెలియని అశాంతి, ఆందోళన అనుభవిస్తాడు. 

కర్ణుడికి వెంటనే తన ప్రియమైన కుమారుడు, ఇంకా యువరాజు అయిన వృషసేనుడిని కలవాలని, దగ్గరకు తీసుకోవాలని ఆరాటపడతాడు. తనకు మొదటగా పితృత్వ ఆనందాన్ని ఇచ్చిన, ఇంకా జీవితాన్ని పరిపూర్ణం చేసిన తన ప్రియ కుమారుడిని ఆలింగనం చేసుకోవాలని అతని దగ్గరకు వెళతాడు. 

కర్ణుడికి వృషసేనుడు కాకుండా ఇంకా ఎనిమిది మంది సంతానం ఉన్నారు. అయినప్పటికీ వృషసేనుడి మీద ఉన్న ఈ ప్రేమ, అతను పుట్టినప్పుడు కర్ణుడు అనుభవించిన ఆనందం, మిగతావారు పుట్టినప్పుడు ఎప్పుడూ అనిపించలేదు. కారణం వృషసేనుడు తాను ఎంతగానో ప్రేమించే తన భార్య వృశాలి పోలికలతోను, అంతే అందంతోను, పరాక్రమంతోను ఉండటమే! అందుకే వృషసేనుడు కర్ణుడికి మిగతా అందరికంటే ప్రియమయిన వాడు అనటంలో ఆశ్చర్యం లేదు.

కురుక్షేత్ర యుద్ధం మొదలు అవ్వటానికి కొన్ని రోజుల ముందు ఒకసారి కర్ణుడు వృషసేనుడి మందిరానికి వస్తాడు. అప్పుడు అక్కడ వృషసేనుడు ఆయుధాలను పరీక్షించటం చూస్తాడు. అలాగే, కొంచెం దూరంలో వృషసేనుడి కుమారుడుని కూడా చూస్తాడు. ఆ పిల్లవాడు తండ్రి దగ్గరకు వెళ్ళటానికి భయపడి దూరంగా ఉండి చూస్తూ ఉంటాడు. 

కర్ణుడు అక్కడకు వచ్చిన వెంటనే వృషసేనుడి కుమారుడు తాత దగ్గరకు పరిగెత్తుకు వచ్చి వృషసేనుడి గురించి చెప్తాడు. తనతో చాలా రోజులుగా ఆడుకోవటం లేదని, తన దగ్గర పడుకోవటం లేదని, దగ్గరకు వస్తే అరుస్తున్నాడని వృషసేనుడి గురించి కర్ణుడికి ముద్దు ముద్దు మాటలతో చెప్తాడు. అప్పుడు ఆ చిన్న పిల్లవాడి కళ్ళలో నీళ్లు చూసిన కర్ణుడు చలించిపోయి వెంటనే తన తండ్రిని ఆడుకోవటానికి పంపిస్తానని చెప్తాడు. 

వెంటనే కర్ణుడు వృషసేనుడిని కొడుకుతో ఎందుకు ఆడుకోవటం లేదని కొంచెం గట్టిగా అడుగుతాడు. యుద్ధం రాబోతున్న ఈ సమయంలో ఇలాంటి వాటికి సమయం లేదని వృషసేనుడు కర్ణుడితో చెబుతాడు. అయినా మనవడి మనసు గాయపడటం చూసిన కర్ణుడు వృషసేనుడిని సమాధానపరుస్తాడు.

యుద్ధంలో గెలుస్తామో, ఓడిపోతామో ఎవరూ చెప్పలేరు. మళ్ళీ కుటుంబంతో కలిసి ఉండే అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. అందుకని ఉన్న సమయంలోనే భార్య, పిల్లలతో ఉండాలని, వాళ్ళకి మంచి జ్ఞాపకాలు ఇవ్వాలని వృషసేనుడికి చెప్తాడు. కర్ణుడు ఇలా మాట్లాడటం వృషసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కొడుకుతో ఇలా మనసువిప్పి మాట్లాడిన తరువాత కర్ణుడు కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చాలా ప్రశాంతత అనుభవిస్తాడు.

