Unknown Vishnu Avatars, Hindu Mythology

Forgotten Vishnu Avatars in Hindu Mythology

ఈ భూమిపై అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం శ్రీమహావిష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడని మనం చెప్పుకొంటూ వచ్చాం. భాగవత పురాణం ప్రకారం, శ్రీమహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలు 24. వాటిలో మనకి తెలిసింది ఆయన యొక్క దశావతారాలు మాత్రమే! దశావతారాల్లో ఒకటి ఇంకా పుట్టనే లేదు. ఈ కలియుగంలో పుట్టాల్సి ఉంది. ఇక పోతే దశావతారాల్లో చేర్చబడని ఆ మిగిలిన 14 ప్రసిద్ధ అవతారాల గురించి ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. 

హయగ్రీవ

హిందూమతంలో, హయగ్రీవ స్వామిని విష్ణువు యొక్క మరొక అవతారముగా భావిస్తారు. హయగ్రీవుడ్ని జ్ఞానానికి, వివేకానికి, వాక్కుకి, బుద్ధికి, ఇంకా అన్ని విద్యలకి దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా కూడా పూజిస్తారు.

ఈ అవతారంలో శ్రీ మహా విష్ణువు గుర్రం తల, మానవ శరీరం కలిగి ఉంటాడు. హయగ్రీవుడు తెలుపు రంగులో ఉంటాడు, అలానే తెల్లని వస్త్రాలను ధరిస్తాడు. హయగ్రీవుడికి ‘హయశీర్ష’ అనే మరో పేరు కూడా ఉంది. సంస్కృతంలో ‘హయ’ అంటే గుర్రం మరియు ‘శీర్షము’ అంటే తల. గుర్రపు  తల కలవాడు కాబట్టే అతనికి హయగ్రీవుడు అని పేరు వచ్చింది. శ్రీమద్ భగవద్ పురాణం ప్రకారం, హయగ్రీవుడిని శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి అని కూడా పిలుస్తారు. 

హయగ్రీవ అవతారం మధు మరియు కైటభ అనే ఇద్దరు రాక్షసుల కారణంగా ఉనికిలోకి వచ్చింది. ఈ ఇద్దరు రాక్షసులు బ్రహ్మదేవుని నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాచారు. అప్పుడు బ్రహ్మ  విష్ణువు యొక్క సహాయాన్ని అర్దిస్తాడు. అప్పుడు విష్ణువు ఈ భూమిపై హయగ్రీవుడిగా అవతరించి, మధు మరియు కైటబ్‌లను చంపి, వేదాలను తిరిగి తీసుకువెళతాడు.

వేద వ్యాసుడు

వ్యాసుడు ద్వాపర యుగంలో జన్మించిన అమర ఋషి. అతను హిందూ పురాణాలలోని నాలుగు వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు భారతం, భాగవతంతో పాటు అష్టాదశ పురాణాలను కూడా రచించాడు వ్యాసుడు. 

వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు. మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు తన కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ… అందరికీ కర్తవ్యబోధ చేస్తూ… తిరిగి తన దారిన తాను వెళ్ళిపోతాడు. అందుకే ఆయనని చాలా మంది విష్ణువు అవతారంగా భావిస్తారు.

సనాతన ధర్మంలోని అమూల్యమైన శాస్త్రాలన్నింటినీ ప్రపంచం కోల్పోయినందున విష్ణువు వేదవ్యాసుని  అవతారాన్ని తీసుకుంటాడు. తద్వారా అతను మళ్లీ అన్ని శాస్త్రాలన్నిటినీ తిరగ వ్రాసాడు. యుధిష్ఠిరుడు పుట్టడానికి 600 సంవత్సరాల ముందు వేద వ్యాసుడు జన్మించాడు. అంటే మహాభారతం జరగడానికి దాదాపు 600 సంవత్సరాల ముందే వేదవ్యాసుడు భారతాన్ని తిరిగి రచించారు. వేదవ్యాసుడు ఇప్పటికీ ఈ భూమిపై జీవించే ఉన్నారు. బద్రీనాథ్‌లోని మహా బదరికాశ్రమంలో నివసిస్తున్నారు. అయితే కలియుగంలోని సాధారణ మానవులకు ఈ ప్రదేశం అందుబాటులో ఉండదు.

