The Untold Story of Vrishasena in Mahabharat

The Untold Story of Vrishasena

మహాభారతం అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో పాల్గొన్న ఎందరో శక్తివంతమైన వీరుల గురించి మనం కధలు కధలుగా తెలుసుకున్నాము. అందులో కొన్ని పాత్రలు  బాగా పాపులర్ అయితే మరికొన్ని పాత్రలు గురించి ఎవ్వరికి ఎక్కువగా తెలియదు. అలాంటి కొన్ని ఆసక్తికరమైన పాత్రలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒకటి. అదే కర్ణుడి కొడుకయిన వృషసేనుడి గురించి. ఇంతకీ వృషసేనుడి గొప్పతనం ఏమిటో… ఎందుకతను ఓ ప్రత్యేకమైన వ్యక్తో… ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. 

వృషసేనుడి కుటుంబ వృక్షం

మహాభారత పురాణం ప్రకారం కర్ణుడికి వృశాలి మరియు సుప్రియ అని ఇద్దరు భార్యలు ఉండేవారు. కర్ణుడిలాగే, వృశాలి కూడా సూత వర్గానికి చెందినది. అంటే – రథసారథి వర్గానికి చెందినది. ఈమె దుర్యోధనుడి రథసారథి అయిన సత్యసేనుడి సోదరి. అంతే కాదు, కర్ణుడికి వృశాలి చిన్ననాటి స్నేహితురాలు కూడా. 

మొదటినుంచీ వృశాలి మంచి గుణవంతురాలు. అందువల్లే కర్ణుడు పెద్దయ్యాక, అతని తండ్రి అధిరథుడు వృశాలే  కర్ణుడికి అన్ని విధాలుగా తగిన భార్య అని తలచి… కోరి కర్ణుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. పురాణాల ప్రకారం వృశాలి చాలా తెలివైనది, ఇంకా ఆమెను గొప్ప పతివ్రతగా కూడా చూపించారు. 

దుర్యోధనుడు తన మిత్రుడైన కర్ణుడిని అంగ రాజ్యానికి రాజుగా ప్రకటించినప్పుడు వృశాలి చాలా బాధపడింది. ఎందుకంటే, వృశాలికి తన భర్త కర్ణుడు రాజు అవడం ఇష్టం లేదు. అతనెప్పుడూ  ఎవరి కిందా పని చేయకుండా, ఎవరికీ రుణపడి ఉండకుండా ఉండాలని వృశాలి కోరుకునేది. కానీ చివరికి కర్ణుడు దుర్యోధనుడికి జీవితాంతం రుణపడి ఉండటం తనకి ఎంతో అసంతృప్తిని మిగిల్చింది. కురుక్షేత్ర యుద్ధంలో తన భర్తను, కుమారులను ఒక్కసారిగా కోల్పోయిన తరువాత, వృశాలి బాధా హృదయంతో తన భర్త చితిపైనే సతీ సహగమనం చేసి జీవితానని  ముగించుకుంది అని చెబుతారు. 

కర్ణుడి రెండవ భార్య పేరు సుప్రియ. ఈమె దుర్యోధనుని భార్య అయిన భానుమతికి మంచి స్నేహితురాలు. తన భార్య కోరిక మేరకు సుప్రియని వివాహమాడవలసిందిగా స్నేహితుడిని కోరతాడు దుర్యోధనుడు. అయితే, ఈమె గురించి పురాణాలలో అంతగా ప్రస్తావించలేదు. 

కర్ణుడికి మొత్తం తొమ్మిది మంది సంతానం. వారిలో తన మొదటి భార్య అయిన వృశాలి కి ఏడుగురు కుమారులు. రెండవ భార్య సుప్రియకి ఇద్దరు కుమారులు కలిగారు. అందులో ఈ వృషసేనుడు మొదటివాడు, అందరికన్నా పెద్దవాడు. ఇతని తరువాత కర్ణుడికి సుధామ, చిత్రసేన, సత్యసేన, సుషేణ, శత్రుంజయ, ద్విపథ, బాణసేన (సుశర్మ), వృషకేతు అని ఎనిమిది మంది కొడుకులు ఉన్నారు. వృషకేతు తప్ప మిగిలిన వారు అందరూ కూడా పాండవుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి కర్ణుడి తొమ్మిది మంది కొడుకులలో వృషకేతు ఒక్కడే ప్రాణాలతో మిగిలాడు. పాండవులు అతనిని తమతో పాటుగా తీసుకెళ్లారు. అర్జునుడికి వృషకేతు మీద అమితమైన వాత్సల్యం ఉంది, అతనిని తన సొంత కొడుకులాగా  చూసుకునేవాడు. శ్రీ కృష్ణుడు కూడా వృషకేతువు పట్ల ఎంతో ప్రేమ చూపించాడు. 

