కొందరు కురుక్షేత్రంలో పాల్గొనకపోయినప్పటికీ మహాభారత ఇతిహాసంలో వారికి ఎంతో ప్రముఖమయిన స్థానం ఉంది. అలాంటి వారిలో సంజయుడు, విదురుడు ముఖ్యులు.. ఇక ఈ రోజు ఈ ఆర్టికల్ లో మనం విదురుడి గురించి వివరంగా తెలుసుకుందాము.
విదురుడిని క్షత్రి అని కూడా పిలుస్తారు. ఇతను హిందూ ఇతిహాసం అయిన మహాభారతంలో ఒక కీలక పాత్ర పోషించాడు. ఇతను కురు రాజ్యానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఒక మంత్రిగానే కాకుండా ఇతను కౌరవులకు, పాండవులు మామ కూడా అవుతాడు.
విదురుడి పుట్టుక వెనుక కథ
విదురుడి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే మనం మాండవ్య మహాముని గురించి తెలుసుకోవాలి.
మహాభారత ఇతిహాసం ప్రకారం మాండవ్యుడు అనే మహాముని ఒకసారి తన ఆశ్రమం ముందు నిలబడి చేతులు పైకెత్తి అనేక సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నాడు. ఆలా తపస్సు చేస్తున్నప్పుడు ఒక రోజు కొంత మంది దొంగలు ఆ రాజ్య కోశాగారంలోని ధనం దొంగిలించి పారిపోతూ మాండవ్య ముని ఆశ్రమం వైపు వస్తారు. రాజభటులు తమను వెంబడిస్తున్నారని గమనించిన దొంగలు ఏమి చెయ్యాలో తెలియక దొరికిపోతామేమో అనే భయంతో దోచుకున్న సొత్తును మాండవ్య ముని ఆశ్రమంలో వదిలి పారిపోతారు.
రాజభటులు అక్కడికి వచ్చి ఆశ్రమంలో ఉన్న సొత్తును చూసి ఈ ముని కూడా ఆ దొంగల సహచరుడు అని అనుకొని మాండవ్య మునిని బంధిస్తారు. అతనిని దొంగగా అనుకొని ప్రశ్నించినప్పుడు తనపై ఆరోపణలు చేసిన వారితో మాట్లాడేందుకు మాండవ్యుడు నిరాకరిస్తాడు. మరికొంత సేపటికి పారిపోయిన దొంగలు కూడా పట్టుబడతారు. రాజభటులు అందరినీ కలిపి రాజు ముందు హాజరు పరుస్తారు.
అందరిని దొంగలుగా గుర్తించి రాజ్య కోశాగారంలోని దొంగతనం చేసిన నేరానికి వారందరికీ మరణశిక్ష విధిస్తారు. దొంగలను, ఇంకా మాండవ్య మునిని త్రిశూలం కొనపైన నిలబెట్టి మరణించేలాగా ఏర్పాటు చేస్తారు. దొంగలు అందరూ మరణిస్తారు కానీ మాండవ్యుడు మాత్రం సజీవంగా ఉంటాడు.
మాండవ్యుడిని పరమశివుడు అనుగ్రహించి అతనికి ఆయురారోగ్యాలు ప్రసాదిస్తాడు. ఇంకా ఇలా మాండవ్య మునికి శిక్ష విధించారని తెలుసుకొని ఎందరో గొప్ప మునులు, మహా ఋషులు అతని క్షేమం గురించి రాజ్యానికి వచ్చి విచారణ చేస్తారు. ఈ విషయం తెలుసున్న రాజు తాను తప్పు చేసానని గ్రహించి మాండవ్య మునిని క్షమాపణలు కోరతాడు. అతని శరీరానికి గుచ్చిన త్రిశూలాన్ని తియ్యటానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ అతని శరీరంలో గుచ్చుకున్న త్రిశూలం కొనని తీయలేకపోతారు.
