సాదారణంగా ఏ ఆలయంలోనైనా భక్తులకి ప్రసాదంగా తినే పదార్ధాలని మాత్రమే ఇస్తారు. కానీ, ఒక్కచోట మాత్రం బంగారు, వెండి నాణేలని ప్రసాదంగా ఇస్తారు. ఇదేదో సరదాకి చెప్తున్న మాట కాదు, ఆ ఆలయంలో మొదటినుంచీ వస్తున్న ఆచారమిది. ఇంతకీ ఈ ఆలయం ఉన్నది మరెక్కడో కాదు, మన ఇండియాలోనే.
వివరాల్లోకి వెళితే, మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ లో మహాలక్ష్మి ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయం ఏడాది పొడవునా భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక అక్కడికి వచ్చే భక్తులైతే మహాలక్ష్మి అమ్మవారి పాదాల చెంత నగలు, డబ్బు, బంగారం, వెండి వంటివి సమర్పించుకుంటారు.
దీపావళికి ముందు భక్తులు ఇలా ఆభరణాలు, డబ్బు సమర్పిస్తే… దీపావళి తర్వాత అమ్మవారు ఆ సొమ్ముని డబల్ చేసి వారికి ఇస్తుందని వారి నమ్మకం. అందుకే, ఈ ఆలయానికి నోట్ల కట్టలు, వజ్ర వైడూర్యాలు, బంగారం, వెండి వంటివి తీసుకొని భక్తులు వస్తుంటారు. ఇలా అమ్మవారికి డబ్బు, ఆభరణాలు సమర్పించే దేశంలోని ఏకైక ఆలయం ఇదే! అందుకే ఈ ఆలయాన్ని ‘కుబేరుని నిధి’ అని పిలుస్తారు.
ధన్‌తేరస్ నుండి దీపావళి వరకు ఈ ఐదు రోజుల పాటు మహాలక్ష్మి అమ్మవారికి ఏమి సమర్పించినా… అది రెట్టింపు అవుతుందని భక్తుల నమ్మకం. అందుకే భక్తులు తమ శక్తి కొద్దీ బంగారం, వెండి, నగదుతో అమ్మవారిని సేవించుకుంటారు. ఈ సమయంలో, ఆలయాన్ని పూలతో కాకుండా భక్తులు సమర్పించే బంగారం, వెండి, డబ్బు, ఆభరణాలతో అలంకరిస్తారు.
ఈ క్రమంలో ఆలయానికి వచ్చిన భక్తులెవ్వరినీ పూజారులు ఒట్టి చేతులతో పంపరు. వారికి ప్రసాద రూపంలో డబ్బు, బంగారం, లేదా వెండి ఇలా ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు. ఇలా చేయడం వల్ల సంవత్సరం పొడవునా తమ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని వీరి విశ్వాసం.