మహీదాస ఐతరేయ

హిందూ శాస్త్రాల ప్రకారం, మహిదాస ఒక ఋషి కుమారుడు. ఇతను ‘ఐతరేయ బ్రాహ్మణం’ అనే బ్రాహ్మణాన్ని రచించాడు. ఐతరేయ బ్రాహ్మణం అనేది ఋగ్వేద శాఖకి చెందినది. ఇది పురాతన భారతీయ పవిత్ర శ్లోకాల సేకరణ. 

మహిదాస అనే పేరు వెనుక చాలా గొప్ప అర్ధమే ఉంది. ‘మహి’ అంటే భూమి’ ‘దాస’ అంటే దాసుడు లేదా సేవకుడు అని అర్ధం.  మహిదాస అంటే భూమికి సేవకుడు అని అర్ధం. 

మహిదాస శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైనందున  తన సహజ యోగ్యతతో తక్కువ వ్యవధిలో సనాతన ధర్మ శాస్త్రాలన్నింటినీ నేర్చుకున్నాడు. అందుకే మహిదాసుని భారతీయ తత్వశాస్త్రం యొక్క పితామహుడిగా పేర్కొంటారు. 

యజ్ఞం

శ్రీ మహా విష్ణువు యజ్ఞం అని పిలువబడే మరొక అవతారం తీసుకున్నాడు. యజ్ఞానికి యాగం అనే మరొక పేరు కూడా ఉంది. అలానే త్యాగం అనే వ్యక్తిత్వం ఉంది. యజ్ఞం అంటే ఆపద సమయంలో మానవాళిని కాపాడే దేవుడు. అందుకే విష్ణువును త్యాగానికి అధిపతి అని కూడా అంటారు.

యజ్ఞం లేదా యాగం ఇలా ఏ పేరుతో పిలిచినా… ఈ పవిత్రమైన కార్యక్రమం హిందువుల యొక్క ఒక విశిష్టమైన సంప్రదాయం. భారతదేశంలో పురాణకాలం నుండి వివిధ రకాలైన యజ్ఞాలు జరిగాయి. దేవతలకు తృప్తి కలిగించడమే ఈ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. యజ్ఞం వల్ల శ్రీహరి దేవతలకి త్రిలోక భయాలను పోగొట్టాడు.

సాధారణంగా యజ్ఞం అనేది హోమం వద్ద వేదమంత్రాల సహితంగా జరుగుతుంది. ఇందుకు అనుబంధంగా అనేక నియమాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం అనేది యజ్ఞంలో ముఖ్యమైన అంశం. యజ్ఞంలోని అగ్నిలో ఏవైతే సమర్పిస్తారో అవన్నీ దేవతలకు చేరుతాయి.

ఇది కూడా చదవండి: Mandodari’s Significance in Hindu Mythology

కపిల మహర్షి

హిందూ పురాణాల ప్రకారం, కపిల మహర్షి విష్ణువు యొక్క అవతారంగా వర్ణించబడింది. అతను తన బోధనల ద్వారా ధర్మ సమతుల్యతను పునరుద్ధరించడానికి భూమిపై జన్మించాడు. కపిల మహర్షి  ‘సాంఖ్య శాస్త్రం’ అనే గ్రంధాన్ని  రచించాడు. ఇది తత్వశాస్త్రం గురించి పూర్తిగా తెలియచేస్తుంది. దీనికి గల మరొక పేరు ‘సాంఖ్య కారిక’. 

నిజానికి ఈ కపిల మహర్షి సప్త ఋషులలో ఒకరు. విష్ణు పురాణంలో ఇతన్ని మహావిష్ణువు యొక్క అవతారంగా పేర్కొంటారు. ఈయన భక్తి యోగంలో ముక్తిని ఎలా సాధించాలో బోధించే గురువుగా ప్రసిద్ధి చెందాడు. బుద్ధుడు మరియు బౌద్ధమతంపై ఇతని ప్రభావం ఎంతో ఉంది. 

ధన్వంతరి

దేవతలను రక్షించడానికి శ్రీమహావిష్ణువు ధన్వంతరి అవతారాన్ని తీసుకుంటాడు. సముద్ర మథనం సమయంలో, అమృత కలశాన్ని పట్టుకొని సముద్రం నుండి ఒక దేవుడు ఉద్భవిస్తాడు. ఆతనినే ధన్వంతరి అని అంటారు. ధన్వంతరి విష్ణువు యొక్క అవతారాలలో ఒకరు, 

ధన్వంతరిని ‘వైద్యో నారాయణ హరి’ అని కూడా అంటారు. ధన్వంతరి తన నాలుగు చేతుల్లో జీవులందరి ఆరోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటాడు. అందుకే ఇతనిని ఆయుర్వేద పితామహుడిగా పరిగణిస్తారు. ఇంకా ఇతనిని ఔషధ దేవుడు లేదా ఆయుర్వేద దేవుడు అని కూడా అంటారు. అందుకే మంచి ఆరోగ్యం కోసం ఆయనను పూజిస్తారు. 

సుశ్రుతాచార్యను శస్త్రచికిత్స పితామహుడిగా భావిస్తారు. ధన్వంతరి నుండి చరకచార్య ఆయుర్వేద జ్ఞానాన్ని విస్తరించాడు. ఇప్పటికీ మన దేశంలో ఆయుర్వేద సంప్రదాయం చెక్కు చెదరకుండా ఉందంటే, దాని ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ధన్వంతరి అవతారాన్ని పురాణాల ప్రకారం, 4 కథలుగా వివరించారు. అవి: 

భాగవతం పురాణం ప్రకారం, క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేత బట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం.

బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, సూర్య భగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న ధన్వంతరి. ఇతడు సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.

వైద్య శాస్త్రం ప్రకారం, ధన్వంతరి అనే బిరుదు కలిగిన కాశీరాజు దేవదాసు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. పురాణాలలో ఇతనికి కూడా ధన్వంతరి అవతారమన్న పేరు ఉంది.

వైద్య శాస్త్రం ప్రకారం, ధన్వంతరి నిఘంటువు అనే పండితుడు విక్రమాదిత్యుని ఆస్థానంలో “నవరత్నాలు”గా ప్రసిద్ధులైన పండిత ప్రతిభామూర్తులలో ఒకడు. ఇతను ‘వైద్య పరిభాషిక పదకోశ’ గ్రంథాన్ని రచించాడని ఒక అభిప్రాయం అంటారు.

పూర్వకాలంలో ఉన్న గొప్ప ఆయుర్వేద వైద్యులందరినీ “ధన్వంతరి” అనే బిరుదుతో సత్కరించేవారు. కనుక వివిధ ధన్వంతరుల కథలు చరిత్రలో కలగలుపుగా ఉన్నాయి.

మోహిని

దేవతలకు దైవిక అమృతాన్ని అందించడానికి విష్ణువు ఎత్తిన మరో రూపమే ఈ మోహినీ అవతారం. మోహిని అనే పేరు “మోహ” అనే క్రియ మూలం నుండి వచ్చింది, దీని అర్థం “ఆకర్షించడం, మంత్రముగ్ధులను చేయడం, కలవరపడటం లేదా భ్రమ కలిగించడం”. సాహిత్యపరంగా చూస్తే “వ్యక్తీకరించబడిన భ్రాంతి” అని అర్థం.

సముద్ర మంథనం సమయంలో, అమృతంతో నిండి ఉన్న కలశం సముద్రం నుండి ఉద్భవించినప్పుడు, దేవతల నుండి ఆ అమృత కలశాన్ని లాక్కొని వెళతారు రాక్షసులు. అప్పుడు విష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపంలో వచ్చి, ఆ అమృత కలశాన్ని దేవతలకు పంచుతుంది. ఈ క్రమంలో ఆమె తన అందంతో రాక్షసులను మోసగించి, వాళ్ళంతా ఒక భ్రమలోకి వెళ్ళేలా చేసి మాయ చేస్తుంది. 

ఇలా రాక్షసులలో మాయను వ్యాప్తి చేయడానికి మరియు దేవతలకు సరైన జ్ఞానాన్ని మరియు అమృతాన్ని అందించడానికి విష్ణువు ఈ మోహిని అవతారాన్ని తీసుకుంటాడు. దీనికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది. రాక్షసులు అమరత్వం పొందితే ఈ భూమిపై క్రూరత్వం పెరిగిపోతుంది. అలా కాకుండా దేవతలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే, వారంతా అమరత్వం పొందాలి. అందుకోసం వారందరూ అమృతం తాగాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి: Uncovering the Mysteries of Krishna’s Mahasamadhi

దత్తాత్రేయ

దత్తాత్రేయ అవతారం విష్ణువు యొక్క మరో అవతారం.  ఇతనిని త్రిమూర్తి యొక్క అంశగా  పరిగణిస్తారు. ఇంకా యోగా దేవుడిగా పూజించబడుతుంటాడు. దత్తా అనే పదానికి “సమర్పించిన” అనే అర్థముంది. త్రిమూర్తులు అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు. కనుకనే ఇతనికి ‘దత్తా’ అని పేరు వచ్చింది. 