ఇక వేరే దారి లేక ఆ కొనని అతని శరీరంలోనే ఉంచి మిగతా త్రిశూలాన్ని కత్తిరించి వేరు చేస్తారు. ఆ త్రిశూలం కొన మాండవ్య ముని శరీరంలో ఒక ఆణి లాగా ఉండిపోతుంది. అప్పటినుండి అతనిని ఆణి మాండవ్య అని కూడా పిలిచేవారు. ఆ త్రిశూలం కొన అలా శరీరంలో ఉండిపోవటం వలన మాండవ్యుడు ఎంతో బాధ అనుభవించేవాడు. ఏదన్నా వస్తువు ఆ ప్రదేశంలో తగిలినప్పుడు బాధతో విలవిల్లాడిపోయేవాడు.
ఒకసారి, మాండవ్యుడు యమధర్మరాజుని కలిసి అమాయకుడిని ఇంకా ఎవ్వరికీ హాని తలపెట్టని తనకు ఎందుకు ఇలాంటి కష్టాలు ఇచ్చావని ప్రశ్నిస్తాడు. అప్పుడు యమధర్మరాజు మాండవ్యుడితో ఇలా చెప్తాడు.
నీవు చిన్నతనంలో పక్షులను చాలా రకాలుగా హింసించేవాడవని ఆ పాపానికి ప్రతిఫలంగానే ఈ శిక్ష అనుభావిస్తున్నావు అని చెప్తాడు.
అయితే, పన్నెండు సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు చేసిన ఏ పని కూడా పాపం లాగా పరిగణించకూడదని ధర్మశాస్త్రాలు చెప్పాయని, బాల్యంలో చేసిన పనికి తనకు అన్యాయంగా శిక్ష వేశారని మాండవ్యుడు యమధర్మరాజుతో వాదిస్తాడు.
ఉత్తమ బ్రాహ్మణుడయిన తనను ఈ విధంగా శిక్షించి చంపాలని చూసిన యమధర్మరాజు చాలా పెద్ద పాపం చేసాడని చెప్పి అతనిని భూలోకంలో శూద్రునిగా పుట్టమని మాండవ్య మహాముని శపిస్తాడు. ఈ శాపం వల్ల, యమధర్మరాజు మహాభారత కాలంలో విదురుడిగా జన్మించాడని చెప్తారు.
విదురుడు ఎలా పుట్టాడు
ఇక ఇప్పుడు మనం విదురుడు ఎలా పుట్టాడో, ఎవరికి పుట్టాడో తెలుసుకుందాము.
మహాభారతంలో శంతన మహారాజుకి తన భార్య సత్యవతికి చిత్రాంగద, తరువాత విచిత్రవీర్య అనే కుమారులు కలుగుతారు. వీరికి భీష్ముడు, కృష్ణ ద్వైపాయన వ్యాసుడు సవతి సోదరులు.
కృష్ణ ద్వైపాయన వ్యాసుడు మనందరికీ తెలిసిన వ్యాస మహాముని. శంతన మహారాజు మరణించిన తరువాత పెద్దవాడయిన చిత్రాంగద కురు రాజ్యానికి రాజు అవుతాడు. అయితే, గంధర్వులతో జరిగిన ఒక యుద్ధంలో ఇతను మరణిస్తాడు. అప్పుడు భీష్ముడు బాలకుడయిన విచిత్రవీర్యను కురు సింహాసనం మీద కూర్చోపెడతాడు.
అతను యుక్తవయసుకు వచ్చిన తరువాత, భీష్ముడు విచిత్రవీర్యను కాశీ దేశపు రాజు కుమార్తెలయిన అంబిక మరియు అంబాలికలతో వివాహం జరిపిస్తాడు. అయితే వివాహం జరిగిన ఏడు సంవత్సరాలయినా కూడా వీరికి సంతానం కలుగదు. ఆ సమయంలోనే విచిత్రవీర్య అనారోగ్యం వచ్చి మరణిస్తాడు. ఈ విధంగా విచిత్రవీర్య మరణించటం వలన కురురాజ్యానికి వారసులు ఉండరు. అప్పుడు సవతి సోదరుడయిన వ్యాసుడితో నియోగ బంధం ద్వారా పిల్లలను కనాలని నిర్ణయిస్తారు.
నియోగ బంధం పూర్వకాలంలో ఉన్న ఒక ఆచారం. దీని ప్రకారం, పిల్లలు కలగని భార్యాభర్తలలో భార్య కానీ భర్త కానీ వేరొకరితో కలిసి పిల్లలను కనడానికి అనుమతిస్తారు. కాలక్రమంలో ఈ ఆచారం అంతరించిపోయింది.
ఈ ఆచారం ప్రకారం, ముందుగా అంబిక వ్యాసుడి వద్దకు వెళ్తుంది. అయితే, ఆ సమయంలో వ్యాసుడి తేజస్సు, శక్తి చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది. ఈ విధంగా భయపడి కళ్ళు మూసుకోవటం వలన ఆమెకు గుడ్డివాడయిన దృతరాష్ట్రుడు జన్మిస్తాడు.
ఆ తరువాత, అంబాలిక కూడా వ్యాసుడి వద్దకు వెళుతుంది. అంబిక విషయంలో జరిగిన తప్పు చూసిన అంబాలిక కళ్ళు తెరిచే ఉంటుంది కానీ చాలా భయపడిపోతుంది. దీని వలన అంబాలికకు పాలిపోయినటువంటి పాండు జన్మిస్తాడు.
ఆ తరువాత, తమ దాసి అయిన పరిశ్రామిని పంపుతారు. ఆమె మాత్రం వ్యాసుడి వద్దకు వెళ్ళినప్పుడు ఎంతో ధైర్యంగా, గౌరవంగా ప్రవర్తిస్తుంది. వీరికి కలిగిన కుమారుడే విదురుడు. అయితే, దాసి కుమారుడు అవటం వలన విదురుడి హోదా తక్కువగా ఉంటుంది.
శాపం వలన యమధర్మరాజు విదురుడుగా జన్మించటం, ఇంకా కురువంశంలో మహాముని అయిన వ్యాసుడికి దాసితో కలిగిన సంతానం అవ్వటం… ఈ విషయాలు తెలుసుకుంటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతోంది.
కురు సభలో విదురుడి పాత్ర
విదురుడు ఎన్నో ధర్మాలు తెలిసినవాడు, ఇంకా రాజనీతిజ్ఞుడు కూడా. కురుసభలో ఇతనికి ప్రత్యేకమయిన స్థానం ఉంది. ఎన్నో సందర్భాలలో విదురుడి జ్ఞానం రాజయిన దృతరాష్ట్రుడు తన పాలనలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి.
ఇంకా కురుసభలో మాయాజూదం జరుగకుండా ఆపడానికి విదురుడు ఎంతగానో ప్రయత్నించాడు. అయితే అతని మాటలను కౌరవులు ఎవరూ పట్టించుకోలేదు. ద్రౌపదికి జరిగిన అవమానం గురించి కురుసభలో వికర్ణుడితో కలిసి కూడా చాలా గట్టిగా నిరసించాడు. కౌరవులు చేస్తున్న పని చాలా నీచమయినదని, దుర్మార్గం అని తీవ్రంగా మందలించాడు.
తమను మందలించిన విదురుడిని దుర్యోధనుడు నిండు సభలో అందరి ముందూ చాలా దారుణంగా అవమానిస్తాడు. విదురుడిని కృతఘ్నుడని నిందిస్తాడు. ఇది గమనించిన దృతరాష్ట్రుడు తన సభలోని ప్రధాన మంత్రిని నిందించిన దుర్యోధనుడిని మందలిస్తాడు.
