సాదారణంగా మేఘాలు వర్షిస్తాయి, చెట్లు చిగురిస్తాయి. వర్షం పడి తగ్గిన తర్వాత కొంత సేపటి దాకా చెట్ల నుండీ నీటి బిందువులు జాలువారుతూ ఉంటాయి. ఇందులో కొత్తేమీ లేదు. కానీ, ఒక చెట్టు విచిత్రంగా వర్షపు నీటితో సంబంధం లేకుండా నిరంతరం వర్షపు జల్లు కురిపిస్తుంది. అది గంటలు, రోజులు కాదు కొన్ని వారాల తరబడి.
కర్ణాటకలోని కొడగు సమీపంలోని హెరవనాడు గ్రామంలో ఓ మిస్టరీ ట్రీ నిర్విరామంగా చినుకుల జల్లు కురిపిస్తుంది. ఆ చెట్టునుండీ నీటి జల్లు ఎక్కడినుండీ పడుతుందో అర్ధంకాక జనాలు జుట్టు పీక్కుంటున్నారు.
ఎండాకాలం…పట్టపగలు… అదికూడా మిట్ట మధ్యాహ్నం పూట ఇలా వర్షిస్తున్న చెట్టును చూడటానికి జనాలు ఎగపడుతున్నారు. ఇక్కడ అర్ధం కాని ప్రశ్న ఏంటంటే, ఇంతకీ ఆ చేట్టులోకి వాటర్ ఎక్కడినుంచీ వచ్చి చేరుతుంది అనేది. కొమ్మల నుంచి 10 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నీరు వచ్చి పడుతోంది. వారాల తరబడి కురుస్తున్నా వాటర్ ఫ్లో ఆగటం లేదు.
అయితే, ఈ చెట్టు శివునికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్ర వృక్షమట. అందుకే, ఇలా జరుగుతుందని స్థానికుల అభిప్రాయం. ఈ చెట్టుకు 500 మీటర్ల దూరంలో ఉన్న దేవరకాడులో భద్రకాళిదేవి ఆలయం ఒకటి ఉంది. ఆ అమ్మవారి మహిమ వల్లే ఇలా జరుగుతుందని మరికొందరి అభిప్రాయం.
ఇక ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పాకడంతో… ఈ వర్షిస్తున్న చెట్టును చూసేందుకు పెద్ద ఎత్తున జనం అక్కడికి చేరుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం కొన్ని రకాలైన చెట్లకు ఇలాంటి లక్షణాలు ఉంటాయని చెప్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ నీటిని పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపారు.