ఆలయం అంటేనే ఒక పవిత్ర స్థలం. అలాంటి పవిత్ర స్థలంలో అడుగుబెడితే… బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతతని పొందవచ్చు. అయితే, ఆలయాలని నిర్మించేటప్పుడు ఎంతో శాస్త్రోక్తంగా… వేదమంత్రాల నడుమ… భీజాక్షరాలతో మూలవిరాట్టుని ప్రతిష్టిస్తారు. అందుకే ఆలయం ఓ శక్తి కేంద్రం. అంతటి దైవ శక్తిని తట్టుకొనే శక్తి మానవ మాత్రులెవ్వరికీ లేదు.
ఆలయాలకి ఇంత శక్తి ఉంది కాబట్టే, ఆలయ నీడకి కూడా అంత శక్తి ఉంటుంది. మరి అలాంటప్పుడు గుడి నీడ మన ఇంటిపై పడితే మన ఇంటికి శక్తి పెరగాలి కదా! కానీ, ఆ నీడ పడకూడదని ఎందుకు అంటారు? అని మీకు డౌట్ రావచ్చు.
నిజానికి మనిషన్నాక ఏదో ఒక తప్పు చేస్తుంటాడు. తప్పే చేయని మనిషంటూ ఎవ్వడూ లేడు. కానీ, ఎలాంటి కల్మషం లేకుండా… ప్రశాంత వదనంతో ఉండే వారి మనసు పరమాత్మతో సమానం.
అలాగే, ఇంట్లో నిత్యం పూజా, పునస్కారాలు, వ్రతాలూ, హోమాలూ వంటివి చేస్తూ… ఎంతో నిష్టగా ఉండే వారింట్లో భగవంతుడు ఎప్పుడూ కొలువై ఉంటాడు.
ఇంకా, సమాజంలో తోటివారిని ప్రేమిస్తూ… ఉన్నంతలో ఇంతరులకి దానం చేస్తూ… చిత్తశుద్ధితో మెలిగే వారిని దేవుడు ఎప్పుడూ కరుణిస్తాడు.
పైన చెప్పిన లక్షణాలన్నీ కలిగిన వ్యక్తులు నివసించే ఇంటిపై ఆలయ నీడ పడితే… వారు ఉచ్ఛ స్థితికి వెళతారు. ఇక వారి అభివృద్ధిని ఎవరూ ఆపలేరు.
కానీ, అలాంటివాళ్ళు ఏ నూటికో… కోటికో… ఒక్కరు ఉంటారు. అందుకే, సామాన్యంగా ఆలయ నీడ ఇంటిపై పడకూడదు అంటారు. ఒకవేళ అలా పడితే… వారి ఇంట్లో ఎలాంటి అభివృద్ధి ఉండదు.
అందుకే, శాస్త్రం తెలిసిన వారు ఆలయం ఉన్న చోట, ముఖ్యంగా గుడినీడ ఇంటిపై పడే చోట ఇల్లు కట్టుకోకూడదంటారు. ఒకవేళ గుడికి దగ్గర్లో ఇల్లు ఉన్నట్లయితే… ఆ కుటుంబలో కలహాలు చెలరేగుతాయి.
ఇక వాస్తు ప్రకారం అయితే, మనం నివసించే ఇల్లు శివుని ఆలయాలకి వెనుక వైపు, విష్ణువు ఆలయాలకి ముందు వైపు ఉండకూడదు. శివాలయానికి దగ్గరలో ఉంటే… శత్రు భయం ఉంటుంది. విష్ణు ఆలయానికి దగ్గరలో ఉంటే… ధనం నిలవదు. శక్తి ఆలయానికి దగ్గరలో ఉంటే… పురోగతి ఉండదు. వినాయకుని ఆలయానికి దగ్గరలో ఉంటే… అవమానాలు ఎదుర్కొంటారు.
అందుకే, మనం నివసించే ఇంటికి చుట్టుప్రక్కల ఏదైనా దేవాలయం ఉన్నట్లయితే… కనీసం దానికి 200 అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి.