హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో శివ కేశవులను పరమ భక్తితో పూజించుకొంటుంటారు. అంతేకాదు, తులసి మొక్కను కూడా పరమ పవిత్రంగా ఆరాధిస్తుంటారు. అయితే ఈ మాసంలో తులసిని విష్ణువు అతని శాలిగ్రామ అవతారంలో వివాహం చేసుకున్న ఓ ప్రత్యేక సందర్భం ఉంది. మరి ఈ ఏడాది ఆ రోజు ఎప్పుడొచ్చిందో… తులసి వివాహం ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
తులసి మొక్కను దేవతగా పూజించటం
తులసిని ‘వృంద’ అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో పరమ పవిత్రమైన మొక్క. ఈ మొక్కను దేవతగా భావించి ప్రతిరోజూ పూజిస్తారు. తులసిని లక్ష్మీ దేవి యొక్క స్వరూపంగా కూడా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభించి, కష్టాలన్నీ తొలగిపోతాయని, అలానే తమ కుటుంబంలో సుఖ శాంతులు వెల్లి విరుస్తాయని నమ్ముతారు. ఇక తులసి వివాహం చేయడం ద్వారా కన్యాదానానికి సమానమైన ఫలితాలు లభిస్తాయని, మోక్షానికి తలుపులు తెరుచుకుంటాయని కూడా నమ్ముతారు.
తులసి వివాహం జరుపుకొనే రోజు
విష్ణువుతో తులసికి జరిపే వివాహమే ఈ పవిత్ర దినం. ఇది భారతదేశంలో అతి ముఖ్యమైన పండుగ. ఈ పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో ప్రబోధిని ఏకాదశి, పదకొండవ చాంద్రమానం రోజున జరుగుతుంది. అంటే… దీపావళి తర్వాత 11వ రోజు వస్తుంది.
ఈ ఏడాది తులసి వివాహ శుభ ముహుర్తం
విష్ణువు నాలుగు నెలల నిద్ర తర్వాత కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి రోజున మేల్కొంటాడు. ఈ పవిత్రమైన సమయం ప్రారంభం నుంచి అన్ని రకాల శుభకార్యాలు మళ్లీ పునఃప్రారంభం అవుతాయి. అందుకే ప్రతీ ఏడాది ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి తిథి నాడు తులసిని శ్రీ మహా విష్ణువు శాలిగ్రామంతో వివాహం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొనబడింది. ఈ ఏడాది ఆ శుభ ముహూర్తం 24 నవంబర్ 2023న నిర్వహించబడుతుంది.
నవంబర్ 23వ తేదీ ద్వాదశి తిథి రాత్రి 9:01 గంటలకు ప్రారంభమయి… నవంబర్ 24వ తేదీన రాత్రి 7:07 గంటలకు ముగుస్తుంది. అంటే ఏకాదశి తిథి రోజున రాత్రి పూజా సమయం సాయంత్రం 5:25 గంటల నుంచి రాత్రి 8:46 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఈ శుభ సమయంలో తులసి వివాహం జరుపుకోవచ్చు.
తులసి వివాహం యొక్క ప్రత్యేకత
పరమ పవిత్రమైన ఈ హిందూ పండుగ పూర్తయ్యే వరకు ఇంట్లో అందరూ ముఖ్యంగా స్త్రీలు ఉపవాసం ఉంటారు. ఈ వివాహం అశుభానికి ముగింపు మరియు శుభానికి ప్రారంభాన్ని సూచిస్తుంది.
తులసి వివాహం వెనుక ఉన్న కథ
ఈ ఆచారం వెనుక ఓ ప్రత్యేకమైన కథ ఉంది. వృంద కాలనేమి అనే రాక్షసుని కుమార్తెగా పుడుతుంది. ఈమె జలంధర అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. తన భర్త పట్ల పూర్తి అంకితభావం కలిగి ఉండేది. వృంద గొప్ప విష్ణు భక్తురాలు. తన పవిత్రతను కాపాడుకున్నంత కాలం దేవుడు లేదా రాక్షసుడు ఎవరూ కూడా తన భర్తకు హాని చేయకుండా ఆమె బ్రహ్మదేవుని నుండీ వరం పొందింది. ఈ కారణంగా జలంధర తన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా… తన భార్య వృందా యొక్క ధర్మబద్ధమైన జీవనం కారణంగా అవి తొలగిపోయాయి.
ఇదిలా ఉంటే… జలంధరుని అక్రుత్యాలని సహించలేని దేవతలు విష్ణువు దగ్గర మొరపెట్టుకొంటారు. శ్రీమహావిష్ణువు జలంధరుడి రూపంలో వృంద యొక్క రాజభవనానికి వెళ్తాడు వృంద అతనిని చూసి తన భర్తే అనుకొని ఆలింగనం చేసుకుంటుంది. తర్వాత అతను తన భర్త రూపంలో వచ్చిన విష్ణువు అని గ్రహించి వెంటనే అతనిని రాయిగా మారిపోమని శపిస్తుంది. ఆ రాయినే ‘శాలిగ్రామం’ అంటారు.
మరోవైపు జలంధరుని పరమశివుడు అంతం చేస్తాడు. ఇక తన పవిత్రతను కోల్పోయిన వృంద ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆమె బూడిద నుండి ఒక మొక్క ఉద్భవిస్తుంది. శ్రీమహావిష్ణువు దానికి ‘తులసి’ అనే పేరు పెడతాడు. వచ్చే జన్మలో శాలిగ్రామ రూపంలో ఆమెను వివాహం చేసుకుంటానని వాగ్దానం కూడా చేస్తాడు. అప్పటినుండీ ప్రతీ సంవత్సరం తులసి మరియు శాలిగ్రామ వివాహాన్ని జరిపించటం ఆచారంగా వస్తుంది.
తులసి కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి
వృంద ఎప్పుడూ తన సంతోషం కన్నా భర్త సంక్షేమం గురించే ఆలోచించేది. త్యాగం మరియు నిస్వార్థత కలిగి ఉండి… ధృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళేది. తనపై ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోలేదు. చివరికి ప్రాణత్యాగం చేసినా కూడా తను కోరుకున్నది పొందేలా చూసుకుంది. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వృంద విధానాలని అవలభించటం అలవాటు చేసుకోవాలి.