మహాభారతం ప్రకారం బ్రహ్మాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వరుణాస్త్రం వంటి దివ్యాస్త్రాలు ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఈ భూమిపై మిగిలిన చివరి మానవుడు వృషకేతు మాత్రమే. ఈ జ్ఞానాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని శ్రీకృష్ణుడు ఆదేశిస్తాడు. అర్జునుడికి బబ్రువాహనుడితో జరిగిన యుద్ధంలో బబ్రువాహనుడు వృషకేతుని చంపేస్తాడు. వృషకేతుని మరణంతో ఆ రహస్యాలు ఎవరికీ తెలియకుండానే పూర్తిగా ముగిసిపోయాయి అని చెబుతారు.

ఇది కూడా చదవండి: The Tragic Story of Abhimanyu: How He Got Caught in Padmavyuham

వృషసేనుడు మరియు కర్ణుని మధ్య ఉన్న అనుబంధం

ఒక పురాణ గ్రంథంలో కర్ణుడికి వృషసేనుడికి ఉన్న అనుబంధం గురించి ఒక సంఘఠన కూడా చెప్పారు. వీరిని అర్జునుడికి అభిమన్యుడికి ఉన్న అనుబంధంతో పోల్చి చెప్పారు. ఒకసారి కర్ణుడు అర్జునుడికి అభిమన్యుడితో ఉన్న బంధం చూసే సందర్భం వస్తుంది. ఎప్పుడూ ఎవరినీ పట్టించుకోకుండా, దాదాపుగా తన జీవితమంతా శ్రీకృష్ణుడికి నీడగా ఉండిపోయాడు అర్జునుడు. కానీ, అభిమన్యుడి విషయంలో మాత్రం చాలా అనుబంధంతో ఉండటం చూసి కర్ణుడు ఆశ్చర్యపోతాడు. 

మన భాషలో చెప్పాలంటే అర్జునుడు అభిమన్యుడి విషయంలో చాలా ఎటాచ్మెంట్ కలిగి ఉన్నాడని  తెలుసుకుంటాడు. అలాగే అభిమన్యుడు కూడా తన తండ్రితోనే మంచి రిలేషన్ షిప్ ఏర్పరుచుకున్నాడు. తండ్రితో కొంత సమయం గడపాలని అభిమన్యుడు ఎంతలా ఆరాటపడే వాడో స్వయంగా చూసి తెలుసుకుంటాడు. అప్పుడు వెంటనే కర్ణునికి తన పెద్ద కుమారుడు అయిన వృషసేనుడు గుర్తుకు వస్తాడు. ఇప్పటిదాకా కొడుకు విషయంలో తానేమి తప్పు చేశాడో తెలుసుకున్నాడు. మనసులో ఏదో తెలియని అశాంతి, ఆందోళన అనుభవిస్తాడు. 

వెంటనే తన ప్రియమైన కుమారుడు, ఇంకా యువరాజు అయిన వృషసేనుడిని కలవాలని, తనని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవాలని కర్ణుడు ఆరాటపడతాడు. తనకు మొదటగా తండ్రి అయ్యే అవకాశాన్ని, ఆనందాన్ని ఇచ్చినవాడు  వృషసేనుడు. ఇంకా తన జీవితాన్ని పరిపూర్ణం చేసిన వ్యక్తి కూడా వృషసేనుడే. అలాంటి తన ప్రియ కుమారుడిని ఆలింగనం చేసుకోవాలని అతని దగ్గరకు వెళతాడు. 

కర్ణుడికి వృషసేనుడు కాకుండా ఇంకా ఎనిమిది మంది సంతానం ఉన్నారు కదా… కానీ వృషసేనుడి మీద మాత్రమే ఇంత అనుబంధం ఉండటానికి కారణం… అతను పుట్టినప్పుడు కర్ణుడు అనుభవించిన ఆనందం, మిగతావారు పుట్టినప్పుడు ఎప్పుడూ అనిపించలేదు. తాను ఎంతగానో ప్రేమించే తన భార్య వృశాలి ఎంతో అందంగా మరియు పరాక్రమాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాంటి తన ప్రియమయిన భార్య పోలికలతో ఉండటం, అలాగే అంతే అందంతో, పరాక్రమంతో ఉన్న కుమారుడు కలగటం వల్ల కర్ణుడికి మిగతా అందరికంటే వృషసేనుడు ప్రియమయిన వాడు అనటంలో ఆశ్చర్యం లేదు.