ఉత్తరాది సాంప్రదాయంలో, దత్తాత్రేయుడుుని ఒక అవతారంగానో లేదా శివుడి అవతారంగానో పేర్కొంటారు. మొదట్లో దత్తాత్రేయుడు తాంత్రిక లక్షణాలను ప్రదర్శించినప్పటికీ, తర్వాత భక్తితో వైష్ణవ పూజావిధానాలను అవలంబించి ఉన్నతునిగా మారాడు.

కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే, గురువు కంటే ఎక్కువగా కృపాస్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. అద్వైత వేదాంతాన్ని విశదీకరించి, ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు. దత్తుడు జ్ఞానబోధ కోసం తనను తాను అంకితం చేసుకున్నాడు.

సనత్ కుమారులు 

హిందూమతంలో, బ్రహ్మ మానస పుత్రులలో సనత్ కుమారులు ఒకరు. నిజానికి సనత్ కుమారులు అంటే ఒక్కరు కాదు, సనక, సనాతన, సనందన మరియు సనత్ కుమార్ అనే నలుగురు గొప్ప ఋషి పుంగవులు. జీవ సృష్టిలో బ్రహ్మకి సహాయం చేయడం కోసం బ్రహ్మ దేవుడు వారిని సృష్టించాడు. వారు పసిపిల్లల వంటివారు మరియు నిజంగా చాలా తెలివైనవారు.

ఈ ఋషి పుంగవులు విష్ణువును ప్రార్థించినప్పుడు, వారందరూ అందమైన చిన్న బాలుర రూపంలో అతనికి  కనిపిస్తారు. వెంటనే విష్ణువు వారికి దైవిక జ్ఞానం అనుగ్రహిస్తాడు. అందుకే విష్ణువు యొక్క మిగిలిన అవతారాలతో పోల్చి చూస్తే, ఈ అవతారం భిన్నంగా ఉంటుంది. 

రిషభ

దైవిక జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి విష్ణువు రిషభ భగవానుని అవతారాన్ని తీసుకుంటాడు. భాగవత పురాణంలో,  విష్ణువు యొక్క 24 అవతారాలలో లార్డ్ రిషభుడు ఒకరు. ఈ అవతారం జైనమతంలోని మొదటి తీర్థంకరుడైన రిషభనాథునితో సమానమని కొందరు పండితులు పేర్కొంటున్నారు. లింగ పురాణం వంటి శైవ గ్రంథాలు శివుని 28 అవతారాలలో ఋషభాన్ని గుర్తించాయి. ఇక్కడ దీని అర్థం “ఎద్దు” అని.  ఇది రుద్రునికి చెందినది. అలానే, రిషభ అనేది వేద సాహిత్యంలో కూడా కనిపిస్తుంది. 

విష్ణువు యొక్క ఈ అవతారం కథ ఏమిటంటే, రిషభుడు ఓ యువరాజు. కొంతకాలం తరువాత అతను ప్రతిదీ త్యజించి, సన్యాస ఆశ్రమంలో ప్రవేశిస్తాడు. ఒకానొక సమయంలో సనత్ కుమారులకి జ్ఞానోపదేశం చేస్తాడు. రిషభ జైనమత స్థాపకునిగా ప్రజలని నిజమైన మార్గంలో నడిపిస్తూ, అమరుడిగా పరిగణించబడ్డాడు. ఇప్పటికీ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాడు.

హంస

విష్ణువు వేదాలను బోధించడానికి హంస పక్షి అవతారాన్ని తీసుకుంటాడు. సనాతన ధర్మంలో, నింబార్క సంప్రదాయానికి మొదటి గురువు శ్రీ హంస భగవానుడు. ఆ విధంగా, హంస అవతారంలో విష్ణువు బ్రహ్మ కుమారులైన సనకాది ఋషులకు వేదాలను బోధించడానికి భూమిపైకి వచ్చాడు.

ఇక్కడ సనకాది ఋషులు అంటే నలుగురు సనత్ కుమారులు. వారి ప్రార్థనని మన్నించి, విష్ణువు వారి ముందు హంస రూపంలో దర్శనమిస్తాడు. మరియు వారికి దైవిక జ్ఞానాన్ని బోధిస్తాడు.

నర నారాయణులు

శ్రీమహావిష్ణువు నర, నారాయణ అనే ఇద్దరు కవలల అవతారం ఎత్తాడు. విష్ణువు యొక్క ఈ అవతారం భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించడానికి వచ్చింది. ఈ సోదరులు వారి శక్తివంతమైన ధ్యానంతో, శివుని విధ్వంసక ఆయుధమైన పాశుపథాస్త్రాన్ని అధిగమించారు. వారి ధ్యాన శక్తి కారణంగా సోదరులు గొప్పవారిగా పరిగణించబడ్డారు.

నరసింహ అవతారములో శ్రీహరి నరసింహ రూపం దాల్చి హిరణ్యకశ్యపుడిని సంహరిస్తాడు. అలా నరసింహ అవతారములోని నర రూపము నరుడిగా, సింహ రూపము నారాయణునిగా విడిపోయిందని పురాణాలు వివరిస్తున్నాయి. వీరిరువురు బదరికాశ్రమములో తపస్సు చేసుకొనెడివారు.

తాపస

హిందూ పురాణాలలో, తాపస అనేది నాల్గవ మనువు పేరు.  తాపసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీమహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి భూలోకానికి దిగి వస్తాడు.  అందుకే విష్ణువు యొక్క ఈ అవతారానికి తాపస అవతారం అని పేరు పెట్టబడింది. 

తాపసుడు జన్మించిన సమయంలో, ఈ భూమిపై ఘోరమైన తపస్సు జరిగింది. అందుకే అతనికి ఆ పేరు పెట్టారు. తపస మన్వంతరంలో ఏర్పడిన విష్ణువు యొక్క అవతారం కాబట్టి తాపస అవతారం అని పిలువబడింది.

సత్య యుగంలో ఒక మొసలి బారి నుండి గజముని రక్షించడానికి విష్ణువు ఈ అవతారాన్ని తీసుకుంటాడు. మొసలి ఏనుగు కాలు పట్టుకుని నదిలోపలకి  లాగుతూ ఉంటుంది. ఈ సమయంలో, ఆ ఏనుగు తనను రక్షించమని విష్ణువును ప్రార్థిస్తుంది.

ఆ విధంగా విష్ణువు తాపస యొక్క అవతారం తీసుకుని, గరుడదేవునిపై వచ్చి, మొసలి బారి నుండి గజముని కాపాడతాడు. చివరగా, విష్ణువు ఆ గజానికి మోక్షాన్ని  ప్రసాదిస్తాడు. అంటే వైకుంఠంలో ఒక స్థలాన్ని కేటాయిస్తాడు. దీనినే “గజేంద్ర మోక్షం” అంటారు.

ఆది పురుషుడు

ఆది పురుషుడు విష్ణువు యొక్క మొదటి అవతారం.  అంతేకాదు, ఈ విశ్వంలో మొదటి వ్యక్తిగా పరిగణించబడ్డాడు. హిందూ పురాణాల ప్రకారం, అతను పసుపు వస్త్రాలలో చిత్రీకరించబడ్డాడు, నాలుగు చేతులు కలిగి ఉంటాడు. శేషనాగ్ అనే సర్పాన్ని పాన్పుగా చేసుకొని దానిపై నిద్రిస్తాడు. 

ఈ విశ్వానికి మూలంగా విష్ణువు పరిగణించబడ్డాడు, ఎందుకంటే విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మ దేవుడే ఈయన నాబి ద్వారా ఉనికిలోకి వచ్చాడు. అందుకే ఆది పురుషుడు ఈ విశ్వానికి మొదటి పురుషుడు అయ్యాడు. 

నీతి

ఒక భక్తుడికి సహాయం చేయడానికి విష్ణువు ఏదో ఒక రూపంలో దిగివచ్చినప్పుడల్లా, అది ఆయన అవతారంగా పరిగణించబడుతుంది. ఇలా శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు ఎన్ని ఉన్నా… ప్రతి అవతారం యొక్క ముఖ్యోద్దేశ్యం లోక కళ్యాణం కోసమే!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top