ఇంటీరియర్ డిజైన్ కోసం కోట్లు ఖర్చుపెడుతున్న రోజులివి. తమ ఇల్లు అందంగా కనిపించడం కోసం రకరకాల వస్తువులతో అలంకరించుకుంటారు చాలా మంది. ఈ క్రమంలోనే, దేవుని బొమ్మలు, అందమైన పువ్వులు, ఆహ్లాదమైన ప్రకృతి ఇలా ఎవరి ఇష్టానికి తగ్గట్టు వారు తమ ఇంటిని అందంగా తీర్చి దిద్దుకుంటారు. ఇక కాస్త డబ్బున్న వాళ్లయితే ఇంటీరియర్ డిజైనర్లని పిలిపించి… తమ ఇంటిని స్పెషల్ గా డెకరేట్ చేయించుకుంటారు.
ఇదంతా ఓకే! కానీ, ఇంట్లో ఎలాంటి వస్తువులని ఉంచాలి? ఎలాంటి వస్తువులని ఉంచకూడదు? అనేది చాలా మందికి అంతగా అవగాహన ఉండదు. అవగాహన మాత్రమే కాదు, ఈ విషయాన్ని చాలామంది లైట్ తీసుకుంటారు కూడా. నిజానికి ఈ విషయం పైనే ఎక్కువ కేర్ తీసుకోవాలని చెప్తున్నారు వాస్తు నిపుణులు. కనిపించిన ప్రతి వస్తువునీ ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం వల్ల… లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నట్టే అంటున్నారు. అంతేకాదు, అలాంటి వస్తువుల వల్ల రకరకాల కుటుంబ సమస్యలు తలెత్తుతాయని చెప్తున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏవి? అలాంటి వస్తువులని ఉంచితే తలెత్తే సమస్యలు ఏమిటి? అనేది ఇప్పుడు తెల్సుకుందాం.
- ఇంట్లో విరిగిపోయిన, పగిలిపోయిన బొమ్మలు ఉండకూడదు. కొంత మంది తమకి ఎవరైనా గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు వాళ్ళ మీద అభిమానంతో అవి పాడైపోయినా… వాటిని పడేయడానికి ఇష్టపడరు. కానీ, అలాంటి వస్తువులని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మానసిక అశాంతి ఏర్పడుతుంది. సమస్యలు రెట్టింపవుతాయి.
- లీకవుతున్న నల్లాలు ఇంట్లో ఎక్కడా ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో ఆర్ధిక సమస్యలు పెరుగుతాయి. నల్లాలో వాటర్ ఎలా అయితే లీకవుతుందో… అలానే సంపాదించిన ధనం కూడా వెళ్ళిపోతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించని నష్టాలు సంభవిస్తాయి.
- కొంతమందైతే క్యూట్ గా ఉంటారని చిన్న పిల్లల వాల్ పేపర్స్ ని ఇంట్లో గోడలకి పెట్టుకుంటారు. నవ్వుతున్న పిల్లల ఫోటోలైతే పర్లేదు కానీ, ఏడుస్తున్న పిల్లల ఫోటోలు మాత్రం పెట్టకూడదు. దీనివల్ల ఇంట్లో ఉండే లేడీస్ కి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి.
- ఇంకొంతమంది సముద్రాలు, పడవలు, ఓడలు వంటి ఫోటోలు కూడా ఇంట్లో గోడలకి తగిలిస్తారు. ఇంకా చెప్పాలంటే, టైటానిక్ మూవీపైన ఉన్న ఇష్టంతో మునిగిపోతున్న షిప్ ఫోటోస్ కూడా పెట్టుకుంటారు. కాని మునిగిపోయే పడవలు ఉండే ఫొటోస్ ఇంట్లో ఉండటం ఎప్పటికీ మంచిదికాదు. ఇలాంటి బొమ్మలు ఇంట్లో ఉంటే కుటుంబం సమస్యల్లో చిక్కుకుంటుంది.
- ఇంట్లో ఆగిపోయిన, పగిలిపోయిన, పాడైపోయిన వాల్ క్లాక్స్ ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే వెంటనే వాటిని తీసివేయండి. లేదంటే, రిపేర్ చేయించడమో లేదా బ్యాటరీలు మార్చడమో వంటివి చేయండి. రన్నింగ్ లో లేని ఏ గడియారం ఇంట్లో ఉండకూడదు. అలా ఉంచింటే జీవితంలో ఎదుగుదల ఉండదు.
- పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కుడా పాతవి ఉంటే వాటిని తీసేయాలి. చాలాకాలంగా పూజించిన తర్వాత దేవుడి రూపం కూడా కనిపించనంతగా మారిపోతే వాటికి పూజలు చేయకూడదు. అలాగే, పగిలిపోయిన పటాలు కానీ, విరిగిపోయిన విగ్రహాలు కానీ పూజ గదిలో ఉంచకూడదు. అలాంటి వాటిని దగ్గరలో ఉన్న ఆలయంలో ఉంచటమో… లేక పారే నదిలో వేయటమో… చేయాలి.
- మరికొంతమంది కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి క్రూరమృగాల బొమ్మలు, యుద్ద సన్నివేశాల ఫోటోలు వంటివి కూడా ఇంట్లో పెడుతుంటారు. వీటివల్ల ఇంట్లో అశాంతి తలెత్తుతుంది. నెగిటివ్ ఎనర్జీ పాసవుతుంది.
అందుకే, పైన పేర్కొన్న ఈ వస్తువులలో ఏ ఒక్కదాన్ని ఇంట్లో ఉంచుకోకండి. ఒకవేళ ఇప్పటికే ఉండి ఉంటే వెంటనే తీసేయండి.