మరొక్క సందర్భంలో కురుక్షేత్ర యుద్ధం మొదలు అవ్వటానికి కొన్ని రోజుల ముందు ఒకసారి కర్ణుడు వృషసేనుడి మందిరానికి వస్తాడు. అప్పుడు అక్కడ వృషసేనుడు ఆయుధాలను జాగ్రత్తగా పరీక్షించటం చూస్తాడు. అలాగే, కొంచెం దూరంలో వృషసేనుడి 5 ఏళ్ల కుమారుడుని కూడా చూస్తాడు. ఆ పిల్లవాడు తన తండ్రి దగ్గరకు వెళ్ళటానికి భయపడి దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోతాడు.

కర్ణుడు అక్కడకు వచ్చిన వెంటనే వృషసేనుడి కుమారుడు తాత దగ్గరకు పరిగెత్తుకు వచ్చి వృషసేనుడి మీద ఫిర్యాదు చేస్తాడు. తనతో చాలా రోజులుగా ఆడుకోవటం లేదని, తనతో కొద్ది సమయం కూడా  గడపటం లేదని, తన దగ్గర పడుకోవటం లేదని, దగ్గరకు వస్తే అరుస్తున్నాడని వృషసేనుడి గురించి కర్ణుడికి ముద్దు ముద్దు మాటలతో చాలా విషయాలు చెప్తాడు. అప్పుడు ఆ చిన్న పిల్లవాడి కళ్ళలో నీళ్లు చూసిన కర్ణుడు చలించిపోయి… వెంటనే తన తండ్రిని ఆడుకోవటానికి పంపిస్తానని చెప్పి ఆ పిల్లవాడిని ఒప్పిస్తాడు. ఒకప్పుడు తన ప్రియమయిన కుమారుడితో కొద్ది సమయం కూడా గడపలేక ఎలా అయితే తాను బాధ పడ్డాడో… అలా ఇప్పుడు తన కొడుకు కూడా అలానే బాధ పడకూడదని నిర్ణయించుకుంటాడు. 

కర్ణుడు రావటం చూసి వృషసేనుడు తాను చేస్తున్న పని ఆపేసి లేచి నిలబడి తన తండ్రి పాదాలకు నమస్కారం చేస్తాడు. అప్పుడు కర్ణుడు వృషసేనుడిని కొడుకుతో ఎందుకు సమయం గడపట్లేదని కొంచెం గట్టిగా అడుగుతాడు. యుద్ధం రాబోతున్న ఈ సమయంలో ఇలాంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధపెట్టే సమయం లేదని వృషసేనుడు కర్ణుడితో చెబుతాడు. అయినా మనవడి మనసు గాయపడటం చూసిన కర్ణుడు వృషసేనుడిని సమాధానపరుస్తాడు. యుద్ధంలో పరిస్థితులు, ఫలితాలు  ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేరు. మళ్ళీ తిరిగి కుటుంబంతో గడిపే అవకాశం వస్తుందో రాదో కూడా తెలియదు. అందుకని ఉన్న సమయంలోనే భార్య, పిల్లలతో సమయాన్ని గడపాలని వాళ్ళకి మంచి జ్ఞాపకాలు అందివ్వాలని వృషసేనుడికి కర్ణుడు జీవిత సత్యాన్ని బోధిస్తాడు. కర్ణుడు ఇలా భావోద్వేగంతో కుటుంబ సంబంధాల గురించి మాట్లాడటం వృషసేనుడికి చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఈ విధంగా వృషసేనుడికి వివరించి చెప్పి అతనిని కొడుకుతో సమయం గడపమని చెప్పి పంపిస్తాడు. కొడుకుతో ఇలా వివరంగా మాట్లాడిన తరువాత కర్ణుడు కూడా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా చాలా ప్రశాంతతని అనుభవిస్తాడు. మన పురాణాలలో వీరి ఇద్దరి అనుబంధం గురించి ఆధారాలు ఎక్కువగా కనిపించవు కానీ వీరి అనుబంధం మాత్రం  చాలా అందమయినది, ఇంకా గొప్పది కూడా.