ఇది కూడా చదవండి: Archaeological Discoveries Proving Mahabharata
పాండవుల క్షేమం కోరుకున్న విదురుడు
విదురుడు అంటే పాండవులకు చాలా గౌరవం, మర్యాద కూడా. ఇతను పాండవులకు నమ్మకమయిన సలహాదారుడిగా కూడా ఉన్నాడు. పాండవులను లక్క ఇంట్లో ఉంచి సజీవదహనం చేసి చంపేయాలనే కుట్ర గురించి పాండవులను విదురుడు ముందుగానే హెచ్చరించాడు. ఇంకా అనేక సందర్భాలలో దుర్యోధనుడు పన్నుతున్న పన్నాగాలు గురించి పాండవులను హెచ్చరించి వారిని కాపాడాడు కూడా.
శ్రీకృష్ణుడికి కూడా విదురుడు అంటే ఎంతో గౌరవం. విదురుడిని కృష్ణుడు ఎప్పుడూ ధర్మానికి ప్రతీకగా గుర్తించి గౌరవించేవాడు. ప్రజల సంక్షేమం పట్ల విదురుడి ఉన్న అంకితభావం, ఇంకా అతని ధర్మనిరతిని, పరిజ్ఞానాన్ని గొప్పగా చూశాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలవడానికి ముందు, హస్తినాపురానికి పాండవుల తరఫున రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడు దుర్యోధనుడు రాజభవనంలో ఏర్పాటు చేసిన విలాసమయిన విడిది అంగీకరించకుండా, కౌరవ ఆస్థానంలోని ఒకే ఒక్క తటస్థ వ్యక్తి అయిన విదురుడి గృహంలో ఉండటానికి సుముఖత చూపిస్తాడు.
శ్రీకృష్ణుడిని విలాసాలతో ప్రలోభపెట్టి తన వైపు తిప్పుకోవాలని దుర్యోధనుడి కుటిల పన్నాగం. దీనిని ముందుగానే పసిగట్టిన శ్రీకృష్ణుడు దుర్యోధనుడి ప్రతిపాదనను నిరాకరిస్తాడు. విదురుడి గృహంలో విదురుడు, అతని భార్య అయిన సులభ అందించిన మర్యాద, ఆహరం ప్రేమతో, ఆప్యాయతతో కూడుకున్నవని శ్రీకృష్ణుడు గుర్తిస్తాడు. విదురుడి మంచితనానికి, ధర్మనిరతికి, విదురుడి మీద శ్రీకృష్ణుడికి ఉన్న గౌరవానికి, నమ్మకానికి ఈ సంఘటన మంచి ఉదాహరణ.
కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనకుండా పాండవులవైపు వచ్చేసిన విదురుడు
కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అవ్వడానికి ముందు నిండు సభలో కుటుంబ బంధానికి విలువ ఇవ్వకుండా దుర్యోధనుడు విదురుడిని అవమానిస్తాడు.
శ్రీకృష్ణుడు శాంతి కోసం దూతగా హస్తినాపురానికి వచ్చినప్పుడు కురు సభలో కృష్ణుడి సలహా, సూచనలు పాటించమని పదే పదే ప్రతీ ఒక్కరిని అడుగుతాడు విదురుడు. ఇలా మళ్ళీ మళ్ళీ అడగటంతో సభలో ఉన్న దుర్యోధనుడికి చాలా కోపం వస్తుంది. తమ దగ్గర ఉంటూ తాము ఇస్తున్న ఆహరం తింటూ, కౌరవులకు ద్రోహం చెయ్యాలని ఆలోచిస్తున్నాడంటూ విదురుడుని దుర్యోధనుడు అవమానపరుస్తాడు. తక్కువ జాతి తల్లికి పుట్టినవాడని అందుకే ఇలా చేస్తున్నాడని విదురుడి తల్లి గురించి, అతని పుట్టుక గురించి కూడా నిండు సభలో దారుణంగా అవమానిస్తాడు.
అతని మాటలకు తీవ్రంగా బాధపడిన విదురుడు వెంటనే తన పదవికి రాజీనామా చేస్తాడు. అంతే కాకుండా, తన విల్లును కూడా విరిచేసి తాను కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనను అని ప్రమాణం కూడా చేస్తాడు. మహాభారతంలో విదురుడి విలువిద్యా నైపుణ్యం గురించి ఎక్కువగా చెప్పిన సందర్భాలు లేవు. కానీ, విదురుడు గొప్ప విలుకాడు అని, అతను యుద్ధంలో కౌరవుల తరఫున పాల్గొని యుద్ధం చేస్తే అది పాండవులకు తీవ్రంగా నష్టం కలిగించి ఉండేదని అంటారు. అంతే కాకుండా విదురుడి దగ్గర ఉన్న విల్లు స్వయంగా మహావిష్ణువు రూపొందించిందని, విష్ణువు ఆజ్ఞతోనే విదురుడు దానిని విరిచి నాశనం చేశాడని కూడా చెప్తారు.
దుర్యోధనుడు తనను అవమానించిన సంఘటనను విదురుడు పాండవులతో కలిసిన తరువాత వాళ్ళ దగ్గర కూడా ప్రస్తావిస్తాడు. కురువృద్దులయిన ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు, కర్ణుడి లాగా దుర్యోధనుడికి, ఇంకా హస్తినాపురానికి తాను కట్టుబడి ఉండక్కర్లేదని, తన కుటుంబ బంధానికి మాత్రమే తాను బద్ధుడినని చెప్తాడు. అటువంటి విలువయిన కుటుంబ బంధాన్ని దుర్యోధనుడు మర్చిపోయి తనను అవమానించటం వలన, విదురుడు ధర్మం పాటిస్తున్న పాండవుల వైపు వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్తాడు.
విదురుడి మరణం
కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసిన తరువాత, ధర్మరాజు కురుసామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. అతని విజ్ఞప్తి మేరకు విదురుడు మళ్ళీ ప్రధానమంత్రి పదవిలో తిరిగి చేరతాడు.
ఇలా కొంత కలం గడిచిన తరువాత, ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీదేవి మిగిలిన జీవితం గడపడానికి అడవులకు వెళ్తున్నపుడు తాను కూడా వారిని అనుసరిస్తాడు. వీళ్ళతో పాటుగా సంజయుడు కూడా అడవులకు వెళ్తాడు. ఇలా వెళ్లిన రెండు సంవత్సరాలు అయిన తర్వాత, ఒకసారి ధర్మరాజు వారిని సందర్శించడానికి అడవికి వెళ్తాడు. అప్పుడు అడవిలో విదురుడి శరీరం నిర్జీవంగా పడి ఉన్నట్లు గుర్తిస్తాడు.
ధర్మరాజు విదురుడి నిర్జీవ శరీరం దగ్గరికి వెళ్ళినప్పుడు, వెంటనే విదురుని ఆత్మ ధర్మరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు వెంటనే ధర్మరాజు, తాను ఇంకా విదురుడు ఇద్దరూ ఒకే అస్తిత్వానికి చెందిన వాళ్లమని గ్రహిస్తాడు. విదురుడి శరీరాన్ని దహనం చేయబోతున్నప్పుడు ఆకాశం నుండి ఒక అశరీరవాణి పలుకుతూ విదురుడి దేహాన్ని దహనం చేయవద్దని చెప్తుంది. ధర్మరాజు ఆ విధంగానే విదురుడి శరీరాన్ని దహనం చేయకుండా ఆ నిర్జీవ దేహాన్ని చెక్కలో పెట్టి వదిలేస్తాడు. ఈ విధంగా విదురుడి పాత్ర మహాభారతంలో ముగుస్తుంది.
ఇది కూడా చదవండి: Mahabharata’s Magical Weapons
విదుర నీతి
ఎంతో ధర్మబద్దుడయిన, నీతిమంతుడయిన విదురుడి జీవితం అన్ని తరాలకూ ఆదర్శప్రాయం. మనం పుస్తకాలలో చదువుకొనే ఉంటాము… విదురుడి గొప్పతనం గురించి చెబుతూ, విదురుడి ధర్మ ప్రవచనాలను ప్రస్తావిస్తూ, “విదుర నీతి” అని మన పెద్దలు సంబోధించటం గమనించే ఉంటాము.
