భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. వీటితోపాటు ఆచారాలకు కూడా పెద్ద పీఠ వేస్తుంది. ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువ. చాలా మంది తమ ఇంటి గుమ్మం ముందు, దుకాణాల ప్రవేశ ద్వారం దగ్గర, వాహనాలకు ముందు నిమ్మకాయలను వేలాడదీయడం చూస్తుంటాం. ఇక కొంతమందైతే ఆ నిమ్మకాయలతో పాటు మిరపకాయల్ని కూడా కలిపి వేలాడదీస్తారు. అలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా..! దీని వెనుక ఓ సైంటిఫిక్ రీజనే ఉంది. అది ఏంటనేది చాలామందికి తెలియదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్ర కారణం:
ప్రవేశ ద్వారం దగ్గర నిమ్మకాయను వేలాడదీయడం వల్ల లోపలి నెగెటివ్ ఎనర్జీని దరిచేరనీయదు. అలాగే ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. నిమ్మకాయ, మరియు మిరప కాయలలో క్రిమిసంహారక గుణాలు ఉన్నాయి. వీటిని వేలాడదీయడం వల్ల పర్యావరణం కూడా స్వచ్ఛంగా మారుతుంది. చుట్టూ వ్యాపించిన ప్రతికూల శక్తిని నిమ్మకాయ గ్రహిస్తుంది, మరియు వాతావరణంలో సానుకూల శక్తిని అందిస్తుంది.
జ్యోతిష్య కారణం:
నిమ్మకాయలు, మిరపకాయలను కలిపి ఇళ్ళు, లేదా దుకాణాల బయట వేలాడదీయడం వల్ల చెడు దృష్టి నుంచి రక్షిస్తుంది. అలాగే మీ సంపద దిష్టిని పోగొడుతుంది. షాపులో వేలాడదీస్తే వ్యాపారం పెరుగుతుంది. ఇంటి ముందు వేలాడ దీస్తే సంపద పెరుగుతుంది.
శాస్త్రీయ కారణం:
సాయంత్రం అయ్యిందంటే చాలు ఇళ్లలోకి దోమలు, దీపపుపురుగులు వచ్చి చేరుతుంటాయి. ఇప్పుడంటే దోమల నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకాల మస్కిటో కాయిల్స్, వాడుతున్నాం కానీ, అప్పట్లో ఇలాంటి కెమికల్స్ ఏమీ లేవు. ఇలా నిమ్మకాయ, మిరపకాయలు కలిపి ఇంట్లో గుమ్మానికో… లేదంటే దూలానికో… వేలాడకట్టేవారు.
నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ ఈగలు, దోమలు, ఇతర కీటకాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. నిమ్మకాయను దారానికి కట్టి గుచ్చడం వల్ల అందులోని సిట్రస్ యాసిడ్ వాసన బయటకు వస్తూ పురుగులు రాకుండా నిరోధిస్తుంది. మిరపకాయలోని ఘాటు వాసన కూడా పురుగులు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
దృష్టి కారణం:
ఇళ్లు లేదా దుకాణాల ముందు నిమ్మకాయ-మిరపకాయలను వేలాడదీయడం వెనుక ఓ మంచి దృష్టి కారణం ఉంది. నిజానికి మిరపకాయ, నిమ్మకాయ లాంటివి కళ్లముందు కనిపిస్తేనే దాని రుచి మొదట మన మనసులో మెదులుతుంది. దీని కారణంగా, మనం దానిని ఎక్కువసేపు చూడలేం. వెంటనే మన దృష్టిని పక్కకు మళ్లించుకుంటాం.
డిస్క్లైమర్:
ఈ రోజుల్లో ప్లాస్టిక్‌తో చేసిన నిమ్మకాయలు కూడా మార్కెట్‌లో విరివిగా లభిస్తున్నాయి. చాలా మంది వాటిని తమ ఇళ్లలో, లేదా వ్యాపారాల్లో వేలాడదీస్తారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే దీని నుండి వాసన ఉండదు. ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఎప్పుడూ తాజా నిమ్మకాయ, మరియు మిరపకాయలనే వాడాలి. అలాగే, వాటిని ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి.