ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యామా అని ఇప్పుడు ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీని ఉపయోగించి… ఎవరో మొహానికి, మరెవరో ముహాలు సెట్ చేస్తూ ఫేక్ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ… ఇలాంటి వీడియోలను రూపొందిస్తూ… వైరల్ చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో టాలీవుడ్ నటి రష్మిక మందన వీడియో వైరల్ అయిన తర్వాత ఈ అంశం విపరీతమైన చర్చకు దారి తీసింది. ఆ తర్వాత కాజల్, కత్రినా కైఫ్ చివరికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి ఫేస్‌బుక్ హెడ్ మార్క్ జుకర్‌బర్గ్ వరకు దీని బారిన పడినవాళ్ళే! ఇక ఈ ఇష్యూపై ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించారంటనే పరిస్థితి ఎంత చేయి దాటి పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా విన్న తర్వాత అసలు ఏంటీ ‘డీప్‌ఫేక్’? అనే డౌట్ మీకు రావచ్చు.
డీప్‌ఫేక్ అంటే ఏంటి?
డీప్‌ఫేక్ అనేది కృత్రిమ మేధ (ఏఐ)ని ఉపయోగించి ఎవరిదైనా ఒక ఫేక్ ఫొటో లేదా వీడియోని రూపొందించే టెక్నాలజీ. ఇందులో ఏదైనా ఫొటో, ఆడియో, లేదా వీడియోను ఫేక్ గా చూపించడానికి ‘డీప్ లెర్నింగ్’ అనే ఏఐని వాడతారు. దీన్నే ‘డీప్ ఫేక్’ అని పిలుస్తారు. వీటిలో చాలావరకు పోర్న్ కంటెంట్స్ ఉంటాయి.
2017లో దీనిని ప్రవేశపెట్టినప్పటి నుంచి డీప్‌ఫేక్ యొక్క సోషల్ ఇంపాక్ట్ బాగా పెరిగింది. ఆమ్‌స్టర్‌డ్యామ్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ దీనిని డీప్‌ట్రేస్ చేసి చెప్పింది. డీప్‌ట్రేస్ అంచనా ప్రకారం ముఖ్యంగా మహిళలకు హాని కలిగించేందుకు ఈ డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీని ఉపయోగిస్తున్నట్లు తేలింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా డీప్‌ఫేక్ పోర్నోగ్రఫీ పెరుగుతోంది.
డీప్‌ఫేక్ టెక్నాలజీ కేవలం వీడియోలకే పరిమితమా?
కేవలం వీడియోలకే కాకుండా, ఫొటోలకు కూడా ఈ టెక్నాలజీని వాడుతున్నారు. అందుకే అవి ఫేక్ ఫొటోలని గుర్తించడం చాలా కష్టంగా మారుతుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఫేక్ ఆడియోలను కూడా తయారు చేస్తున్నారు. సెలెబ్రిటీల గొంతులను ఇమిటేట్ చేయటానికి ‘వాయిస్ స్కిన్’ లేదా ‘వాయిస్ క్లోన్’లను వాడుతున్నారు.
చట్టంలో ఉన్న నిబంధనలు ఏమిటి?
ప్రధాని నరేంద్ర మోదీ, ఇలా ఏఐని ఉపయోగించి డీప్‌ఫేక్‌లను సృష్టించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పులలో డీప్‌ఫేక్ ఒకటని, ఇది అరాచకానికి దారితీయవచ్చని’’ ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం త్వరలో డీప్‌ఫేక్ గురించి సోషల్ మీడియాతో చర్చించనున్నట్లు తెలిపింది. ఇండియన్ ఐటీ యాక్ట్-2000లోని సెక్షన్ 66E ప్రకారం, దీనిని క్రిమినల్ కేసుగా పరిగణించి శిక్ష విధిస్తారు. ఎవరికైనా హాని కలిగించాలనే దురుద్దేశంతో ఈ టెక్నాలజీ ఉపయోగిస్తే ఐటీ చట్టంలోని సెక్షన్ 66D కింద మూడేళ్ల వరకు శిక్ష లేదా ఒక లక్ష రూపాయల వరకూ జరిమానా పడుతుంది.
డీప్‌ఫేక్స్ ని ఎలా గుర్తించాలి?
డీప్‌ఫేక్ కంటెంట్‌ని గుర్తించడానికి కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అవి:
- డీప్‌ఫేక్ వీడియోలో ఉన్నవారు కనురెప్పలు ఆర్పలేరు. ఆ విధంగా కళ్లను చూసి గుర్తించవచ్చు.
- పెదవుల కదలికలకు, మాటలకు మధ్య సమన్వయం కుదరదు. అలా పెదవులను చూసి ఆ వీడియో డీప్‌ఫేక్ అని గుర్తించవచ్చు.
- డీప్‌ఫేక్‌లో పళ్లను మార్చడం చాలా కష్టం. ఇలా దంతాలను చూసి కూడా వీడియో డీప్‌ఫేక్ అని గుర్తించవచ్చు.
- డీప్‌ఫేక్ వీడియోలో హెయిర్ స్టైల్‌ను మార్చటం కూడా కష్టమే! అందుకే జుట్టుని గమనిస్తే తెలిసిపోతుంది.
చివరిమాట:
ఏదేమైనా ‘‘డీప్‌ఫేక్’ అనేది చాలా పెద్ద సమస్య. దీని నియంత్రణకి కఠిన చట్టాలు అవసరం. లేదంటే, భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.