కురుక్షేత్ర యుద్ధంలో వృషసేనుడు

కురుక్షేత్ర యుద్ధం మొదలయినప్పుడు కర్ణుడు మొదట ఆ యుద్ధంలో పాల్గొనడు. కర్ణుడికి భీష్ముడితో ఉన్న గొడవ కారణంగా భీష్ముడు యుద్ధరంగంలో ఉన్నంతవరకు తాను యుద్దానికి రానని కర్ణుడు పట్టుబడతాడు. ఆ విధంగా, కురుక్షేత్ర యుద్ధం జరిగిన మొదటి 10 రోజులు కర్ణుడు యుద్ధం చెయ్యడు. భీష్ముడు నేలకొరిగిన తరువాత మాత్రమే కర్ణుడు అతని కొడుకులతో కలిసి యుద్ధంలో పాల్గొనటానికి వస్తాడు. కర్ణుడి కొడుకయిన వృషసేనుడు కూడా తండ్రితో పాటుగా వచ్చి పాండవుల మీద తన ప్రతాపం చూపిస్తాడు. 

ఒకేసారి 1000 బాణాలు వెయ్యగల గొప్ప వీరుడు ఈ వృషసేనుడు. ఇతని పరాక్రమం వల్లనే ఇతనిని భీష్ముడు మహారథిగా గుర్తించాడు. వృషసేనుడు తన పోరాట పటిమతో తాను మహారథులలో లెక్కించదగిన గొప్ప యోధుడని కూడా నిరూపించుకున్నాడు.

యుద్ధం 11వ రోజు, నకులుడి కుమారుడయిన శాతానిక ఇంకా వృషసేనుడు ఒకరికొకరు ఎదురుపడి భీకరంగా యుద్ధం చేస్తారు. ఆ పోరాటంలో వృషసేనుడి ముందు శాతానిక నిలువలేక ఓడిపోతాడు. ఆ తరువాత వృషసేనుడు ఉపపాండవులు అందరినీ కూడా ఎదుర్కొని ఓడిస్తాడు. వాళ్ళ తరువాత, వృషసేనుడు పాండవులలో ఆఖరివాడయిన సహదేవుడితో భీకరమయిన యుద్ధం చేసి సహదేవుడి ధనుస్సు విరగ్గొడతాడు. వృషసేనుడితో యుద్ధం చెయ్యలేక సహదేవుడు నీరసించి పడిపోతాడు. అప్పుడు సాత్యకి వచ్చి సహదేవుడిని వృషసేనుడి నుండి రక్షిస్తాడు. 

యుద్ధం 12వ రోజు, వృషసేనుడు పాండవుల వైపు ఉండి యుద్ధం చేస్తున్న మత్స్య సేన మీద తన ప్రతాపం చూపించాడు. విరాట రాజుని దారుణంగా గాయపరిచి, మత్స్య సేన భయంతో పారిపోయేలాగా చేశాడు. విరాట రాజుని కాపాడటానికి వెంటనే అభిమన్యుడు వచ్చి వృషసేనుడితో యుద్ధం చేస్తాడు. వీళ్ళు ఇద్దరికీ భీకర పోరాటం జరుగుతుంది. వృషసేనుడు తన యుద్ధ నైపుణ్యంతో అభిమన్యుడిని ధైర్యంగా ఎదుర్కొంటాడు. వృషసేనుడు వేసిన బాణాలు అభిమన్యుడికి చాతీలో, ఇంకా తోడలో దిగబడతాయి. అయినా కూడా అభిమన్యుడు ధైర్యంగా వృషసేనుడిని ఎదుర్కొంటాడు. చివరికి ఈ పోరాటంలో అభిమన్యుడు వృషసేనుడి ధనుస్సును విరగ్గొట్టి అతనిని ఓడిస్తాడు. అభిమన్యుడితో యుద్ధం చెయ్యలేక వృషసేనుడు పారిపోతాడు. వృషసేనుడు సందేహం లేకుండా మంచి యోధుడు. అభిమన్యుడితో సమానంగా అనేక మంది యోధులను సులభంగా ఎదుర్కోగలడు. కానీ, అభిమన్యుడి వీరత్వంతో పోల్చి చూస్తే వృషసేనుడు తక్కువగానే కనిపిస్తాడు.