విదుర నీతి అనేది విదురుడు దృతరాష్ట్ర మహారాజుతో చెప్పిన నీతి సూక్తుల సంభాషణ. మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోని 33 నుండి 40 వరకు అధ్యాయాలలో, విదురుడు నాయకులు, తెలివయిన వారు చేయవలసిన, పాటించవలసిన, ఇంకా చేయకూడని విషయాలను గొప్పగా వివరించాడు.
దీనినే, కొన్ని కథలలో చాణక్యుడు చెప్పిన చాణక్య నీతి సూక్తులకు ప్రేరణ అని కూడా చెప్తారు. విదురుడు చెప్పిన ఆ నీతి సూక్తులలో కొన్ని ముఖ్యమయినవి ఇక్కడ మనం కూడా క్లుప్తంగా తెలుసుకుందాము.
- నాయకుడు అనేవాడు ధర్మంగా అందరి శ్రేయస్సును కాంక్షించాలి, ఇంకా ఏ సమూహానికి దుఃఖం కలిగించడానికి ఎప్పుడూ ఆలోచన చేయకూడదు
- కష్టాల్లో ఉన్న వారి మీద శ్రద్ధ చూపాలి. తనపై ఆధారపడిన వారి కష్టం చిన్నదే అయినా వాటిని విస్మరించకూడదు
- ఎంచుకున్న కొన్ని జీవులనే కాకుండా అన్ని జీవుల పట్ల కనికరం చూపాలి, అన్ని జీవులకు మేలు చేయాలి
- రాజ్యంలోని వ్యవసాయం మరియు ఆర్థిక కార్యకలాపాల అభివృద్ధిని ఎవ్వరూ, ఎట్టి పరిస్థితులలోనూ అడ్డుకోకూడదు
- తన మీద ఆధారపడిన వారిని రక్షించడానికి, వారి భద్రత చూసుకోవానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి
- న్యాయంగా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి, విజయం అనేది ఎప్పుడూ ధర్మంగానే సాధించాలి, అలాగే వచ్చిన విజయాన్ని ధర్మంగానే నిలబెట్టుకోవాలి
- రాజ్యంలోని ప్రజల సంక్షేమాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా సవీకరించాలి
- అందరికీ జ్ఞానాన్ని, విద్యను నేర్చుకోవడం ఇంకా ప్రసాదించటం అనే కార్యాలను ప్రోత్సహించాలి
- పాపం చేసే వారితో, పాపాత్ములతో స్నేహం చేయకుండా వారి స్నేహానికి దూరంగా ఉండాలి
- సంపదను ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదు, కఠినంగా మాట్లాడటం, ఇంకా క్రూరమైన శిక్షలు విధించటం చేయకూడదు
- రాజ్యపాలనలో ఎవరినయినా మంత్రులుగా నియమించే ముందు, వారి స్వభావాలు, ఆలోచనలు, ధర్మనిరతి, ఇంకా సామర్ధ్యం బాగా పరిశీలించిన తరువాతనే నియమించుకోవాలి
ఇటువంటి ఎన్నో వందల గొప్ప నీతులను, జీవితం నడిపే విధి విధానాలను, మంచివారికి ఉండాల్సిన గుణగణాలను విదురుడు ఈ లోకానికి నిర్దేశించాడు.
చివరిమాట
ఈ నీతులను న్యాయంగా, ధర్మంగా విధేయతతో పాటించినవారు నిజంగా ధన్యులు. ఈ కలి కాలంలో ధర్మం ఇంకా నిలబడటానికి ఇటువంటి పెద్దలు చెప్పి, ఆచరించిన సూక్తులు మూలాధారాలు. వీలయితే మనం కూడా వీటిని పాటించటానికి ప్రయత్నించి మంచి మార్గంలో పయనిద్దాం. మరొక్క మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.