ద్రోహం చేయలేని వ్యక్తి

కురుక్షేత్ర యుద్ధానికి ముందు తన పుట్టుక గురించి కర్ణుడికి తెలుస్తుంది. ఇదంతా  తన తల్లి అయిన కుంతీదేవి వివరిస్తుంది. పాండవులందరికి కర్ణుడు అగ్రజుడు కాబట్టి, పాండవుల వైపు వచ్చేస్తే కురు సామ్రాజ్యం మొత్తానికి అతనే చక్రవర్తి అవ్వవచ్చని తల్లి చెప్తుంది. అయితే ఆమె ఆలోచనను కర్ణుడు కాదంటాడు. కుంతి తనకు జన్మనిచ్చినా తనను పెంచలేదని, తనని ప్రేమతో పెంచిన వల్లే తన తల్లిదండ్రులని చెప్తాడు. ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు కుంతిని తల్లిగా ఒప్పుకోలేనని, పాండవులను సోదరులుగా స్వీకరించలేనని, తనను నమ్మిన స్నేహితుడికి ద్రోహం చేయలేనని చెప్తాడు.

మాట తప్పని మనిషి

ఒకసారి కుంతీదేవి కర్ణుడిని కలిసి తన ఐదుగురు పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుతుంది. అప్పుడు కర్ణుడు చిన్నతనంలో తనను వదిలేసినందుకు కుంతిని నిందిస్తాడు. అయినా సహాయం కోసం వచ్చినందుకు ఆమె కోరిక కాదనకుండా, అర్జునుడిని తప్ప ఆమె మిగతా నలుగురు కొడుకులను చంపనని ప్రమాణం చేస్తాడు. కర్ణుడు అర్జునుడు యుద్ధం చేసి అందులో ఒకరు మరణిస్తే, ఇంకొకరు మిగిలి ఉంటారు కాబట్టి కుంతీదేవి కోరుకున్న విధంగా ఆమెకు ఎప్పటికీ ఐదుగురు పిల్లలే మిగిలి ఉంటారని చెప్తాడు.

గొప్ప యోధుడు

కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడిది చాలా కీలకమయిన పాత్ర. భీష్ముడు తనను తక్కువగా చూశాడనే కోపంతో అతను ఉన్నంతవరకూ యుద్ధభూమిలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేస్తాడు. యుద్ధంలోకి వచ్చిన తరువాత, కర్ణుడు ఎందరో యోధులను ఎదుర్కున్నాడు. 

కర్ణుడికి ఇంద్రుడు ఒకసారి వాసవీ శక్తి అనే దివ్య ఆయుధాన్ని ప్రసాదిస్తాడు. అయితే ఈ ఆయుధాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలని, ఈ ఆయుధం ఖచ్చితంగా అవతలి వ్యక్తిని చంపుతుందని చెప్తాడు. కర్ణుడు తన బద్ధ శత్రువు అయిన అర్జునుడిపై ఉపయోగించడానికి ఈ ఆయుధాన్ని దాచి ఉంచుతాడు. కానీ, యుద్ధం పద్నాలుగవ రోజు రాత్రి, ఘటోత్కచుడిని చంపటానికి ఆ ఆయుధాన్ని వాడమని దుర్యోధనుడు కర్ణుడిని బలవంతపెడతాడు. దుర్యోధనుడి మాట కాదనలేక, కర్ణుడు ఆ ఆయుధం ఉపయోగించి ఘటోత్కచుడిని చంపేస్తాడు. ఆ విధంగా అర్జునుడిని చంపడానికి ఉంచుకున్న ఆయుధాన్ని పోగొట్టుకుంటాడు. 