యుద్ధం 14వ రోజు, వృషసేనుడు పాంచాల దేశానికి రాజు అయిన ద్రుపద మహారాజుతో యుద్ధం చేసి ఓడిస్తాడు. ద్రుపదుడు ఓడిపోయిన తరువాత, అతని కొడుకైన దృష్టద్యుమ్నుడు పాండవ సైన్యానికి నాయకత్వం వహిస్తూ, వృషసేనుడితో యుద్ధం చేస్తాడు. వృషసేనుడు ఇతనిని కూడా ఓడించి అతనితో పాటుగా వచ్చిన పాండవ సైన్యం పారిపోయేలా చేస్తాడు. అతని పరాక్రమం ముందు వీళ్ళు నిలబడలేక ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోతారు. 

యుద్ధం 17వ రోజు, వృషసేనుడు మళ్ళీ నకులుడితో తలపడతాడు. వృషసేనుడి యుద్ధ నైపుణ్యానికి నకులుడు భయపడిపోతాడు. వృషసేనుడు తన బాణాలతో నకులుడి రథాన్ని నాశనం చేస్తాడు. అప్పుడు నకులుడు వెంటనే పక్కనే ఉన్న భీముడి రథం మీదకు ఎక్కి, భీముడితో కలిసి, మళ్ళీ వృషసేనుడితో యుద్ధం చెయ్యటం మొదలు పెడతాడు. వృషసేనుడు తన బాణాలతో భీముడిని, నకులుడిని ఇద్దరినీ ఒకేసారి ఎదుర్కొని ఓడిస్తాడు. అతని పరాక్రమం ముందు వాళ్ళు ఇద్దరూ ఏమీ చెయ్యలేకపోతారు. వృషసేనుడు వేసిన బాణాలకి భీముడి ధనుస్సు విరిగిపోతుంది. ఇంకా ఆ బాణాలు భీముడి ఛాతీలో కూడా బాగా గుచ్చుకుంటాయి. అప్పుడు భీముడు వెంటనే అర్జునుడిని పిలిచి తమని కాపాడమని, వృషసేనుడిని ఎదుర్కొని అతనిని ఓడించమని అడుగుతాడు. 

అర్జునుడు వెంటనే వృషసేనుడితో యుద్ధం చెయ్యటానికి సిద్ధ పడతాడు. తాను లేని సమయంలో, ఒంటరివాడయిన, పిన్న వయస్కుడయిన, నిరాయుధుడయిన  అభిమన్యుడిని అందరూ చుట్టుముట్టి చంపినందుకు ఇదే ప్రతీకారం అని అంటాడు. వృషసేనుడు ఏమాత్రం చలించకుండా అర్జునుడి మీద భీకరంగా బాణాలు వేస్తాడు. వాటిలో పది పదునయిన బాణాలు అర్జునుడి బాహువులను లోతుగా గుచ్చాయి. అంతేకాకుండా, రథసారథి అయిన కృష్ణుడి మీద కూడా బాణాలు వేస్తాడు. శ్రీకృష్ణుని చేతులపై కూడా కొన్ని బాణాలు గుచ్చుకుంటాయి. శ్రీకృష్ణుడికి బాణాలు తగలగానే అర్జునుడు చాలా కోపోద్రిక్తుడవుతాడు. పాండవులు ఎవరు కూడా శ్రీకృష్ణుడికి ఇలా జరగటం ఒప్పుకోరు. అర్జునుడు కోపావేశంతో అక్కడే ఉన్న కర్ణుడితో చేతనయితే నీ కొడుకుని నా నుండి రక్షించుకో అని సవాలు చేసి వృషసేనుడి మీద వందల బాణాలు ప్రయోగిస్తాడు.

అర్జునుడు వెంటనే వృషసేనుడితో చాలా సేపు భీకరమయిన యుద్ధం చేసి, చివరికి వృషసేనుడిని చంపేస్తాడు. తన కళ్ళముందే అర్జునుడి చేతిలో మరణిస్తున్న తన కొడుకు వృషసేనుడిని చూసి కర్ణుడు ఏమీ చెయ్యలేక ఉండిపోతాడు. అర్జునుడు వృషసేనుడిని చంపుతున్నప్పుడు కర్ణుడు తన కొడుకుని కాపాడటానికి ఏమి చెయ్యలేదు అనే దానికి ఇంకొక అర్ధం కూడా చెబుతారు. ఇద్దరు మహా యోధుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో వచ్చి అంతరాయం కలిగించడం యుద్ధనీతి కాదని అందుకే కర్ణుడు ఏమీ చెయ్యలేక ఉండిపోయాడని కూడా చెబుతారు.