యుద్ధం జరుగుతున్న పదమూడవ రోజు, ధర్మరాజుని బంధించడానికి ద్రోణుడు చక్రవ్యూహాన్ని ఏర్పరుస్తాడు. ఈ చక్రవ్యూహాన్ని ఎలా ఛేదించాలో కేవలం, కృష్ణుడికి, అర్జునుడికి మాత్రమే తెలుసు. అయితే, యుద్ధం పదమూడవ రోజున త్రిగర్త సేనలు అర్జునుడిని యుద్ధభూమిలో వేరే వైపుకు మళ్లిస్తారు. వేరే మార్గం లేక, బాలుడయిన అభిమన్యుడిని ఆ చక్రవ్యూహాన్ని ఛేదించడానికి వెళ్లాలని ధర్మరాజు అడుగుతాడు. 

అభిమన్యుడికి చక్రవ్యూహంలోకి వెళ్ళటం మాత్రమే తెలుసు, బయటకు రావటం తెలియదు. అభిమన్యుడిని ముందుకు వెళ్ళమని, వెనుకనే తాము అందరం వస్తామని చెప్పి అభిమన్యుడిని పంపిస్తారు. కానీ, జయద్రథుడు మిగతా పాండవులను అడ్డుకొని వారిని అభిమన్యుడి వెనుక వెళ్లనీయకుండా ఆపుతాడు. 

ఒంటిరివాడయిపోయిన అభిమన్యుడు ఎంతో ధైర్యంగా కౌరవులను అందరినీ ఎదుర్కొంటాడు. చాలాసేపు వీళ్లందరితో భీకరంగా పోరాడిన అభిమన్యుడిని చివరికి అందరూ కలిసి చంపేస్తారు. ఇందులో పాల్గొన్న యోధులయిన ద్రోణుడిని, కర్ణుడిని, భూరిశ్రవుడిని యుద్ధనీతికి వ్యతిరేకంగా ఒక బాలుడిని చుట్టుముట్టి చంపారని అందరూ నిందిస్తారు. ఈ విధంగా ఒక బాలుడిని అన్యాయంగా, చాటుగా ఉండి చంపాడని అపఖ్యాతి కర్ణుడు పొందాడు. 

ఇది కూడా చదవండి: Uncovering the Story of Hidimbi, Bheema’s Demon Wife

యుద్ధనీతిని కాపాడే వీరుడు

కొడుకయిన వృషసేనుడిని తన కళ్ళముందే అర్జునుడు చంపుతుంటే ఏమీ చెయ్యలేక ఉండిపోతాడు. దానికి కారణం ఇద్దరు మహా యోధుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చి అంతరాయం కలిగించడం యుద్ధనీతి కాదని అందుకే కర్ణుడు ఏమీ చెయ్యలేక ఉండిపోయాడని కూడా చెబుతారు.

శాపగ్రస్తుడు

ఇక కర్ణుడి మరణానికి ఎన్నో శాపాలు, కారణాలు ఉన్నాయి. 

మొదటిది భూదేవి శాపం

కర్ణుడు ఒకసారి రథంపై వెళ్తూ ఉండగా నెయ్యి ఒలికిపోయి ఏడుస్తున్న ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమెకు సహాయం చెయ్యడం కోసం కర్ణుడు నెయ్యి పడిపోయిన చోట మట్టిని చేతిలోకి తీసుకొని పిండుతాడు. అయితే అలా గట్టిగా పిండినప్పుడు భూదేవి తల్లి ఆ బాధ భరించలేక కోపంతో కర్ణుడిని శపిస్తుంది. యుద్ధ సమయంలో అతనికి సహాయం చెయ్యనని, అతనిని దుర్బలుడిగా చెయ్యటానికి ప్రయత్నిస్తానని చెప్తుంది. ఈ శాపం వల్లనే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలో కుంగిపోతుంది. దీనివల్లన అతను అర్జునుడితో యుద్ధం చెయ్యలేకపోతాడు.

రెండవది గురువు శాపం

ఒక రోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో విశ్రమిస్తున్నప్పుడు ఒక కీటకం కర్ణుడిని తొడని తొలుస్తుంది. అయినా కూడా, గురువుగారి నిద్రకు భంగం కలగకూడదని కర్ణుడు ఆ బాధ భరిస్తాడు. నిద్రలేచిన పరశురాముడు అంత నొప్పిని భరించినవాడు తప్పక క్షత్రియుడే అయి ఉంటాడని కోపంతో అతనిని శపిస్తాడు. యుద్ధ సమయంలో, అవసరమయినప్పుడు, దివ్యాస్త్రాలు ప్రయోగించే మంత్రాలు, వాటి జ్ఞానం అంతా మర్చిపోతాడని శపిస్తాడు. అర్జునుడితో యుద్ధంచేసే సమయంలో ఈ శాపం వలన కర్ణుడు ఎటువంటి దివ్యాస్త్రాలు ఉపయోగించలేకపోతాడు.

మూడవది ఒక బ్రాహ్మణుడి శాపం

ఒకసారి కర్ణుడు శబ్దభేది అస్త్రాన్ని సాధన చేస్తున్నప్పుడు, అడవిలో ఒక గోవును క్రూరమృగంగా భావించి దాని మీద అస్త్రం ప్రయోగించి చంపేస్తాడు. ఆ ఆవు యజమాని అయిన ఒక బ్రాహ్మణుడు ఎంతో బాధతో కర్ణుడిని శపిస్తాడు. యుద్ధ సమయంలో అతని ద్రుష్టి మరలి శత్రువు చేతిలో మరణిస్తాడని శపిస్తాడు. 

అర్జునుడిని చంపటానికి నిర్ణయించుకున్న కర్ణుడు తన రథాన్ని నడపడానికి శల్యుడిని పంపమని దుర్యోధనుడిని అడుగుతాడు. దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు శల్యుడు కర్ణుడి రథాన్ని నడుపుతాడు. అయితే, ఉన్నంతసేపూ కర్ణుడిని కించపరిచేలాగా మాట్లాడుతూ అతనిని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు. అతని మాటలవల్లన కర్ణుడు యుద్ధం మీద దృష్టి ఉంచలేకపోతాడు. అతని ఏకాగ్రత సడలుతుంది. అదే విధంగా, రథచక్రం భూమిలో కుంగినప్పుడు కూడా శల్యుడు సహాయం చెయ్యడు. ఈ విధంగా శల్యుడు కూడా కర్ణుడి మరణానికి కారణం అవుతాడు. భూమిలో కుంగిపోయిన రథచక్రాన్ని తీసే పనిలో ఉండగా, కృష్ణుడి ఆదేశానుసారం అర్జునుడు బాణం వేసి కర్ణుడిని చంపేస్తాడు. 

దాన కర్ణుడు

యుద్ధభూమిలో… చావు బతుకుల మద్య కొట్టుమిట్టాడుతూ ఉన్న సమయంలో… కర్ణుడి వద్దకి ఇంద్రుడు మారువేషంలో వస్తాడు. పుట్టుకతో వచ్చిన కవచకుండలాలను దానం అడుగుతాడు. సూర్యభగవానుడు ఒద్దని వారించినా కూడా, ఎవరయినా వచ్చి దానం అడిగితే కాదనలేనని చెప్పి… తన ప్రాణాలకి ముప్పు అని తెలిసి కూడా తన కవచకుండలాలను ఒలిచి ఇంద్రుడికి దానంగా ఇచ్చేస్తాడు  కర్ణుడు. ఇంద్రుడికే దానమిచ్చిన దాత కావటంచేత దాన కర్ణుడిగా కీర్తించబడతాడు.

దాన, వీర, శూర, కర్ణ

ఎన్నో ధర్మాలు తెలిసినవాడుగా, దానవీరుడిగా, పేరు పొందిన మహాయోధుడయిన కర్ణుడు తాను చేసే పనులు తప్పని తెలిసినా, అధర్మమని తెలిసినా స్నేహం కోసం, తాను స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉన్నాడు. 

చివరిమాట 

ఏదేమైనా కర్ణుడి జీవితం మనందరికీ ఎన్నో విషయాలలో ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యంగా ఇతరులకు సహాయం చెయ్యటంలో, స్నేహం విషయంలో, ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిత్వం విషయంలో కర్ణుడి జీవితం ఇప్పటికీ మనకి ఆదర్శమే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top