కొన్ని పురాణాలలో ఉన్న ఆధారాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధ సమయంలో కర్ణుడి వయస్సు 107 సంవత్సరాలు. దీనితో పోల్చి చూస్తే మరణించే సమయానికి వృషసేనుడి వయస్సు సుమారు 50-60 సంవత్సరాల మద్య ఉండి ఉండవచ్చని అనుకోవచ్చు. ఇక్కడ వెంటనే మీకు మైండ్ లో వచ్చిన ఆలోచన నేను చెప్పిన వయసు గురించే కదూ! 

నేటి ఆధునిక మానవుల యుగాలను, వారి వయస్సును మహాభారతం వంటి పురాణాలలోని పాత్రలతో పోల్చకూడదు. పురాణాలలో ఎక్కడా, వాస్తవానికి సంఖ్యల ద్వారా యుగాలను పేర్కొనలేదు. అందుకని మనం చూస్తున్న ఈ వయసుకి సంబందించిన ఆధారాలు అన్నీ ఊహించి చెప్పినవి మాత్రమే! 

కురుక్షేత్ర యుద్ధ సమయానికి భీష్ముడి వయస్సు 185+ అంటారు, అలాగే కర్ణుడి వయస్సు 107 సంవత్సరాలు అని అంచనా వేయబడింది. కలియుగంలో కంటే ద్వాపర యుగం వాళ్లకు కనీసం 2 నుండి 3 రెట్లు ఎక్కువ వయస్సు ఉందని చెబుతారు. త్రేతాయుగం, అంటే రామాయణ కాలంలోని మానవులు ద్వాపర యుగం వాళ్లకన్నా కూడా ఎక్కువ కాలం జీవించారు అని చెబుతారు. ఇక సత్యయుగానికి చెందిన వారు అయితే దాదాపు కొన్ని వందల సంవత్సరాలు బతికి ఉన్నారని నమ్ముతారు. 

ఈ విధంగా గొప్ప యోధుడు అయిన వృషసేనుడు పాండవుల సేనలను, యోధులను ధైర్యంగా ఎదిరించి, ఓడించి, చివరకు అర్జునుడి చేతిలో మరణిస్తాడు. అయితే కొన్ని పురాణాలలో మాత్రం వృషసేనుడిని ఒక పిరికివాడిగా చూపించారు. అతనిని తన తండ్రిలాగే యుద్ధ సమయంలో ఎదుటివారి పోరాట పటిమను ఎదుర్కొనలేక పారిపోయే అలవాటు ఉన్నవాడు అని చెప్పారు. కురుక్షేత్ర యుద్ధంలో వృషసేనుడు సాత్యకి, అభిమన్యుడు, యుధిష్ఠిరుడు, అర్జునుడు ఇంకా అనేక మంది పాండవ యోధుల చేతిలో ఓడిపోయి, ఇతరుల చేత రక్షించబడ్డాడు అని కూడా చెబుతారు. 

ఇది కూడా చదవండి: The Untold Story of Karna’s Life and Struggles

ముగింపు

వృషసేనుడి గురించి మహాభారతంలో అంతగా తెలియని ఓ ఫాసినేటింగ్ స్టోరీ. ఈ ఇతిహాసంలోని గొప్ప యోధులలో ఒకరి కుమారుడైనప్పటికీ, వృషసేనుడి కథ ధైర్యం, విధేయత మరియు చివరికి విషాదంతో ముగించబడింది. ఇతని కథ మహాభారతంలో ఉన్న చిక్కులని, నైపుణ్యాలని, అనుభవాలని హైలైట్ చేస్తుంది.  

చివరి మాట  

వృషసేనుడి కథ మహాభారతంలోని చాలా చిన్న పాత్రలు కూడా వారి స్వంత ప్రత్యేక కథలు మరియు అనుభవాలను కలిగి ఉన్నాయని గుర్తు చేస్తుంది. ఈ కథలను అన్వేషించడం ద్వారా, మనం ఇతిహాసం మరియు దాని ఇతివృత్తాల గురించి లోతైన అవగాహన పొందవచ్చు మరియు మహాభారతం యొక్క గొప్పతనాన్ని అభినందించవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top